స్టేట్ బ్యాంక్ హోమ్ లోన్లపై ఆఫర్లు

స్టేట్ బ్యాంక్ హోమ్ లోన్లపై ఆఫర్లు
  • వడ్డీ రేటు 6.7 శాతానికి తగ్గింపు
  • ప్రాసెసింగ్ ఫీజులు మాఫీ 

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్  హోమ్ లోన్లపై వడ్డీరేట్లను 6.7 శాతానికి తగ్గించింది. ఈ బ్యాంకు హౌసింగ్‌ లోన్లను ఏకరీతి వడ్డీరేటుతో అందించడం ఇదే మొదటిసారి.  పండుగ సీజన్ సమీపిస్తున్న సమయంలో ఈ ఆఫర్‌ను స్టేట్‌ బ్యాంక్‌ ప్రకటించింది. అంతేగాక జీరో ప్రాసెసింగ్ ఫీజు ఆఫర్ కూడా ఉంది. మామూలుగా అయితే రూ.75 లక్షలలోపు విలువైన హౌసింగ్ లోన్‌కు 7.15 శాతం వడ్డీని చెల్లించాలి. అయితే ఫెస్టివల్‌ ఆఫర్‌లో భాగంగా దీనిని 6.7 శాతానికి తగ్గించారు.  "రూ.75 లక్షల వరకు లోన్ తీసుకున్న కస్టమర్లకు ఈ ఆఫర్ వలన 45 బేసిస్‌ పాయింట్ల (బీపీఎస్) మేర వడ్డీ ఆదా అవుతుంది. దాదాపు రూ. 8 లక్షల కంటే ఎక్కువ మిగులుతుంది’’ అని స్టేట్ బ్యాంక్ తెలిపింది. ఇంతకుముందు హౌసింగ్ లోన్ వడ్డీ రేటు నాన్ శాలరీడ్ కస్టమర్లకు వేరేగా ఉండేది.  జీతం లేని కస్టమర్లు  ఎక్కువ వడ్డీ రేట్లు చెల్లించాల్సి వచ్చేది. "ఇప్పుడు, హౌసింగ్ లోన్ కస్టమర్లకు  వడ్డీ ప్రీమియం వసూలు చేయడం లేదు. దీనివల్ల నాన్ శాలరీ కస్టమర్లకు అదనంగా 15 బీపీఎస్‌ల మేర వడ్డీ ఆదా అవుతుంది. సాధారణంగా, రాయితీ వడ్డీ రేట్లకు కొన్ని షరతులు వర్తిస్తాయి.  కస్టమర్ జాబ్‌కు కూడా ఇవి లింక్ అయి ఉంటాయి. ఈసారి కస్టమర్లందరికీ ఒకే రకం వడ్డీరేటు వర్తింపజేస్తున్నాం. కస్టమర్  జాబ్‌తో సంబంధం లేకుండా అందరికీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి’’ అని స్టేట్ బ్యాంక్ ఎండీ సీఎస్ శెట్టి అన్నారు.  
బీఓబీ నుంచీ ఆఫర్లు..
బ్యాంక్ ఆఫ్‌ బరోడా కూడా పండగ సీజన్‌ సందర్భంగా హోం, వెహికల్‌ లోన్లపై ఆఫర్లు ప్రకటించింది. ఈ రెండు లోన్లపై వడ్డీని 0.25 శాతం తగ్గిస్తున్నట్టు పేర్కొంది. హోంలోన్ల ప్రాసెసింగ్‌ ఫీజును కూడా మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఫలితంగా హోంలోన్లపై వడ్డీ 6.75 శాతానికి, కార్‌ లోన్లపై వడ్డీ 7 శాతానికి తగ్గుతుంది. బోఓబీ వరల్డ్‌ వెబ్‌సైట్‌/యాప్‌ ద్వారా అప్లై చేసుకుంటే, అర్హులకు నిమిషాల్లోనే లోన్‌ మంజూరు చేస్తామని ప్రకటించింది. బ్యాంకుకు రాలేని కస్టమర్లకు డోర్‌స్టెప్‌ సేవలూ అందుబాటులో ఉన్నాయని బ్యాంక్‌  తెలిపింది.