కేయూ భూముల కబ్జాలను పట్టించుకోని అధికారులు

కేయూ భూముల కబ్జాలను పట్టించుకోని అధికారులు

వరంగల్, వెలుగు: వరంగల్‍ లోని కాకతీయ యూనివర్సిటీ భూముల కబ్జాలను సీరియస్​గా తీసుకుని డిజిటల్​సర్వే చేయించిన ఆఫీసర్లు..చర్యల విషయంలో సైలెంట్​ అయ్యారు. రిపోర్టు వచ్చి ఆరునెలలైనా ఫైల్​ను మూలన పడేశారు. కేయూకు మూడు వైపులా వందల ఎకరాల ల్యాండ్ కబ్జా అయ్యింది. వర్సిటీ భూముల్లో ఇంకా కొత్త బిల్డింగులు కడుతూనే ఉన్నారు.  రూ. కోట్ల విలువైన భూముల కబ్జాపై స్టూడెంట్‍, ఉద్యోగ సంఘాలు చాలాసార్లు ఫిర్యాదులు చేశాయి. దీంతో గత ఏడాది వైస్‍ చాన్సలర్‍, పాలక మండలి మెంబర్స్​..జిల్లా కలెక్టర్​తోనూ.. హైదరాబాద్‍లోని ఉన్నతాధికారులతోనూ మాట్లాడి యూనివర్సిటీ భూముల డిజిటల్‍ సర్వే చేయించారు. కబ్జాలకు పాల్పడింది ఏవరైనా వదిలేదిలేదని.. ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటామని అప్పట్లో కేయూ అధికారులు ప్రకటించారు.  ల్యాండ్‍ సర్వేయర్లు, టెక్నికల్‍ టీం కలిసి సర్వే చేసి ఆరు నెలల కింద రిపోర్ట్​ ఇచ్చింది. రిపోర్ట్​ వచ్చినా చర్యలు తీసుకోకపోవడం పట్ల  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

యూనివర్సిటీ భూములు 1018 ఎకరాలు  

వరంగల్‍ లో 1968లో ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెంటర్​ను ఏర్పాటు చేశారు. అది ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీగా మారింది. కుమార్‍పల్లి, లష్కర్‍ సింగారం, పలివేల్పుల గ్రామాల పరిధిలో కేయూ కోసం దాదాపు 1018 ఎకరాల భూసేకరణ చేశారు. ఇందులో సగం గవర్నమెంట్‍ ల్యాండ్‍ కాగా.. మిగతా ల్యాండ్​ను పట్టాదారుల నుంచి కొనుగోలు చేశారు. ఎస్డీఎల్సీఈ జంక్షన్‍ నుంచి పెద్దమ్మగడ్డ రోడ్డు దాకా, వెనక వైపున  పలివేల్పుల మీదుగా గుండ్లసింగారం వరకు ఈ భూములున్నాయి. 1980లో ఎస్సారెస్పీ కెనాల్‍ కోసం రెండు  గుంటల భూమిని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వగా దానికి పరిహారం లభించింది. ఎస్డీఎల్సీఈ, రేడియో స్టేషన్‍, కేయూ కరెంట్‍ ఆఫీస్‍, బ్యాంక్‍, సీఆర్‍పీఎఫ్‍, ఫిల్టర్‍ బెడ్‍ ల కోసం భూములు కేటాయించారు. కరీంనగర్‍ రోడ్‍, ఎస్డీఎల్సీఈ నుంచి పెద్దమ్మగడ్డ రోడ్‍ వెడల్పు కింద కొంత భూమి పోగా.. మిగతా భూములు యూనివర్సిటీ ఆధీనంలో ఉన్నాయి. 

