ఆంధ్రా కాంట్రాక్టర్లపై సర్కారుకు ఆఫీసర్ల రిపోర్ట్

ఆంధ్రా కాంట్రాక్టర్లపై సర్కారుకు ఆఫీసర్ల రిపోర్ట్

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: చేప పిల్లలు పోస్తామని టెండర్‌‌ తీసుకొని నకిలీ బ్యాంక్‌‌ గ్యారంటీ పత్రాలు సమర్పించిన ఓ ఆంధ్రా కాంట్రాక్టర్‌‌ కు చెందిన చేప పిల్లల కేంద్రాన్ని ఇటీవల రాష్ట్ర ఫిషరీస్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫీసర్లు ఇన్‌‌ స్పెక్షన్‌‌ చేయడానికి వెళ్లారు. అక్కడ చెరువులు తప్ప చేప పిల్లలు లేవు. కాంట్రాక్టర్‌‌కు ఫోన్‌‌ చేస్తే మొన్నటి వర్షాలకు చేపలన్నీ కొట్టుకుపోయాయి.. మేమేం చేస్తాం అని సమాధానం ఇచ్చాడు. మరి మా చెరువుల్లో చేప పిల్లలు ఎలా పోస్తారని అడిగితే ఎలాగోలా తెచ్చి సప్లయ్‌‌ చేస్తాం అని చెప్పారు. ఫోటో తీసుకుంటాం కనీసం ఇక్కడికి రా.. అంటే తాను అందుబాటులో లేనని, మీరేమైనా మాకు చెప్పి వచ్చారా? లొకేషన్‌‌ ఫోటో తీసుకొని వెళ్లండి అని సమాధానం ఇచ్చాడు. దీంతో అవాక్కైన ఆఫీసర్లు  లొకేషన్‌‌ ఫోటో తీసుకొని తిరిగొచ్చారు. 

ఇది ఆగస్టు 28న ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో చేప పిల్లల చెరువుల ఇన్‌‌స్పెక్షన్‌‌కు వెళ్లిన ఓ ఆఫీసర్‌‌కు ఎదురైన అనుభవం.మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా అన్ని జిల్లాల్లో ఉన్న చెరువుల్లో చేప పిల్లలను వదులుతోంది. అయితే ఆఫీసర్లతో కాంట్రాక్టర్లు కుమ్మక్కై నిధులు స్వాహా చేస్తున్నారని, చెరువుల్లో నామమాత్రంగా సీడ్​వదులుతున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. లక్ష చేప పిల్లలు పోయాల్సినచోట 10, 20 వేలకు మించి పోయట్లేదని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే మత్స్యకారుల ఆరోపణలకు బలం చేకూరుతోంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉన్న 26,770 చెరువులలో 68 కోట్ల చేప పిల్లలు, 275 చెరువులలో 10 కోట్ల రొయ్య పిల్లలను పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. జూన్‌‌ నెలలో జిల్లాల వారీగా రూ.80 కోట్లతో ఈ ప్రొక్యూర్‌‌మెంట్‌‌ టెండర్లు పిలిచారు. 200 ఎంఎం వరకు సైజు ఉండే పెద్ద చేప పిల్లల రే‌టు రూ.1.64  కాగా 35 నుంచి 40 ఎంఎం సైజ్‌‌ ఉండే చిన్న చేప పిల్లల రేటు‌ 64 పైసలుగా, రొయ్యలకు రూ.2.8గా నిర్ధారించారు. జిల్లాలవారీగా టెండర్‌‌ ప్రాసెస్‌‌ చేసిన మత్స్యశాఖ ఆఫీసర్లు 83 బిడ్లను ఫైనల్‌‌ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే తక్కువ ధరకు టెండర్‌‌ వేయడంతో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికే 90 శాతం కాంట్రాక్టులు దక్కాయి. కొందరు ఆంధ్రా కాంట్రాక్టర్లు 40 శాతం పైగా లెస్‌‌ వేసి మెజారిటీ జిల్లాల కాంట్రాక్టులు దక్కించుకున్నారు. 10 శాతం కంటే ఎక్కువ లెస్‌‌ వేస్తే అగ్రిమెంట్‌‌లో 25 శాతం డబ్బులను బ్యాంక్‌‌ గ్యారంటీ కింద చూపించాలని ప్రభుత్వ రూల్స్​ఉన్నాయి. దీంతో జూలై నెలలో బ్యాంక్‌‌ గ్యారంటీ పత్రాలు ఇచ్చి కాంట్రాక్టర్లు అగ్రిమెంట్‌‌ చేసుకున్నారు. తీరా ఈ బ్యాంక్‌‌ గ్యారంటీ ప్రతాలను ఆయా జిల్లా మత్స్యశాఖ ఆఫీసర్లు వెరిఫై చేయగా 11 జిల్లాల్లో రూ.12 కోట్ల విలువ చేసే డూప్లికేట్‌‌బ్యాంక్‌‌ గ్యారంటీ పత్రాలు ఇచ్చినట్లు తేలింది. బ్యాంక్‌‌ మేనేజర్‌‌ సంతకాలు ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ స్టాంపులు తయారు చేసి ముద్రలు వేసినట్లుగా నిర్ధారణ చేసి హెడ్‌‌ ఆఫీస్‌‌కు రిపోర్ట్‌‌ చేశారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరిపై యాక్షన్‌‌ తీసుకోలేదు. ఈ కాంట్రాక్టర్ల దగ్గరి నుంచే  మళ్లీ కొత్తగా బ్యాంకు గ్యారంటీ పత్రాలు తీసుకొని వాళ్లతోటే చేప పిల్లలు సప్లయ్‌‌ చేసేలా చర్యలు తీసుకోవాలని హెడ్‌‌ ఆఫీస్‌‌ నుంచి ఓ అధికారి ఆదేశాలివ్వడం గమనార్హం. 

