మిషిగాన్​ గగనతలంపై గుర్తు తెలియని మరో వాహనం

మిషిగాన్​ గగనతలంపై గుర్తు తెలియని మరో వాహనం

వాషింగ్టన్: అమెరికా గగనతలంపై మరో గుర్తుతెలియని వాహనం చక్కర్లు కొట్టింది. మొన్న అలస్కాలో, నిన్న కెనడా బార్డర్​ దగ్గర్లో.. ఇప్పుడేమో మిషిగాన్​ లోని లేక్​ హూరన్​లో గుర్తుతెలియని వాహనం కనిపించడంతో అమెరికా ఆర్మీ అలర్టయింది. ప్రెసిడెంట్ బైడెన్ సూచనలతో సదరు వాహనాన్ని కూల్చేశామని నార్త్​ అమెరికన్​ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్​(నోరాడ్​) హెడ్​ జనరల్​ గ్లెన్  వాహెర్క్  వెల్లడించారు. చైనా స్పై బెలూన్​ కూల్చివేత తర్వాత కేవలం మూడు రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న మూడో ఘటన ఇది. దీంతో అమెరికన్లలో భయాందోళనలు నెలకొన్నాయి. ఆర్మీ  కూల్చేసిన అనుమానిత వాహనాలు గ్రహాంతరవాసుల(ఏలియన్స్) కు చెందినవని అగ్రరాజ్యంలో ప్రచారం జరుగుతోంది. దీనిపై నోరాడ్​ బాస్  జనరల్​ గ్లెన్ వాహెర్క్​మాట్లాడుతూ.. అనుమానిత వస్తువులను కూల్చివేసిన ఘటనలకు సంబంధించి ఇంకా వివరాలు అందలేదని తెలిపారు. ప్రస్తతం ఏ విషయాన్నీ కొట్టిపారేయలేమని చెప్పారు. ఏలియన్స్ వచ్చారని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసేందుకు కానీ, నిజమేనని ధ్రువీకరించేందుకు కానీ తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు.

నిలిచిన విమానాల రాకపోకలు..

మిషిగాన్​ గగనతలంపై అనుమానిత వాహనాన్ని గుర్తించడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆ మార్గంలో ప్రయాణించాల్సిన విమానాలపై అధికారులు ఆంక్షలు విధించారు. ఎయిర్​ స్పేస్​ మూసేశారు. సదరు వాహనాన్ని కూల్చేసిన కాసేపటికి తిరిగి ఓపెన్  చేశారు. కూల్చివేత సందర్భంగా కింద ఉన్న నివాస ప్రాంతాలపై శకలాలు పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా ఆ శిథిలాలను సేకరించి, విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. ఆ వాహనాలు ఏంటి.. వాటిని ఎవరు పంపించారనే వివరాలు వెల్లడి కావడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు వివరించారు. భూమ్మీద ఉన్న ప్రాంతాలపై నిఘా పెట్టే సామర్థ్యం ఈ వాహనాలకు ఉందా..? లేదా  అనేది పరీక్షించి చూడనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే,  ఈ అనుమానాస్పద వాహనాలు గ్రహాంతరవాసులకు చెందినవని ప్రచారం జరుగుతోంది.. మీరేమంటారని జనరల్ వాహెర్క్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఏలియన్స్ వాహనాలా.. ఏమో అయుండొచ్చని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని జనరల్​ వాహెర్క్ దాటవేశారు.