వాకాటి కరుణ హయాంలో కూల్చివేతలు 

కేయూ భూముల కబ్జాను 2013లో అప్పటి జిల్లా జాయింట్‍ కలెక్టర్‍ వాకాటి కరుణ సీరియస్‍గా తీసుకున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయించారు. ఫేక్‍ డాక్యుమెంట్లు క్రియేట్‍ చేసి యూనివర్సిటీ ల్యాండ్‍ కబ్జా చేసినవారిపై కేసులు పెట్టారు. రికార్డుల ట్యాంపరింగ్‍, అక్రమ ప్లాట్ల బిజినెస్‍  చేసేవారి భరతం పట్టారు. ఇప్పుడు లీడర్లుగా ఉన్న పలువురిపై రౌడీషీట్‍ ఓపెన్‍ చేయించారు. యూనివర్సిటీ భూముల బోర్డులు పెట్టించారు. ఆ తర్వాత కేయూ అధికారులు మళ్లీ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కేయూ చుట్టూ గోడ కట్టేందుకు ఫండ్స్​ఇచ్చినా పూర్తిగా కట్టలేదు. గత ఏడాది కేయూ వీసీగా బాధ్యతలు తీసుకున్న ప్రొఫెసర్ తాటికొండ రమేశ్‍ కబ్జాల మీద దృష్టి పెట్టారు. హనుమకొండ కలెక్టర్‍ రాజీవ్‍ గాంధీ హనుమంతుతో సమావేశమై.. కబ్జాల నియంత్రణ గురించి చర్చించారు. రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడి గత ఏడాది ఆగస్టులో డీజీపీఎస్‍ (డిఫరెన్షియల్‍ గ్లోబల్‍ పోజిషనింగ్‍ సిస్టం)  సర్వే ప్రారంభించారు. ఆగస్టులో ప్రారంభమైన సర్వే పూర్తి చేసి  జనవరి 13న కేయూ వీసీకి, జిల్లా ఆర్డీఓకు రిపోర్ట్​ ఇచ్చారు.  కేయూకు 622 ఎకరాల 20 గుంటల ల్యాండ్ ఉన్నట్లు తేల్చారు. భూములుండే మూడు గ్రామాల పరిధిలో కంబైన్డ్​ లొకేషన్‍ స్కెచ్‍, గూగుల్‍ మ్యాప్‍, ఏరియా లిస్ట్​  అధికారులకు ఇచ్చారు. ఏ సర్వే నంబర్‍లో ఎంత ల్యాండ్‍ ఉండాలి,  ప్రస్తుతం ఎంత ఉంది,  ఎక్కడ ఆక్రమణలున్నాయి వంటి వివరాలన్నీ రిపోర్ట్​లో ఉన్నాయి. రిపోర్ట్​ రాగానే ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటారని భావించినా ఎలాంటి కదలిక కనిపించడంలేదు.  భూకబ్జాలపై వేసిన కమిటీకి చైర్మన్‍గా ఉన్న పాలక మండలి సభ్యుడు, ప్రొఫెసర్‍ తాళ్లపెల్లి మనోహర్‍ రెండు వారాల కింద పదవి నుంచి తప్పుకున్నారు. కబ్జా అయిన స్థలంలోనే కమిటీ  సభ్యుడైన అసిస్టెంట్‍ రిజిస్ట్రార్‍ ఇల్లుఉన్నట్టు కార్పొరేషన్‍ నోటీస్‍ ఇవ్వడమే ఆయన రాజీనామాకు కారణమని భావిస్తున్నారు.  

కబ్జాదారుల్లో లీడర్లు, ఆఫీసర్లు  

కేయూ భూములను  కొందరు వర్సిటీ సిబ్బంది కబ్జా చేశారు. కేయూ భూముల రికార్డులను మార్చేసి..ఫేక్‍ డాక్యుమెంట్లు క్రియేట్‍ చేశారు. ఈ డాక్యుమెంట్లతో భూములను అమ్ముకున్నారు. ఇదంతా కేయూ అధికారులకు తెలిసినా పట్టించుకోక పోవడంతో కబ్జాదారులు  రెచ్చిపోయారు. పలివేల్పుల దారితో పాటు 412, 413, 414 సర్వే నంబర్లలో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయి. కబ్జాదారుల్లో కొందరు రాజకీయనాయకులు, ఏసీపీ, సీఐ స్థాయి పోలీసులు, పలు శాఖలకు చెందిన సర్కారు ఆఫీసర్లు, కేయూ సిబ్బంది ఉన్నారు.

పాత సర్వే తప్పులపై కంప్లైంట్​ 

డిజిటల్‍ సర్వేకు  ముందు కేయూ భూములు సర్వే చేసిన వరంగల్‍ సర్వే ఆఫ్‍ ల్యాండ్‍ రికార్డ్స్​ఏడీ ప్రభాకర్‍ కబ్జాదారులతో చేతులు కలిపి వారికి అనుకూలంగా రిపోర్ట్​ ఇచ్చారని దేవరకొండ నగేశ్‍ ల్యాండ్‍ రికార్డ్స్​ కమిషనర్‍కు ఫిర్యాదు చేశాడు. మరో నాలుగు సర్వేల్లోనూ ప్రభాకర్‍ తప్పుడు రిపోర్టలిచ్చారని ఫిర్యాదు చేయడంతో పాత  రికార్డులతో జులై 4న విచారణకు రావాలని ప్రభాకర్​కు కలెక్టర్‍ నోటీసులు పంపారు. దీంతో గతంలో తప్పుడు సర్వేలు , ఇప్పుడు డిజిటల్​ సర్వే రిపోర్ట్​ వచ్చినా మౌనం వహించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.