ఎంక్వైరీ చేసిన్రు.. రిపోర్టు సీక్రెట్ గా పెట్టేసిన్రు!..సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో డబ్బు వసూళ్లపై గప్చుప్

ఎంక్వైరీ చేసిన్రు..  రిపోర్టు సీక్రెట్ గా పెట్టేసిన్రు!..సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో డబ్బు వసూళ్లపై గప్చుప్
  • సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో డబ్బు వసూళ్లపై గప్​చుప్
  • సీసీఐ ఆఫీసర్లు, మిల్లు ఓనర్లు, ఔట్​సోర్సింగ్ ఎంప్లాయీస్ కుమ్మక్కు
  • బయట మార్కెట్ లో రేట్​ తక్కువగా ఉండడంతో భారీగా వసూళ్లు

గద్వాల, వెలుగు: సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో డబ్బు వసూళ్లపై ఆఫీసర్లు మౌనం వహిస్తున్నారు. క్వింటాల్​కు రూ.500 నుంచి రూ.700 వరకు వసూలు చేశారని రైతులు బహిరంగంగా చెప్పినా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీఐ ఆఫీసర్లు, అవుట్  సోర్సింగ్ ఎంప్లాయీస్, మిల్లు ఓనర్లు కుమ్మకై జిల్లాలోని మూడు కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన విషయాన్ని రైతులు బయటపెట్టారు. 

ఈ వ్యవహారంపై సీసీఐ, విజిలెన్స్  ఆఫీసర్లు ఎంక్వైరీ చేసినా, రిపోర్ట్ ను మాత్రం సీక్రెట్ గా పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవుట్​సోర్సింగ్  ఎంప్లాయ్ పై చర్యలు తీసుకొని, మిగిలిన వారిపై చర్యలు తీసుకోకుండా మిల్లు ఓనర్లు చక్రం తిప్పారని అంటున్నారు. 

డబ్బు వసూళ్లు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమక్షంలో ఎంక్వైరీ చేయకుండా, నామ్​కే వాస్తేగా విచారణ చేపట్టడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. డబ్బు వసూలు చేసిన అసలు సూత్రధారులను వదిలేసి అవుట్  సోర్సింగ్  ఎంప్లాయ్​పై నిందలు మోపి మిల్లు ఓనర్లు, సీసీఐ ఆఫీసర్లు తప్పించుకున్నారని రైతులు అంటున్నారు.

మూడు మిల్లులకూ ఒకే పర్చేజింగ్  ఆఫీసర్..

జిల్లాలో పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ గద్వాలలో బాలాజీ కాటన్  జిన్నింగ్  మిల్, హరిత కాటన్  మిల్, అలంపూర్ లో వరసిద్ధి వినాయక కాటన్  మిల్లులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కొనుగోలు కేంద్రాలన్నింటికీ ఒకే పర్చేజింగ్  ఆఫీసర్  ఉండడంతో అవినీతికి ఆస్కారం ఏర్పడింది. ఒకే ఆఫీసర్​ మూడు మిల్లుల దగ్గర ఎలా పత్తిని కొనుగోలు చేస్తారనే విషయం ఆఫీసర్లకే తెలియాలని అంటున్నారు. పర్చేజింగ్  ఆఫీసర్ తో మిల్లు ఓనర్లు, అవుట్​ సోర్సింగ్  ఎంప్లాయీస్ కుమ్మక్కై ఒక్కో క్వింటాలుకు రూ.700 వరకు వసూలు చేశారు. ఈ విషయాన్ని ఎర్రవల్లి మండలం ధర్మవరం గ్రామ రైతులు వెలుగులోకి తీసుకొచ్చారు.

సీక్రెట్ గా ఎంక్వైరీ!

పత్తి అమ్మేందుకు డబ్బులు ఇచ్చిన రైతులను పిలవకుండా సీక్రెట్ గా మహబూబ్ నగర్  సీసీఐ బ్రాంచ్​ ఆఫీస్​ నుంచి ఆఫీసర్లు, విజిలెన్స్ అధికారులు వచ్చారు. శ్రీ బాలాజీ పత్తి మిల్లు దగ్గర ఇతర పత్తి మిల్లర్లు కూర్చొని తమకు అనుకూలమైన రైతులతో స్టేట్​మెంట్లు తీసుకొని వెళ్లిపోయారు. సీసీఐ ఆఫీసర్ కు వసూళ్లతో ఎలాంటి సంబంధం లేదని, కింది స్థాయి ఉద్యోగి డబ్బులు వసూలు చేశాడంటూ బలిపశువును చేశారని అంటున్నారు.

ప్రతీ సంవత్సరం ఇదే దందా..

సీసీఐ కొనుగోలు కేంద్రంలో ప్రతి ఏడాది వసూళ్ల దందా కొనసాగుతున్నట్లు రైతులు చెబుతున్నారు. క్వింటాల్​కు రూ.700 వరకు వసూలు చేయడంతో పాటు ఓటీపీ చెప్పేందుకు రూ.4 వేలు వసూలు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సారి బహిరంగ మార్కెట్ లో పత్తి రేటు తక్కువగా ఉండడంతో సీసీఐ ఆఫీసర్లు, పత్తి మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. సీసీఐ నాణ్యమైన పత్తి క్వింటాకు రూ.8,110 చెల్లిస్తుండగా, బహిరంగ మార్కెట్ లో రూ.6 వేల లోపే ధర పలుకుతోంది. దీంతో రైతులు ఆఫీసర్లకు డబ్బులు ఇచ్చి తమ పత్తిని సీసీఐకి కొనుగోలు కేంద్రాల్లో 
అమ్ముకున్నారు.

కొర్రీలతో వేగలేక రైతుల తిప్పలు..

కొనుగోలు కేంద్రాల్లో సీసీఐ అధికారులు, సిబ్బంది కొర్రీలతో రైతులు తిప్పలు పడుతున్నారు. వారికి డబ్బులు ఇవ్వలేక చాలా మంది రైతులు కర్నాటకలో పత్తి అమ్ముకున్నారు. ఈ సారి సీసీఐ కొనుగోలు కేంద్రాలకు 25 లక్షల క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వస్తుందని అగ్రికల్చర్  ఆఫీసర్లు అంచనా వేశారు. కానీ, ఇప్పటి వరకు1.75 లక్షల క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారు.

ఔట్​ సోర్సింగ్  ఎంప్లాయ్​ని తొలగించాం..

సీసీఐ కొనుగోలు కేంద్రంలో డబ్బు వసూళ్లపై ఎంక్వైరీ చేశాం. డబ్బు వసూలు చేసిన ఔట్​ సోర్సింగ్  ఎంప్లాయ్ ని తొలగించాం. సీసీఐ ఆఫీసర్ పై వచ్చిన ఆరోపణలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారు. ఎంక్వైరీ రిపోర్ట్​ పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. పుష్పమ్మ, మార్కెటింగ్ ఆఫీసర్, గద్వాల