ఫీల్డ్‌‌ విజిట్‌‌తో బయటపడ్డ మోసం

కాంట్రాక్టర్ల చేప పిల్లల కేంద్రాలను ఇటీవల ఫిషరీస్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫీసర్లు ఇన్‌‌స్పెక్షన్‌‌ చేశారు. ఆయా జిల్లాల మత్స్యశాఖ అధికారులు(డీఎఫ్‌‌ఓ), హైదరాబాద్‌‌ హెడ్‌‌ ఆఫీస్‌‌ నుంచి కొందరు ఉన్నత ఉద్యోగులు ఆగస్ట్‌‌ 27, 28 తేదీలలో ఫీల్డ్‌‌ విజిట్‌‌ చేశారు.  గతేడాది పెద్ద సైజు చేప పిల్లలను రూ.1.70 పైసలకు సప్లయ్‌‌ చేయగా ఈ సారి వాటినే రూ.1.10 పైసలకు సప్లయ్‌‌ చేస్తామని 40 శాతం లెస్‌‌కు టెండర్లు వేయడం, నకిలీ బ్యాంక్‌‌ గ్యారంటీ పత్రాలు ఇవ్వడంపై ఆఫీసర్లు అనుమానించారు. తీరా కేంద్రాలకు వెళ్లేసరికి అక్కడ ఆఫీసర్లకు చేప పిల్లలు కనిపించలేదు. కొన్నిచోట్ల చేపల చెరువుల ఆనవాళ్లు కూడా లేవు. తుమ్మలు మొలిచి, రాళ్లు, రప్పలు కనిపించడంతో ఆఫీసర్లు అవాక్కయ్యారు. ఇన్‌‌స్పెక్షన్‌‌ ఫోటోలు తీసుకొని కాంట్రాక్టర్లను డిస్‌‌ క్వాలిఫై చేస్తామని కోరితే.. అది మీ పని కాదు కేవలం ఫోటోలు మాత్రమే తీసి పంపించండని డిపార్ట్‌‌మెంట్‌‌ బాస్‌‌ ఒకరు ఆదేశాలిచ్చినట్లుగా పలువురు ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ అవినీతి బాగోతం అంతా ఫిషరీస్‌‌ హెడ్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కు చెందిన ముగ్గురు ఆఫీసర్ల కనుసన్నల్లో జరుగుతున్నట్లుగా కిందిస్థాయి సిబ్బంది చర్చించుకుంటున్నారు. 

మత్స్యకారుల ఆగ్రహం

చేప పిల్లలే పెంచని కాంట్రాక్టర్లు ఎలా సప్లయ్‌‌ చేస్తారని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి చేప పిల్లల పంపిణీని ప్రభుత్వం ప్రారంభిస్తుందని, ఎమ్మెల్యేలు, మంత్రులు రాకపోయినా కనీసం సర్పంచు‌లను తీసుకెళ్లి చెరువులలో చేప పిల్లలు పోయాలని వీడియో కాన్ఫరెన్స్‌‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌ ఆదేశాలు జారీ చేశారు. అయితే గతంలో మాదిరిగానే ఈ సారి కూడా చేప పిల్లలు తీసుకురాకుండా ఖాళీ డ్రమ్ములు తీసుకొచ్చి కొన్ని చేప పిల్లలు చెరువులలో పోసి పంపిణీ చేసినట్లుగా ఫొటోలు దిగి వెళ్లిపోతారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆఫీసర్ల ఇన్‌‌స్పెక్షన్‌‌లో చేప పిల్లలు లేవని స్పష్టమైనప్పుడు ఆ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని మత్స్యకారులకు న్యాయం  చేయాలని కోరుతున్నారు. చేప పిల్లల పంపిణీని కౌంట్‌‌ ప్రకారం చేపట్టాలని అంటున్నారు.