నేరడిగొండలో పశువుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్

నేరడిగొండలో పశువుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్
  • 8 మంది రిమాండ్, పరారీలో ఇద్దరు 

నేరడిగొండ, వెలుగు: అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ వాహనాన్ని బుధవారం ఆదిలాబాద్​ జిల్లా నేరడిగొండ పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ తెలిపిన వివరాల ప్రకారం... అక్రమంగా పశువులను తరలిస్తున్నారనే ముందస్తు సమాచారం మేరకు మండలంలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద బుధవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులు ఇచ్చోడ మార్కెట్ నుంచి 16 ఎద్దులను కొనుగోలు చేసి, మూడు ఎద్దులను దొంగలించి, ఎలాంటి అనుమతులు లేకుండా వాహనంలో కేరళలోని కొచ్చిన్​లో అమ్మేందుకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

 నిందితులను విచారించగా.. మహారాష్ట్రలోని గడ్చందూర్​కు చెందిన షేక్ ఇమ్రాన్, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన మహమ్మద్ జాకీర్ మరో పది మందితో బృందంగా ఏర్పడి ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామాల్లో తిరుగుతూ ఎద్దులను కొంటున్నారు. వాటిని ఏపీ అనంతపూర్ మీదుగా కొచ్చిన్​కు తరలించి ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు ఒప్పుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి, 8 మందిని రిమాండ్​కు తరలించామని, ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు. అక్రమంగా పశువులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.