జడ్పీటీసీ ఎలక్షన్​లో ఓట్ల కిరికిరి

జడ్పీటీసీ ఎలక్షన్​లో ఓట్ల కిరికిరి
  •     తొగుటలో ముంపు గ్రామాల  ఏడు వేల ఓట్ల తొలగింపు
  •     అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న బాధితులు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా తొగుట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ముంపు గ్రామాలకు చెందిన ఏడు వేల ఓట్ల తొలగింపుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మల్లన్నసాగర్ నిర్మాణంతో తొగుట మండలంలోని బ్రాహ్మణ బంజేరుపల్లి, వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, రాంపూర్, పల్లెపహాడ్ గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఏడాది క్రితం గజ్వేల్ సమీపంలోని సంగాపూర్ వద్ద నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీకి గ్రామస్తులను తరలించి అక్కడే వారిని ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. కానీ ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఇండ్లకు నంబర్లు కేటాయించకపోవడంతో అడ్రస్ సమస్యతో ఎవరూ గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ఓటరుగా నమోదు చేసుకోలేకపోయారు. ఇదిలా ఉంటే గత ఏడాది నవంబర్​లో తొగుట జడ్పీటీసీ ఇంద్రసేనారెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. బై ఎలక్షన్​కు ఏర్పాటు చేస్తున్న ఆఫీసర్లు ముంపు గ్రామాలకు చెందిన 7,204 మంది  ఓట్లను తొలగించినట్టు ప్రకటించారు. తొగుట మండల పరిధిలో 22 గ్రామాలకు చెందిన మొత్తం 26,751 మంది ఓటర్లు ఉన్నారు.  2018 అసెంబ్లీ, 2019 పార్లమెంటుతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలతో పాటు ఏడాదిన్నర క్రితం జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ ముంపు గ్రామాల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తరువాత ముంపు గ్రామాలను సంగాపూర్ కు తరలించినా ఇప్పటికీ అవే గ్రామాల నుంచి ఎంపికైన సర్పంచ్, ఎంపీటీసీలు కొనసాగుతున్నారు. వారికి ఫండ్స్​సైతం కేటాయిస్తూ వస్తున్నారు. రూల్​ప్రకారం  సాధారణ ఎన్నికల సందర్భంలోని హద్దులు, పరిధి  తదుపరి సాధారణ ఎన్నికల వరకు కొనసాగుతాయని పేర్కొంటున్నందున జడ్పీటీసీ ఉప ఎన్నికలో ముంపు గ్రామాల ఓటర్లుకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్​ తెరపైకి వచ్చింది. 

ఓట్ల కొనసాగింపునకు వినతులు

తొగుట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ముంపు గ్రామాల ఓటర్లకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే ముంపు గ్రామాల ప్రజాప్రతినిధులతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మండల అధికారులు, కలెక్టర్ కు  వినతిపత్రాలను ఇచ్చారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇంకా పరిహారాలు, ప్యాకేజీలు, ఇండ్లు, ఓపెన్ ప్లాట్ ల కేటాయింపు పెండింగ్ లో ఉండగానే ఓటర్ల జాబితా నుంచి ఎలా తొలగిస్తారని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. పరిహారాలన్నింటినీ చెల్లించి శాశ్వత చిరునామాలు ఇస్తే గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో తాము ఓటర్లుగా నమోదు చేసుకుంటామని, అప్పటివరకు  తొగుట ఓటర్లుగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఎన్నికల నిర్వహణకు కసరత్తు

సిద్దిపేట జిల్లాలో స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు కసరత్తు  ప్రారంభించారు. జిల్లాలో తొగుట జడ్పీటీసీ, కుకునూరుపల్లి 2 ఎంపీటీసీ, 4 సర్పంచ్, 142 వార్డు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. జనవరి 1, 2022 నాటి  జాబితా ప్రకారం ఓటర్ లిస్టులను  అధికారులు విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ విషయంపై అధికారులు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేశారు. అభ్యంతరాలను పరిష్కరించి ఈ నెల 21, 23 తేదీల్లో ఫోటో ఎలక్టోరల్ ను విడుదల చేయనున్నారు. ఈ విషయంపై సిద్దిపేట ఆర్డీఓ అనంతరెడ్డి మాట్లాడుతూ ముంపు గ్రామాల నిర్వాసితులు గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోనే ఓటరుగా నమోదు చేసుకోవాలని చెప్పారు. జ్యూరిస్​డిక్షన్ మారినందున ముంపు గ్రామాల  నిర్వాసితులు తొగుట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో  ఓటు వేసే అవకాశం లేదన్నారు.