పట్టణ పేదలకు రూ. 100 కోట్లు కేటాయించిన ఒడిశా ప్రభుత్వం

పట్టణ పేదలకు రూ. 100 కోట్లు కేటాయించిన ఒడిశా ప్రభుత్వం

లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఒడిశా ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ వల్ల చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ వల్ల పట్టణాలలో పనికోసం వచ్చిన పేద కుటుంబాలను ఆదుకోవాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణాలలో నివసిస్తూ.. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న దాదాపు 4.5 లక్షల మంది పట్టణ పేద కుటుంబాలకు జీవనోపాధి కల్పించడానికి 100 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. రాష్ట్రంలోని 114 పట్టణ స్థానిక సంస్థలలో నివసిస్తున్న పేద కుటుంబాల జీవనోపాధిని నిలబెట్టడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు.

కార్మికులు, కూలీలు, రోజువారీ కూలీలకు జీవనోపాధి అవకాశాలను కల్పించేందుకు మిషన్ శక్తి శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ వరకు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. లాక్‌డౌన్ వల్ల ఆర్థికంగా బలహీనమైన వర్గానికి చెందిన వారికి పనుల ద్వారా జీవనోపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. కాలువలను శుభ్రపరచడం, శానిటైజేషన్, తవ్వడం, ఆట స్థలాల పునర్నిర్మాణం, ఉద్యానవనాల అభివృద్ధి మరియు ప్రభుత్వ మరుగుదొడ్ల నిర్మాణం వంటి అనేక పనులు ఈ కార్యక్రమం కింద చేపట్టనున్నట్లు సీఎం కార్యాలయ అధికారి తెలిపారు. ఈ పనులు చేసిన ప్రతి లబ్ధిదారుడికి సంబంధించిన వేతనాలు ప్రతి వారం వారివారి బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ అవుతాయని ఆయన తెలిపారు. కార్మికులు ఈ పనులు చేసేటప్పుడు ఖచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా.. పెయింటింగ్ వర్కర్లు కూడా కరోనా గురించి వాల్ పెయింటింగ్ చేసి జీవనోపాధి పొందవచ్చని ఆయన తెలిపారు.

For More News..

ఏప్రిల్ 21 నుండి అన్ని కాలేజీల్లో ఆన్‌లైన్ క్లాసెస్

వీడియో వైరల్: ఫోన్ చేస్తే ఇంటికొచ్చి బర్త్ డే చేసిన పోలీసులు