రైతులను భూముల్లోంచి ఎల్లగొడుతున్రు!

రైతులను భూముల్లోంచి ఎల్లగొడుతున్రు!

సూర్యాపేట వెలుగు: ఓ సిమెంట్ ఫ్యాక్టరీకి భూకేటాయింపుల కోసం ఆఫీసర్లు రూల్స్​కు పాతరేసిన్రు. సర్కారు పెద్దలు ఆర్డర్​ వేయంగనే ఆగమాగంగా పబ్లిక్​ హియరింగ్​ పెట్టి  రైతులు ఒప్పుకోకున్నా 634 ఎకరాలను కేటాయించిన్రు. ఇందులో 64 ఎకరాల అసైన్డ్​ భూములు ఉండడంతో కొన్నేండ్లుగా వాటినే  దున్నుకొని బతుకుతున్న రైతు కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడుతున్నయి. వెంటనే భూములను తమకు అప్పగించాలని కంపెనోళ్లు దౌర్జన్యం చేస్తున్నరు. ఒప్పుకోని రైతుల పొలాల్లో రాళ్లు పోసి బెదింపులకు గురి చేస్తున్నరు. ఈ విషయంలో ఆఫీసర్లు, పోలీసులు యాజమాన్యానికే సహకరిస్తున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నరు.  ఇగ పట్టా భూములు కోల్పోతున్న రైతులది మరో గోస. బయట ఎకరాన రూ.50 లక్షలుంటే రూ.10 లక్షలు చేతిలో పెట్టి వెళ్లగొడుతున్నారని, ఇంత కంటే అన్యాయం ఉంటదా? అని అడుగుతున్నరు. 

కంపెనీ చేతిలోకి అసైన్డ్ భూములు..

సూర్యాపేట జిల్లా మేళ్ల చెర్వులోని మైహోమ్స్ సిమెంట్​ఫ్యాక్టరీ​ విస్తరణ కోసం  మేళ్లచెర్వుతో పాటు వేపల మాధారంలో 634ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో 64 ఎకరాల అసైన్డ్​ భూములున్నాయి.  వీటిని గత ప్రభుత్వాలు 40 పేద రైతు కుటుంబాలకు కేటాయించగా కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం కావాల్సినవాళ్ల కోసం పేదల నోటి కాడి బుక్క లాక్కున్నదనే విమర్శలు వస్తున్నాయి. మిగిలిన రైతుల నుంచి కూడా కేంద్ర భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా తమ భూములను దౌర్జన్యంగా గుంజుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మార్కెట్​ రేటు ఎకరాన రూ.50 లక్షలు ఉంటే తమకు రూ.10 లక్షలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మైహోమ్స్​ సిమెంట్​ ఫ్యాక్టరీ విస్తరణ కోసం జనవరి 5న ఆఫీసర్లు మేళ్లచెర్వులో పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 366 మందిలో కేవలం 51 మంది మాత్రమే భూములు ఇచ్చేందుకు ఒప్పుకోగా, మిగిలిన 314మంది రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో ఇచ్చిన 3వేల ఎకరాల్లోనే ఇప్పటివరకు ఎలాంటి మైనింగ్ చేయడం లేదని, ఇప్పుడు మళ్లీ కొత్త కేటాయింపులు ఎందుకని ప్రశ్నించారు. ప్రైవేట్​కంపెనీకి భూసేకరణకు మూడోవంతు నిర్వాసితులు ఒప్పుకోవాలని చట్టం చెబుతోంది. కానీ ఇక్కడ ఈ నిబంధనను పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల వ్యతిరేకతను ఏమాత్రం పట్టించుకోకుండా 64 ఎకరాల అసైన్డ్  భూమిని మైహోం సిమెంట్స్‌‌‌‌‌‌ కు 99 ఏండ్ల పాటు మైనింగ్‌‌‌‌ కోసం మార్చి16న లీజు కు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అసైన్డ్ భూముల్లోని రైతులను సిమెంట్ ఫ్యాక్టరీ యజమాన్యం దౌర్జన్యంగా ఖాళీ చేయిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. 

అసైనీలకు పైసా ఇస్తలేరు.. 

ఏళ్లుగా సాగు చేసుకుంటున్న అసైన్డ్​ భూముల్లోంచి తమను సిమెంట్​ ఫ్యాక్టరీ యజమాన్యం బలవంతంగా ఖాళీ చేయిస్తోందని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. తమ పొలాలను రాళ్లతో నింపేస్తున్నారని, పొలాలకు వెళ్లే దారులను మూసివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే చంపుతామని  బెదిరిస్తున్నారని అంటున్నారు. పట్టా ఉన్న రైతులకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇస్తున్న ఆఫీసర్లు తమకు పైసా ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఈ విషయమై ఆఫీసర్లకు, పోలీసులు ఫిర్యాదు చేసినా యాజమాన్యానికే వత్తాసు పలుకుతూ తమను  పట్టించుకోవడం లేదంటున్నారు. ఏళ్లుగా ఆ భూములనే సాగు చేసుకుంటున్నామని, ఇప్పుడు బలవంతంగా లాక్కొని తమ బతుకుదెరువును దూరం చేయవద్దని వేడుకుంటున్నారు. ఒకవేళ తప్పనిసరి తీసుకుంటే తమకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. కాగా, తమ భూములకు కూడా ఎకరాన రూ.10 లక్షలు కాకుండా మార్కెట్​ రేటు చెల్లించాలని పట్టా రైతులు డిమాండ్​ చేస్తున్నారు. 

రాత్రికి రాత్రే రాళ్లు పోసిన్రు.. 

 మాకు ఎలాంటి భూమి లేకపోవడంతో1998 లో ప్రభుత్వం సర్వే నెంబర్ 874లో మూడెకరాలు కేటాయించింది.  అప్పటి నుంచి అదే మాకు ఆధారం. ఇప్పుడు వచ్చి అవి మీ భూములు కాదు వెళ్లిపోర్రి అంటున్నరు. భూములను ఇవ్వనందుకు రాత్రికి రాత్రే మా పొలాన్ని రాళ్లతో నింపేసిన్రు. ఇన్నేళ్లు మా భూమి అనుకున్నది ఇప్పుడు ఎట్లా కాకుండ పోతది? ఏ ఆఫీసర్​కు కాంప్లెయింట్​ చేసినా పట్టించుకుంటలేరు. ఏం చేయల్నో అర్థమైతలేదు. 
‑ పోశాం గురువారెడ్డి, మేళ్లచెర్వు