- విధులకు ఆటంకం కలిగిస్తున్న కార్పొరేటర్ భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
కరీంనగర్ టౌన్,వెలుగు: తమ విధులకు ఆటంకం కలిగిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కరీం నగర్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది డిమాండ్ చేశారు. శుక్రవారం ఆఫీస్ ఎదుట అడిషనల్ కమిషనర్ సువార్త, డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ధర్నా చేసి మాట్లాడారు. 44వ డివిజన్ కార్పొరేటర్ మెండు శ్రీలత భర్త చంద్రశేఖర్(మార్షల్) గురువారం టౌన్ ప్లానింగ్ టీపీఎస్ తేజస్వినిని అక్రమ కట్టడడంపై నోటీసులు ఇవ్వకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని తీవ్రపదజాలంతో దూషించగా.. ఆమె కంటతడి పెట్టుకుంది.
అనంతరం అతనిపై కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా చంద్రశేఖర్ కమిషనర్ ఛాంబర్ కు వెళ్లి ప్రశ్నించగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ పమేలాసత్పతిని కలిసి వివరించగా కలెక్టర్ సీపీకి తెలిపారు. టౌన్ ప్లానింగ్ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తున్న చంద్రశేఖర్ పై వన్ టౌన్ లో కంప్లయింట్ చేసినట్టు అధికారులు సిబ్బంది చెప్పారు. శుక్రవారం ఉదయం పోలీసులు చంద్రశేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు. ధర్నాలో అసిస్టెంట్ కమిషనర్ వేణుమాధవ్, ఈఈ రెడ్డ యాదగిరి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.