వాసాలమర్రి అభివృద్ధికి రూ.165 కోట్ల ప్రపోజల్స్.. రూ. 58.57 కోట్లే మంజూరు

వాసాలమర్రి అభివృద్ధికి రూ.165 కోట్ల ప్రపోజల్స్.. రూ. 58.57 కోట్లే మంజూరు
  • సీఎం దత్తత గ్రామం వాసాలమర్రి అభివృద్ధికి రూ.165 కోట్లతో ఆఫీసర్ల ప్రపోజల్స్​
  • చివరికి రూ. 58.57 కోట్లే మంజూరు చేసిన సర్కారు
  • రూ. 24.24 కోట్లతో 481  డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లు
  • మౌలిక సదుపాయాలకు మరో 30.14 కోట్లు
  • కండ్లు చెదిరే ఇండ్లు వస్తాయనుకున్న పబ్లిక్​.. 
  • ఇక సాదాసీదా డబుల్ బెడ్​రూం​ ఇండ్లే దిక్కు..

యాదాద్రి, వెలుగు: కేసీఆర్​ దత్తత గ్రామమైన వాసాలమర్రిని వంద కోట్లతో అద్భుతంగా డెవలప్​ చేస్తామని ఊరిస్తూ వచ్చిన పాలకులు, చివరికి ఉసూరుమనిపించారు. సర్కారు ఆదేశాల మేరకు జిల్లా ఆఫీసర్లు 2021లో రూ. 150 కోట్లతో, గతేడాది జూలైలో రూ. 165 కోట్లతో డీపీఆర్​ రూపొందించి పైఅధికారులకు పంపించారు. సీఎం కేసీఆర్​హామీ ఇచ్చినందున తమ ఊరికి వందో, రెండువందల కోట్లో వస్తాయని, ఇక తమ ఊరు ‘బంగారు వాసాలమర్రి’ అవుతుందని ఇక్కడి జనం ఆశించారు. సారు మాటలతో పాత ఇండ్లు కూల్చుకున్నవారంతా తమకు కండ్లు చెదిరే ఇండ్లు కట్టిస్తారేమోనని కలలుగన్నారు. తీరా రాష్ట్రంలోని మిగిలిన చోట్ల కట్టినట్లే ఇక్కడ కూడా సాదాసీదా డబుల్​ బెడ్​రూం ఇండ్లే ఒకే కావడంతో  సారు చెప్పిన ‘బంగారు వాసాలమర్రి’ కాస్తా.. ‘డబుల్​ బెడ్​రూం వాసాలమర్రి కానుందని చెప్పుకుంటున్నారు. 

రెండున్నరేండ్ల కింద దత్తత..

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిని 2020 నవంబర్​1న  సీఎం కేసీఆర్​ దత్తత తీసుకున్నారు. రూ. 100 కోట్లతో డెవలప్మెంట్​ చేస్తానని ప్రకటించారు. దత్తత తీసుకున్న పది నెలల తర్వాత 2021లో పాత ఇండ్లు కూల్చేసి అందరికీ కొత్త ఇండ్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. వాసాలమర్రి డెవలప్​మెం కోసం 2021లోనే రూ. 150 కోట్లతో ఆఫీసర్లు డీపీఆర్​రూపొందించి సర్కారుకు పంపించారు. అనంతరం గతేడాది జూలైలో రూ. 165 కోట్లతో డీపీఆర్​ రూపొందించి మరోసారి పంపించారు. ఆ తర్వాత చాలా కాలం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా కొత్త ఇంటి పర్మిషన్లు నిలిపివేశారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇప్పటికే ఉన్న కొత్త ఇండ్లను వదిలి మిగిలిన వారికి ఇండ్లు కట్టించి ఇస్తామని ఈ ఏడాది జనవరి 24న జిల్లా ఆఫీసర్లు ప్రకటించారు. ఇందుకోసం ఇంటి స్థలాలను గ్రామాభివృద్ధి కమిటీకి అప్పగించాలని షరతు పెట్టారు. మూడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ ఏ ఒక్కరు కూడా ఇండ్ల స్థలాలను గ్రామ అభివృద్ధి కమిటీకి అప్పగిస్తున్నట్టు అగ్రిమెంట్​ ఇవ్వలేదు.

అడిగింది రూ.165 కోట్లు.. ఇచ్చింది రూ.58.57 కోట్లే

సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నందున తమ దశ తిరుగుతుందని వాసాలమర్రి గ్రామస్తులు ఆశించారు. కానీ, వారి ఆశలు తలకిందులయ్యే నిర్ణయాలు  జరిగాయి. ఊరి డెవలప్​మెంట్​ కోసం ఆఫీసర్లు గతేడాది జూలైలో రూ. 165 కోట్లతో డీపీఆర్​ రూపొందించి పంపించారు. అయితే, రూ. 58.57 కోట్లు మాత్రమే కేటాయిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో  నెంబర్​159 రిలీజ్​ చేసింది. రూ.100 కోట్లతో సకల సౌకర్యాలు ఉండేలా ఇండ్లు కట్టించి ఇస్తామని సీఎం ప్రకటించగా.. గ్రామస్తులు ఊహల్లో తేలిపోయారు. కానీ విడుదలైన నిధులను చూసి హతాశయులయ్యారు. రూ. 24.24 కోట్లతో 481  కుటుంబాలకు డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లు నిర్మించి ఇవ్వనున్నారు. రూ. 5 లక్షలతో ఒక్కో ఇల్లు నిర్మించనుండగా, ఇవన్నీ సాదాసీదా డబుల్​ బెడ్​రూం ఇండ్లే కానున్నాయి. ప్రైమరీ, హైస్కూల్​ బిల్డింగ్స్​ నిర్మాణం కోసం రూ. 3.23 కోట్లు, పంచాయతీ బిల్డింగ్​ కోసం రూ. 20 లక్షలు వెచ్చించనున్నారు. మూడు అంగన్​వాడీ బిల్డింగ్​లు, హెల్త్​ సబ్​ సెంటర్​ నిర్మిస్తారు. గ్రామానికి చెందిన 34.08 ఎకరాల్లో నాలుగు ప్రధాన రోడ్లతో పాటు లింక్​ రోడ్లు నిర్మించనున్నారు. పార్కులు, ఫంక్షన్​హాల్​ సహా ఇతర అవసరాల కోసం మరో 1.16 ఎకరాలకు కేటాయించారు.  కొత్తగా వేస్తున్న రోడ్ల విస్తరణకు భవిష్యత్​ లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా సెట్​ బ్యాక్​లో ఇండ్ల నిర్మాణం చేయాల్సి ఉంటుంది. కొత్త వాసాలమర్రి నిర్మాణం కోసం త్వరలోనే టెండర్లు పిలుస్తారని తెలుస్తోంది.