నిర్మల్, వెలుగు: చేతి వృత్తుల కళాకారులకు ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి రావుల రామనాథ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ వీధిలో విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించిన పనిముట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకం ద్వారా చేతి వృత్తుల వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ట్రైనింగ్ కూడా ఇస్తోందని తెలిపారు.
కేంద్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం చేతి వృత్తుల కళాకారులను నిర్లక్ష్యం చేసిందని, ఫలితంగా చేతి వృత్తులు, కులవృత్తులు చేసే వారంతా ఉపాధి కోల్పోయారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం చేతి వృత్తులను రక్షణకు, కళాకారులను ఆదుకునేందుకు రూ.కోట్లతో వివిధ రకాల పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రతి చేతి వృత్తి కళాకారుడికి విశ్వకర్మ యోజన పథకం అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేవైఎం ప్రధాన కార్యదర్శి అయిండ్ల రమేశ్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి జైల లింగం, కరుణాసాగర్, కడారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
