మల్లన్నసాగర్ పిల్లలకు టెన్త్ మెమోలియ్యట్లే

మల్లన్నసాగర్ పిల్లలకు టెన్త్ మెమోలియ్యట్లే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ తీరుతో మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలతోపాటు వారి పిల్లలూ ముప్పుతిప్పలు పడుతున్నారు. నిర్వాసిత కుటుంబాల పిల్లలకు టెన్త్ క్లాస్ పరీక్షలు రాయించిన సర్కార్ తీరా మెమోలు ఇవ్వకుండా ఆపేసింది. స్వయంగా ప్రభుత్వం పెట్టించిన కొత్త స్కూల్​కే పర్మిషన్ లేదని చెప్తుండటంతో స్టూడెంట్లు, వారి పేరెంట్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో ఉన్న జెడ్పీహెచ్ఎస్ ఎర్రవెల్లి, జెడ్పీహెచ్ఎస్ వేములఘాట్, జెడ్పీహెచ్ఎస్ ఏటిగడ్డ కిష్టాపూర్ స్కూళ్లను మూసివేశారు. వీటిలో చదువుతున్న పిల్లల కోసం 2022–23లో గజ్వేల్ మండలం ముత్రాజ్ పల్లిలో హైస్కూల్​ను ఏర్పాటు చేశారు. ఇందులో సిక్స్త్ నుంచి టెన్త్ దాకా 350 మంది ఉన్నారు. 

వీరిలో టెన్త్ క్లాస్ లో ఉన్న 58 మంది స్టూడెంట్లు గతేడాది పరీక్షలను రాసేందుకు విద్యాశాఖ స్పెషల్ పర్మిషన్ కింద అవకాశం కల్పించింది. కానీ పరీక్షలు రాసిన స్టూడెంట్లకు, ఇప్పటివరకూ మెమోలు ఇవ్వలేదు. ఆ స్కూల్ కు ప్రభుత్వ అనుమతి లేనందుకే మెమోలు ఇవడంలేదని పరీక్షల విభాగం తెలిపింది.

 కేవలం పరీక్షలు రాసేందుకు మాత్రమే సర్కారు అనుమతి ఇచ్చిందని.. ఆ స్కూల్ కు పర్మిషన్ ఇవ్వలేదని చెప్తోంది. ఈ సమస్యను పరిష్కరించాలని సర్కార్ దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని టీచర్ల సంఘాల లీడర్లు, ఆఫీసర్లు చెప్తున్నారు. అయితే ఒకేసారి టెన్త్ వరకూ పర్మిషన్ ఇవ్వడంపై కొన్ని టెక్నికల్ సమస్యలు ఏర్పడ్డాయని ఉన్నతాధికారులు అంటున్నారు. 

దాదాపు ఏడాదిన్నర అవుతున్నా సమస్యను ఎందుకు పరిష్కరించడంలేదని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావును ‘వెలుగు’ ప్రతినిధి వివరణ కోరగా.. ఆ స్కూల్​కు సర్కారు నుంచి పర్మిషన్ రాగానే మెమోలు ఇస్తామని వెల్లడించారు.