
- అధికారుల తీరుపై స్థానిక ప్రజల ఆగ్రహం
- కలెక్టర్ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
కోనరావుపేట,వెలుగు: చెట్లను కాపాడవలసిన అధికారులే కొట్టేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. రోడ్డు పక్కన చెట్లను మేకలు మేస్తే, కొమ్మలు తొలగిస్తేనే ఫైన్లు వేసే అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోనరావుపేట ఎంపీడీవో ఆఫీసులోని ఖాళీ స్థలంలో కొన్నేండ్ల కిందట మొక్కలు నాటగా ఏపుగా పెరిగాయి. వివిధ పనుల కోసం ఆఫీసుకు వచ్చే ప్రజలు ఆ చెట్ల కిందనే సేద తీరేవారు.
అయితే.. మండలానికి ఒక మోడల్ ఇందిరమ్మ మోడల్ ఇల్లు నిర్మించేందుకు ఆఫీసులోని స్థలాన్ని కేటాయించడంతో అధికారులు చెట్లను కొట్టివేయించారు. ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసుల ముందు ఎక్కువగానే ఖాళీ జాగా ఉంది. కలెక్టర్ స్పందించి చెట్లను నరికిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై ఇన్ చార్జ్ ఎంపీడీవో శంకర్ రెడ్డిని వివరణ కోరగా.. మండల కేంద్రానికి కేటాయించిన ఇందిరమ్మ మోడల్ ఇల్లు నిర్మాణానికి ఆఫీసు వెనుక స్థలాన్ని హౌసింగ్ డిపార్ట్ మెంట్ అధికారులు పరిశీలించి.. అక్కడ నిర్మించేందుకు కాంట్రాక్టర్క్ కు అప్పగించారని చెప్పారు. సదరు కాంట్రాక్టర్ ఆ చెట్లను నరికివేసినట్టు చెప్పారు.