స్టూడెంట్లు పోతరని వలంటీర్లను తీసుకోని ఆఫీసర్లు

స్టూడెంట్లు పోతరని వలంటీర్లను తీసుకోని ఆఫీసర్లు
  • విద్యా శాఖలో వింత పోకడ
  • ఈ ఏడాది ప్రైవేటు నుంచి 2.5 లక్షల మంది సర్కారుకు
  • మళ్లీ ప్రైవేటుకే వెళ్తరని వలంటీర్లను తీసుకోని ఆఫీసర్లు
  • స్టూడెంట్లను నిలుపుకోవడానికి చర్యలు కరువు
  • సబ్జెక్టులకు టీచర్లు లేక పిల్లలకు ఇబ్బందులు

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు స్కూళ్ల నుంచి రెండున్నర లక్షల మందికిపైగా స్టూడెంట్లు సర్కారు బడుల్లో చేరితే రాష్ట్ర విద్యా శాఖ వాళ్లను నిలుపుకునే పనులేం చేయట్లేదు. పిల్లలు మళ్లీ ప్రైవేటుకే పోతరేమోనని, అందుకే టీచర్లను రిక్రూట్​ చేయట్లేదని పెద్దాఫీసర్లు చెప్తున్నరు. నియమించాక పిల్లలు లేకపోతే ఎట్లని అంటున్నరు. మొత్తంగా పిల్లలు తిరిగి ప్రైవేటుకే వెళ్లేలా వ్యవహరిస్తున్నరు. 

సర్కారు సప్పుడు జేస్తలె
రాష్ట్రంలోని 26,285 సర్కారు బడుల్లో 20.46 లక్షల మంది చదువుతున్నారు. కరోనాతో గతేడాది మార్చిలో మూతపడ్డ స్కూళ్లు ఈ ఏడాది సెప్టెంబర్ ఫస్ట్ రీ ఓపెన్ అయ్యాయి. మధ్యలో గత విద్యా సంవత్సరంలో 30 రోజులు బడులు తెరుచుకున్నా పిల్లలు పెద్దగా బడులకు రాలేదు. ఈ టైమ్​లో సర్కారు బడుల్లో రోజూ టీవీ, ఆన్​లైన్ పాఠాలు కొనసాగాయి. ప్రైవేటు బడుల్లోనూ ఆన్​లైన్​ పాఠాలు అప్పుడప్పుడు జరిగినా మేనేజ్​మెంట్లు మాత్రం ఫుల్ ఫీజులు వసూలు చేశాయి. కరోనా వల్ల చాలా మంది పేరెంట్స్ ఉపాధి పోవడంతో ప్రైవేటు బడుల్లో చదివించలేని వాళ్లంతా సర్కారు బడుల్లో పిల్లలను చేర్పించారు. ఈ ఏడాది ఫస్ట్ క్లాసులో సుమారు రెండు లక్షల మంది వరకు సర్కారు బడుల్లో చేరారు. సుమారు రెండున్నర లక్షల మంది ప్రైవేటు బడుల నుంచి వచ్చి చేరారు. కరోనా దెబ్బతో ప్రైవేటు స్కూళ్లు మూతబడుతుండగా సర్కారులో మూతపడ్డ సుమారు 250 స్కూళ్లు తెరుచుకున్నాయి. అయినా సర్కారులో గాని, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల్లో గాని చలనం లేదు. ఇప్పటికీ ఏ బడికీ కొత్తగా టీచర్​ను అలాట్ చేయలేదు. ఉన్న టీచర్లనే కాస్త సర్దినా ఇంకా వేల బడుల్లో టీచర్ల కొరత ఉంది. 

పొమ్మనలేక పొగ పెడుతున్నరా?
ఒక్కో జిల్లాలో 3 వేల నుంచి 6 వేల మంది వరకు పిల్లలు ప్రైవేటు బడుల నుంచి సర్కారు స్కూళ్లలో చేరారు. అలా వచ్చిన పిల్లలు సర్కారు బడుల్లోనే ఉండేలా స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవట్లేదు. పైగా గతంలో పనిచేసిన విద్యా వలంటీర్లనూ విధుల్లోకి తీసుకోకుండా వచ్చిన పిల్లలు మళ్లీ ప్రైవేటు బడుల్లోకే పోయేలా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. టీచర్లు లేని బడుల్లో తమ పిల్లల్ని చేర్చామా అని పేరెంట్స్ బాధపడేలా సర్కారు చర్యలున్నాయని టీచర్ల సంఘాల లీడర్లు మండిపడుతున్నారు. మరోపక్క ప్రైవేటు నుంచి వచ్చిన స్టూడెంట్లను చైల్డ్ ఇన్​ఫో పోర్టల్​లో నమోదు చేయట్లేదు. కారణం ప్రైవేటు బడుల్లో ఆ పిల్లల అడ్మిషన్లుండటం. ఫీజు చెల్లించాలని.. లేకుంటే పేర్లను తీసేయబోమని మేనేజ్​మెంట్లు స్పష్టం చేస్తున్నాయి. విద్యా శాఖ ఆఫీసర్లేమో తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. టీసీలు లేకుండానే చేర్చుకోవాలని రూల్స్​ ఉన్నా కొన్ని సర్కారు బడుల్లో అవి ​అమలవట్లేదు. 

లెక్క తేలితేనే టీచర్లను ఇస్తరట
జులై ఫస్ట్ నుంచి ఈ అకడమిక్ ఇయర్ ప్రారంభం కాగా సెప్టెంబర్ 1 నుంచి ఫిజికల్ క్లాసులు మొదలయ్యాయి. విద్యా సంవత్సరం మొదలై 4 నెలలైనా స్టూడెంట్ల సంఖ్యపై ఇప్పటికీ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లలో క్లారిటీ రాలేదు. కొన్ని స్కూళ్లలో అడ్మిషన్లు పెరుగుతుండగా మరి కొన్నింటిలో తగ్గుతున్నాయి. స్టూడెంట్ల తగ్గుదలకు కేవలం ప్రైవేటు నుంచి వచ్చారు, మళ్లీ ప్రైవేటుకే పోతున్నారని చెప్తున్నారు. కానీ ఆ బడుల్లో టీచర్లు లేరని మాత్రం ఒప్పుకోవట్లేదు. ఇప్పటికీ చాలా హైస్కూళ్లలో కొన్ని సబ్జెక్టుల పాఠాలు మొదలు కాలేదు. కొన్ని స్కూళ్లలో ఉన్న టీచర్లపైనే భారం పడుతోంది. మరోపక్క స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లేమో ప్రస్తుతం ప్రైవేటు నుంచి పిల్లలు ఎందరొచ్చారు, ఇప్పుడు ఎందరుపోయారో లెక్కలేస్తున్నారు. ఆ లెక్కలు చూశాకే విద్యా వలంటీర్లను ఇవ్వాలా లేదా డిసైడ్ అవుతామని చెప్తునారు. ప్రభుత్వం సర్కారు స్కూళ్లపై దృష్టి పెట్టి విద్యా వలంటీర్లనైనా నియమించాలని పేరెంట్స్, టీచర్లు కోరుతున్నారు.