కార్మికులకు 20 శాతం వాటా ఇస్తేనే టికెట్ ధరల పెంపు.. సినీ కార్మికుల అభినందన సభలో సీఎం రేవంత్

కార్మికులకు 20 శాతం వాటా ఇస్తేనే టికెట్ ధరల పెంపు.. సినీ కార్మికుల అభినందన సభలో సీఎం రేవంత్

సినీ కార్మికుల శ్రమ తనకు తెలుసునని.. ఆస్కార్ స్థాయికి తెలుగు పరిశ్రమ వెళ్లింది అంటే కారణం కార్మికులేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంగళవారం (అక్టోబర్ 28) హైదరాబాద్ యూసుఫ్ గూడలో ఏర్పాటు చేసిన సినీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఇక నుంచి సినిమా టికెట్ ధర పెంచాలంటే కార్మికులకు 20 శాత ఇవ్వాలని అన్నారు. వాటా ఇస్తేనే టికెట్ల పెంపుకు జీవో ఇస్తామని చెప్పారు. 

కాంగ్రెస్ ప్రభుత్వాలు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేసినట్లు చెప్పిన సీఎం రేవంత్. 1964లో నంది అవార్దులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు.   హైదరాబాద్ కు సినీ పరిశ్రమ రావడంలో మర్రిచెన్నారెడ్డి పాత్ర కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఎంతో మందిని సంప్రదించి పరిశ్రమను తెచ్చారని గుర్తుచేశారు. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి సినీ కార్మికులను ఆదుకున్నారని.. కార్మికుల కోసం పది ఎకరాలు ఇచ్చారని తెలిపారు.  

 గత ప్రభుత్వం నంది అవార్డులను పట్టించుకోలేదని అన్నారు.  ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ పేరుమీదు.. గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్‌ను ప్రకటించి చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. హాలీవుడ్‌ను హైదరాబాద్ కు తీసుకువచ్చే బాధ్యత తనదని ఈ సందర్భంగా సీఎం అన్నారు. చిన్న సినిమాలను తక్కువచేసి చూసే ప్రసక్తే లేదని చెప్పారు. సినీ కార్మికులు అండగా ఉంటే హైదరాబాద్ కు హాలీవుడ్ తీసుకొస్తానని అన్నారు.

►ALSO READ | రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో విషాదం.. తండ్రి పనికెళ్లి ఇంటికొచ్చేసరికి..

పరిశ్రమను ప్రోత్సహించేందుకు కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు సీఎం. సినీ కార్మికులకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. కృష్ణానగర్ ప్రాంతంలో సినీ కార్మికుల పిల్లలు చదువుకునేందుకు 3-4 ఎకరాల్లో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాల నిర్మిస్తామని అన్నారు. కార్మికుల కోసం వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని.. ప్రభుత్వం తరఫున రూ.10 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీలో సినీ పరిశ్రమకు ఒక చాప్టర్ కేటాయిస్తామని అన్నారు.