ఏఎమ్మార్పీలో అధికారుల ఇష్టారాజ్యం

ఏఎమ్మార్పీలో అధికారుల ఇష్టారాజ్యం
  • స్పెషల్​ డిప్యూటీ కలెక్టర్​ పైన ఉద్యోగుల మండిపాటు
  • చెప్పాపెట్టకుండా సెలవుపై వెళ్లాడని ఆగ్రహం
  • ఆలస్యంగా నల్గొండ ఆర్డీఓకు ఇన్​చార్జి బాధ్యతలు

నల్గొండ, వెలుగు : జిల్లా కేంద్రంలోని ఎలిమినేటి మాదవరెడ్డి ప్రాజెక్టు ఆఫీసులో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. యూనిట్​2లో స్పెషల్​ డిప్యూటీ కలెక్టర్​పనితీరు పైన ఉద్యోగులు మండిపడుతున్నారు. చెప్పాపెట్టకుండా సెలవుపై వెళ్లడమే కాకుండా, ఉద్యోగుల జీతాల విష యంలో కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... ఏఎమ్మార్పీ స్పెషల్​ కలెక్టర్​(పులిచింతల) పరిధిలో రెండు యూనిట్లు ఉన్నాయి. యూనిట్​-2కు ఆయనే స్పెషల్​ డిప్యూటీ కలెక్టర్​గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అయితే కొంత కాలంగా ఆయన యూనిట్​-2 ఆఫీసుకు రావడం లేదు. ఉద్యోగులు ఆరా తీస్తే ఫిబ్రవరి 10 వరకు సెలవుల్లో ఉన్నాడని తెలిసింది. ఈ సెలవుల ఆర్డర్​ కాపీ సీసీఎల్ఏ నుంచి కలెక్టర్​కు జనవరి చివరి వారంలో చేరింది. అప్పటి వరకు ఈ విషయం బయటకు చెప్పకుండా గుట్టుగా ఉంచారు. దీంతో యూనిట్​-2లో జీతాల బిల్లుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు తమ అధికారి కనిపించడం లేదనే విషయాన్ని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన సెలవులో  వెళ్లడంతో.. నల్గొండ ఆర్డీఓను ఇన్​చార్జిగా నియమించారనే విషయం ఉద్యోగులకు ఆలస్యంగా తె లిసింది. ప్రతి నెలా 25 లోపే జీతాల బిల్లులు రావాల్సి ఉండగా.. అధికారి సెలవులో ఉండటం తోపాటు, ఇన్​చార్జికి బాధ్యతలు లేట్​గా అప్పగించడంతో జనవరి జీతాలు రాలేదు. కానీ, సదరు అధికారి అధికారి జనవరి 19న పులిచింతల యూనిట్​ ఉద్యోగుల జీతాల బిల్లులు పాస్​ చేశారు. ఒక యూనిట్​ ఉద్యోగులకు బిల్లులు పాస్​ చేసి, మరో యూనిట్​ ఉద్యోగులను పట్టించుకోవడం లేదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో భూసేకరణ, ల్యాండ్​ సర్వే, పునరావాస ప్యాకేజీ కార్యక్ర మాలకు సంబంధించిన పనులేవీ జరగడం లేదు. దీంతో యూనిట్​లో తహసీల్దార్​ కేడర్​ కలిగిన అధికారులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే డిపార్ట్​మెంట్​లో అవుట్​ సోర్సింగ్​ కింద 15 మందికి పైగా పనిచే స్తున్నారు. అవుట్​సోర్సింగ్​ ఉద్యోగులు, ఇతర స్టాఫ్​ జీతాలు అందక ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు దీనికి అనుసంధానంగా పనిచేస్తున్న ల్యాండ్​ సర్వే రికార్డ్స్​ డిపార్ట్​మెంట్స్​లో కూడా డిప్యూటీ ఇన్​స్పెక్టర్​ స్థాయి కలిగిన అధికారులకు కూడా ఇప్పుడు చేసే పనేమీ లేకపోవడంతో తాము ఖాళీగా కూర్చోవాల్సి వస్తుందని కృష్ణ అనే అధికారి ఇటీవలే రీజనల్​ డి ప్యూటీ డైరెక్టర్​ను కలిసి ఫిర్యాదు చేశారు. 

ఆర్డర్లు ఆలస్యంగా వచ్చాయి..

స్పెషల్​ డిప్యూటీ కలెక్టర్​, పులిచింతల ఎస్డీసీ ఆర్డర్లు ఆలస్యంగా వచ్చాయి. ఆ సమాచారం నాకు చెప్పలేదు. యూనిట్​ 2 ఉద్యోగులు జీతాలు ఆగిపోయాయని నా దృష్టికి తెచ్చారు. మళ్లీ ఫిబ్రవరి 5 తర్వాతే బిల్లులు పంపే వీలుంది. పులిచింతల ఉద్యోగుల జీతాలు వచ్చాయి. వాళ్లు ముందుగానే అప్పటి అధికారితో సంతకాలు పెట్టుకున్నట్టు తెలిసింది. 

- జయశ్చంద్రా రెడ్డి, నల్గొండ ఆర్డీఓ