కొత్త జోన్లతో అన్ని అడ్డంకులు తొలగినట్లేనా?

కొత్త జోన్లతో అన్ని అడ్డంకులు తొలగినట్లేనా?

తెలంగాణలో పాత జోన్ల వ్యవస్థ రద్దయింది. ఏడు జోన్ల కొత్త వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో అన్ని ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయినట్టేనా? ఇక నోటిఫికేషన్లు ఇచ్చి ఏ సమస్య తలెత్తకుండా రిక్రూట్‌‌మెంట్లు పూర్తి చేయొచ్చా? అంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉందని సమాధానం చెప్పొచ్చు. కేంద్రం, రాష్ట్రపతి చేతుల్లో ఉన్న అడ్డంకులు క్లియర్ అయ్యాయి.  రాష్ట్ర ప్రభుత్వమే ఇక వేగంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా కొత్త జిల్లాలు, కొత్త జోన్ల ప్రకారం క్యాడర్ స్ట్రెంత్ రెడీ చేస్తే గ్రూప్స్ నోటిఫికేషన్లు ఇచ్చేయొచ్చు. అయితే టీచర్ల భర్తీ విషయంలోనే ఇంకా సమస్యలు ఉన్నాయి. కామన్ సర్వీసు రూల్స్ తేల్చాలి. ఈ ఇష్యూ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నా ఏండ్ల తరబడి సాగదీస్తూనే ఉంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాజ్యాంగంలోని 371– డిలోని (1)(2) క్లాజుల ద్వారా సంక్రమించిన అధికారాలతో ‘తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ) ఆర్డర్–2018’ ద్వారా 33 జిల్లాలు, 7 జోన్లు, రెండు మల్టీ జోన్లతో కూడిన ఉత్తర్వులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో పాత జోనల్ విధానం రద్దయి కొత్త జోనల్ వ్యవస్థ అమలులోకి వచ్చింది. దీంతో ఉద్యోగ నియామకాలకు ఆటంకాలు తొలగిపోయాయి.  మెజారిటీ డిపార్ట్‌‌మెంట్స్‌‌కు సంబంధించి.. నిజమైన స్థానికులకు న్యాయం జరిగేలా రిక్రూట్‌‌మెంట్స్ చేపట్టేందుకు లైన్ క్లియర్ అయింది.

పాత విధానంలో వెనుకబడిన వారికి అన్యాయం
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతమంతా రెండు జోన్లుగా ఉండేది. ఏజెన్సీ ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలు, అభివృద్ధి చెందిన జిల్లాలతో పోటీ పడాల్సిన తీరులో నాటి విధానం ఉండేది. దీని వల్ల వెనుకబడిన ప్రాంతాల వారికి అన్యాయం జరిగేది. దీన్ని నివారించడానికి అన్ని ప్రాంతాలకూ సమతూకం వచ్చేలా ఎక్కువ జోన్లను ఏర్పాటు చేయడంతో పాటు 2017లో జిల్లాల పునర్విభజన ద్వారా అన్ని జిల్లాలతో కూడిన రాష్ట్రపతి ఉత్తర్వుల అవసరం వచ్చింది. 2018లో 31 జిల్లాలతో కొత్త జోనల్ వ్యవస్థను రాష్ట్రపతి ఆమోదించినప్పటికీ  ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటుతో కొత్త జోన్లలో ఒకటి, రెండు మార్పుల వంటి అంశాలతో మరోసారి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ జరిగింది. 

90 శాతం స్థానికులకే
ఇటీవలే రాష్ట్రపతి ఆమోదించిన కొత్త ఉత్తర్వుల ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో అమలులో ఉన్న స్థానికత నిర్వచనం, జోనల్ వ్యవస్థ రూపం పూర్తిగా మారిపోయింది. గతంలో పదో తరగతి వరకు కనీసం నాలుగేండ్లు ఏ ప్రాంతంలో చదివాడో ఆ ప్రాంతమే ఉమ్మడి రాష్ట్రంలో అతని స్థానిక నివాసం అయ్యేది. అయితే కొత్త ఉత్తర్వుల ప్రకారం.. ఏడో తరగతి వరకు వరుసగా ఏడేండ్ల పాటు చదివిన ప్రాంతమే స్థానిక నివాసమై ఆ వ్యక్తి స్థానికతను నిర్దేశించనున్నది. ఆ జిల్లా ఏ జోన్‌‌లో ఉందో దాని పరిధిలోనే ఉద్యోగాలకు పోటీ పడాల్సి ఉంటుంది. ఈ మార్పుతో చదువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు కాకుండా,  ప్రాథమిక స్థాయిలో నివాసం ఉన్న ప్రాంతంలోని స్కూల్‌‌కు వెళ్తారు కాబట్టి నిజమైన వారే స్థానికులుగా ఉంటారనే భావన కనిపిస్తోంది. ఇక రెండు జోన్లుగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉండగా, ఇప్పుడు రెండు జోన్లను ఏడు జోన్లుగా మార్చడంతో జోనల్ పరిధి చిన్నగా మారి స్థానికులకు జోనల్ పోస్టులలో అవకాశాలు పెరుగుతాయి.  కొత్త ఉత్తర్వుల్లో పోస్టులన్నీ 95 శాతం స్థానికులకే రిజర్వు అవుతాయి. అయితే కొత్త ఉత్తర్వుల్లో కోర్టు కేసులు నడుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు సంబంధించిన ఏకీకృత సర్వీసుల అంశాన్ని  పక్కకు పెట్టి  ఉపాధ్యాయులను మినహాయించారు.

