వార్డుల్లో ఎలుకల బోన్లు

వార్డుల్లో ఎలుకల బోన్లు

హనుమకొండ / వరంగల్, వెలుగు: వరంగల్‌‌ ఎంజీఎంలో పేషెంట్‌‌ను ఎలుకలు కొరికిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపడంతో ఆఫీసర్లు హడావుడి చర్యలు మొదలుపెట్టారు. ఆస్పత్రి ఆర్ఐసీయూ, వార్డుల్లో బోన్లు పెట్టి ఎలుకల వేట చేపట్టారు. మరోవైపు సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు సహా ఇద్దరు డాక్టర్లపై సర్కారు చర్యలు తీసుకోవడంతో గురువారం రాత్రి నుంచే శానిటేషన్ సిబ్బంది వార్డులన్నీ క్లీన్ చేసే పనిలో పడ్డారు. వార్డుల్లో ఉన్న చెత్తాచెదారం, ఇతర వ్యర్థాలు, గడ్డిపొదలను తొలగించడం స్టార్ట్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, పెద్దాఫీసర్లు వచ్చే సమయానికి వార్డులన్నీ సాఫ్ చేసి పెట్టారు. కాంట్రాక్టు ఏజెన్సీ తీరే ఇంతని, రెండ్రోజులు పోతే పరిస్థితి మళ్లీ మామూలేననే పేషెంట్ల బంధువులు చెబుతున్నారు.

మొదటి నుంచీ అస్తవ్యస్తమే

ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి నిత్యం వేలాది మంది పేషెంట్లు ఎంజీఎం ఆసుపత్రికి వస్తుంటారు. అలాంటి ఆసుపత్రిలో శానిటేషన్ నిర్వహణ చాలా ముఖ్యం. శానిటేషన్ వ్యవస్థను ఏజిల్ అనే ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నిర్వహిస్తున్నారు. కానీ ఆసుపత్రిలో మొదటి నుంచీ పారిశుద్ధ్యం సక్కగ ఉంటలేదు. వార్డుల్లో ఎప్పుడూ చెత్తాచెదారం, మెడికల్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. దోమలు, కుక్కలు, ఎలుకలకు ఆసుపత్రి నిలయంగా మారింది. చాలాచోట్ల మురికినీళ్లు నిలిచి, గడ్డిపొదలు పెరిగిపోయాయి. ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సి ఉన్నా సదరు కాంట్రాక్ట్ సంస్థ మొదటి నుంచీ నిర్లక్ష్యం చేస్తూ వస్తోంది. ఎంజీఎం పెద్దాఫీసర్లు పట్టించుకోకపోడం.. కాంట్రాక్టు ఏజెన్సీని అడిగేవారే లేకపోవడంతో ఆసుపత్రి అధ్వానంగా తయారైంది.

నిమ్స్‌‌‌‌‌‌‌‌ ఆస్పత్రికి పేషెంట్

ఆర్ఐసీయూలో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ పొందుతున్న శ్రీనివాస్.. కిడ్నీ, లివర్ తదితర సమస్యలతో బాధపడుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఆసుపత్రిని విజిట్ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, డీఎంఈ రమేశ్ రెడ్డి, ఎంజీఎం కొత్త సూపరింటెండెంట్ చంద్రశేఖర్.. ఆర్ఐసీయూలో ఉన్న పేషెంట్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ అందించేందుకు హైదరాబాద్ పంపించాల్సి ఉందన్నారు. తర్వాత కుటుంబ సభ్యుల అంగీకారంతో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

వార్డుల్లో ఎలుకల బోన్లు

ఆసుపత్రి ఆవరణలో చాలాచోట్ల ఎలుకలు చేసిన రంధ్రాలున్నాయి. అంతేగాకుండా హాస్పిటల్ గోడలకు చాలాచోట్ల వివిధ అవసరాల కోసం కన్నాలు పెట్టారు. కానీ అవసరం లేనివాటిని పూడ్చడం మాత్రం మరిచిపోయారు. దీంతో వాటి ద్వారా ఎలుకలు వార్డుల్లోకి ఎంటరవుతున్నాయి. తాజాగా పేషెంట్‌‌‌‌‌‌‌‌ను ఎలుకలు కొరకడంతో ఆఫీసర్లు, శానిటేషన్ సిబ్బంది ఎలుకలు పట్టే పనిలో పడ్డారు. ఎలుకలు ఎంటర్ అయ్యే చోట కాంట్రాక్ట్ ఏజెన్సీ ద్వారా బోన్లు ఏర్పాటు చేశారు. ఆర్ఐసీయూతో పాటు ఇంకొన్ని విభాగాల్లో బోన్లు పెట్టారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఇంజనీరింగ్, శానిటేషన్ సిబ్బందితో తగిన చర్యలు తీసుకోనున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.