- ఈసారి పెంచుతామంటున్న అధికారులు
- ఇంటింటికీ ఓటర్ స్లిప్పుల పంపిణీ
- ఓటెయ్యాలంటూ అవేర్నెస్
- ఉప ఎన్నిక కాబట్టి పర్సంటేజీ పెరుగుతుందన్న ధీమా
హైదరాబాద్ సిటీ, వెలుగు : రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే నగరంలోని నియోజకవర్గాల్లో ఎప్పుడూ ఓటింగ్‌శాతం తక్కువగానే నమోదవుతూ ఉంటుంది. అయితే, వచ్చే నెలలో జరగబోతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ సీన్రిపీట్కాకుండా ఉండేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. 2023 సాధారణ ఎన్నికల్లో ఇక్కడ 48.42 శాతం పోలింగ్ నమోదైంది. అర్భన్ ప్రాంతాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదవడం సాధారణమే అయినా..జూబ్లీహిల్స్‌లో మరీ 50 శాతాని కంటే తక్కువ నమోదవడం ఆశ్చర్యపరిచింది.
దీంతో ఈసారి ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. సాధారణ ఎన్నికలతో పోలిస్తే గతేడాది కంటోన్మెంట్ లో జరిగిన ఉప ఎన్నికలో 3 శాతం వరకు పోలింగ్ పెరిగింది. అయితే, అప్పట్లో పార్లమెంట్ తో పాటు బై పోల్ జరగడంతో మూడు శాతమే పెరిగిందని, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు మాత్రమే ఉండడంతో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఓటింగ్‌శాతం పెంచుతామంటున్నారు.
జూబ్లీహిల్స్‌లో పోలింగ్‌సరళి ఇలా..
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2009లో జరిగిన ఎన్నికల్లో 52.77 శాతం పోలింగ్ నమోదైంది. అప్పుడు ఓటర్లు 2,59,416 మంది ఉండగా, 1,36,893 ఓట్లు పోలయ్యాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లు 3,29,522 మంది ఉండగా, 1,65,368 ఓట్లు పోలయ్యాయి. 50.18 శాతం పోలింగ్ నమోదైంది. అయితే, 2018 ఎన్నికల్లో ఒక్కసారిగా 45.59 శాతానికి తగ్గింది. ఆ ఎన్నికలప్పుడు 3,41,537 ఓటర్లుండగా, 1,55,729 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో 3,75,430 ఓటర్లకు 1,83,312 మంది ఓట్లు వేశారు. అప్పుడు 48.82 శాతం నమోదైంది. ప్రస్తుతం జరగనున్న బై పోల్ లో ఓటర్ల సంఖ్య- 4,01,365 కాగా, ఇందులో పురుషులు- 2,08,561 మంది, మహిళలు- 1,92,779 మంది, ఇతరులు- 25 మంది ఉన్నారు. గత ఎన్నికల కంటే సుమారు 25వేల మంది పెరగడంతో పర్సంటేజీ పెరుగుతుందనే ఆశతో అధికారులు ఉన్నారు.
ఇలా చేస్తున్నరు..
ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాన్ని, వరుస సంఖ్యను సులభంగా తెలుసుకోవడానికి వీలుగా ఎన్నికల అధికారులు ప్రతి ఓటరు ఇంటికీ వెళ్లి స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నారు. యువత, మహిళలు, సీనియర్ సిటిజన్లు సహా అన్ని వర్గాల ప్రజలను ఓటింగ్‌లో పాల్గొనాలని చైతన్యపరుస్తున్నారు. దివ్యాంగులు, 80 ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు సులభంగా ఓటు వేయడానికి వీలుగా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు, రవాణా సౌకర్యాలను కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉప ఎన్నికలో గెలుపు ప్రతిష్టాత్మకం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా తమ ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాయని, దీనివల్ల ఓటింగ్పర్సంటేజీ పెరిగే అవకాశం ఉందంటున్నారు.
