ODI World Cup 2023: 15 మందిలో ఐదుగురికి గాయాలు.. ఇక కోచ్‌లు, సిబ్బందిని దించాల్సిందే!

ODI World Cup 2023: 15 మందిలో ఐదుగురికి గాయాలు.. ఇక కోచ్‌లు, సిబ్బందిని దించాల్సిందే!

ఓవైపు వరుస ఓటములు.. మరోవైపు కీలక ఆటగాళ్లు గాయాలబారిన పడటం న్యూజిలాండ్ జట్టును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కివీస్ వరల్డ్ జట్టులోని 15 మంది ఆటగాళ్లలో ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు గాయాల పాలయ్యారు. వీరిలో ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సహా మార్క్ చాప్‌మన్, లాఖీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, జిమ్మీ నీషమ్‌లు ఉన్నారు. తదుపరి మ్యాచ్ నాటికి వీరు కోలుకోకపోతే ప్లేయింగ్ 11 ఎవరనేది అంతుపట్టని విషయం.

 వన్డే ప్రపంచ కప్‌ను కివీస్ జట్టు ఘనంగా ఆరంభించింది. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో అన్నింటా విజయం సాధించి టైటిల్ రేసులో అందరికంటే ముందు మేమున్నామంటూ మిగిలిన జట్లకు హెచ్చరికలు పంపింది. కానీ ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. అనంతరం వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. అందుకు ప్రధాన కారణం.. కీలక ఆటగాళ్లు గాయాలబారిన పడటమే. ఇప్పటివరకూ కివీస్ 7 మ్యాచ్‌లు ఆడితే.. ఆ జట్టు కెప్టెన్ విలియమ్సన్(78 నాటౌట్) ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. బంగ్లాదేశ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో విలియమ్సన్ ఎడమ చేతి బొటన వేలుకు ఫ్రాక్చర్ అవ్వడంతో బెంచ్‌కే పరిమితమయ్యాడు. 

మరో నలుగురు

ఇక ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్క్ చాప్‌మన్ పిక్క పట్టేయడం, ఆపై ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ప్రధాన బౌలర్ ఫెర్గూసన్ గాయపడడం ఆ జట్టు విజయాలపై మరింత ప్రభావం చూపింది. ఇక బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పేస్ బౌలర్ మ్యాట్ హెన్రీ, ఆల్ రౌండర్ జిమ్మీ నీషమ్ కూడా గాయపడటం న్యూజిలాండ్ కష్టాలను రెట్టింపు చేసింది. ఈ  మ్యాచ్‌లో నీషమ్‌కు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ లేకపోవడంతో అతడు గాయంతోనే ఆటను కొనసాగించాడు.

 కోచ్‌లు, సిబ్బందే దిక్కు..!

ప్రస్తుతం కివీస్ వరల్డ్ కప్ జట్టులోని 15 మందిలో ఐదుగురు గాయాలతో బాధపడుతుండటంతో తదుపరి మ్యాచ్‌కు 11 మంది ఎవరనేది అంతుపట్టడం లేదు. మ్యాట్ హెన్రీ స్థానంలో కైల్ జేమిసన్ ను రీప్లేస్ చేసినా.. మరొక ఆటగాడు తక్కువ అవుతున్నారు. అందునా వీరిలో ఎవరూ గాయపడినా సబ్‌స్టిట్యూట్ చేసేందుకు ప్లేయర్లు కూడా లేరు.  ఈ క్రమంలో నెటిజన్స్.. కివీస్ బోర్డుకు వింత సలహాలు ఇస్తున్నారు. కోచ్‌లు, సిబ్బందిని బరిలోకి దించమని సూచిస్తున్నారు.

న్యూజిలాండ్ తదుపరి మ్యాచ్‌లు

ప్రస్తుతం కివీస్ జట్టు 7 మ్యాచ్‌ల్లో 4  విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. సెమీస్ చేరాలంటే తదుపరి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాలి.

  • నవంబర్ 4: పాకిస్తాన్ తో,
  • నవంబర్ 9: శ్రీలంకతో.. 

ALSO READ :- IND vs SL: గిల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్.. లేచి చప్పట్లు కొట్టిన సారా టెండూల్కర్