ఇంకా కామన్ సర్వీస్ రూల్స్ తేల్చలే
దాదాపు 20 ఏండ్లుగా వివాదంలో ఉన్న టీచర్ల కామన్ సర్వీస్ రూల్స్ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్నా ఎటూ తేల్చకుండా ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకుంటున్నవారికి అన్యాయం చేస్తోంది. ఈ అంశాన్ని రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సందర్భంగా ప్రభుత్వం చొరవ చూపితే సమస్య పరిష్కారమయ్యేది. కనీసం 2018లో హైకోర్టు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణం. స్థానిక సంస్థల యాజమాన్యంలోని టీచర్లు కూడా ప్రభుత్వ టీచర్లేనని 2015 సెప్టెంబర్ 30న సుప్రీం కోర్టు తీర్పులో స్పష్టం చేసింది. ఈ విషయంతో పాటు ఏకీకృత సర్వీసు నిబంధనలను రూపొందించడానికి రాష్ట్రపతి ఉత్తర్వులకు తగిన సవరణలు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని  సుప్రీం ఆదేశించింది. అయితే ప్రభుత్వ టీచర్లు, స్థానిక సంస్థల టీచర్ల సర్వీసులను వేర్వేరుగా లోకల్ కేడర్‌‌‌‌గా పరిగణించడానికి రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ పంపడానికి బదులుగా ఏకీకృతం చేస్తూ ఉత్తర్వుల సవరణ ప్రతిపాదించడంతో అదే విధంగా రాష్ట్రపతి ఆమోదించారు. ఈ సవరణను వ్యతిరేకిస్తూ 2018లో మళ్లీ హైకోర్టులో పిటిషన్ పడింది. దీని విచారణ సందర్భంగా ‘రాష్ట్రపతికి లోకల్ కేడరుగా ప్రకటించే అధికారం ఉంది. కానీ ఏకీకృతం చేసే అధికారం లేదు. ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే. ఆ అధికారాన్ని రాష్ట్రపతి ఓవర్​టేక్ చేయడం తగదు’ అని చెబుతూ ఏకీకృత ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. దీనిని బట్టి ప్రభుత్వ,  స్థానిక సంస్థల టీచర్ల సర్వీసులను వేర్వేరుగా లోకల్ కేడర్‌‌‌‌గా  ప్రకటించేందుకు మాత్రమే రాష్ట్రపతికి ప్రతిపాదనలు పంపి ఆమోదించిన తర్వాత,  రెండు లోకల్ కేడర్ సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వము 309 ఆర్టికల్ ద్వారా సర్వీసు నిబంధనలు రూపొందిస్తే సమస్య పరిష్కారమవుతుంది. రాష్ట్ర సర్కారు ఈ మేరకు చర్యలు తీసుకుంటే పాఠశాల విద్యాశాఖలో రెండు దశాబ్దాల సంక్షోభం సమసిపోతుంది. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లతో పాటు కొత్త ఉద్యోగాల భర్తీకి ఇబ్బందులు తొలగిపోతాయి. కానీ ఈ పని చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. అలాగే సుందరేశన్, కొఠారీ కమిటీల సిఫారసులను అమలు చేస్తే డిప్యూటీ ఈవో, ఎంఈవో, హెచ్‌‌ఎం లాంటి పర్యవేక్షణ పోస్టులు, బీఈడీ, డైట్ కాలేజీలోని లెక్చరర్ల పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అవుతుంది. 

ఖాళీల సంఖ్య తేల్చాలె
కొత్త జోనల్ విధానం ఫలితంగా 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీ జోన్లకు సంబంధించిన పోస్టులు, జిల్లాల వారీ  క్యాడర్ స్ట్రెంత్ రూపొందించిన తర్వాతే ఖాళీ పోస్టుల సంఖ్య తేలనున్నది. అప్పుడే నియామకాలకు లైన్‌‌ క్లియర్ అవుతుంది. ఏడేండ్లుగా దిక్కులేని గ్రూపు–1 లాంటి పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చే వీలు కలుగుతుంది. అయితే లక్షా 91 వేల ఖాళీ పోస్టుల భర్తీతో పాటు సుమారు లక్ష  కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తుందా? లేదా అన్నది వేచిచూడాలి. అలాగే గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీ స్కూల్స్‌‌, కాలేజీలు, వర్సిటీల్లో పనిచేసే వేలాది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ స్టాఫ్‌ను రెగ్యులర్ చేయాలి. ఇవన్నీ సాకారమైనప్పుడే కొత్త రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రయోజనం లభిస్తుంది. నిరుద్యోగ యువతకు ఊరట కలుగుతుంది. యూనివర్సిటీల్లోని 1799 అధ్యాపకుల ఖాళీల భర్తీకి రాష్ట్రపతి ఉత్తర్వుల అడ్డంకి ఏమీ లేదు.  అయినా ఎనిమిదేండ్లుగా 67% ఖాళీలతో విశ్వవిద్యాలయాల్లో చదువు సాగుతోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

కె.వేణుగోపాల్, 
టీపీటీఎఫ్ అడ్వైజర్