దొంగకు కరోనా.. 30 మంది పోలీసులు క్వారంటైన్​కు​

దొంగకు కరోనా.. 30 మంది పోలీసులు క్వారంటైన్​కు​

భువనేశ్వర్: అరెస్టయిన ఓ దొంగకు కరోనా పాజిటివ్ కన్ఫామ్ కావడంతో అతన్ని పట్టుకున్న పోలీసులందరినీ అధికారులు క్వారంటైన్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రంలోని పూరీ సిటీలో దొంగతనం చేసిన వ్యక్తిని కుంభర్‌పారా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ లో ఉంచారు. అతన్ని శనివారం ఎస్డీజేఎం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించేముందు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని అరెస్టు చేసిన పోలీసులు, కాంటాక్టు అయిన సిబ్బందిని క్వారంటైన్ కు తరలించినట్లు పూరి జిల్లా ఎస్పీ ఉమాశంకర్ దాస్ మీడియాకు వెల్లడించారు. నిందితుడితో ఆరుగురు సిబ్బంది కాంటాక్ట్ అయ్యారని, మొత్తం 30 మంది పోలీసు సిబ్బందిని క్వారంటైన్ లో ఉంచామని చెప్పారు. వారందరికీ టెస్టులు చేయిస్తామన్నారు. నిందితుడిపై నాలుగు దొంగతనం కేసులున్నాయని, అతడికి ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని తెలిపారు. నిందితుడ్ని పట్టుకున్న పోలీసులకు, జైలుకు తరలించిన సిబ్బందికి పరీక్షలు చేయించి.. అతడి కాంటాక్ట్ ట్రేస్ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వచ్చిన మొదటి ఖైదీ ఇతడేనని ఎస్పీ వెల్లడించారు. ఒడిశాలో ఇప్పటివరకు 828 కరోనా కేసులు నమోదు కాగా.. వైరస్ బారిన పడి నలుగురు చనిపోయారు.