కల్యాణలక్ష్మిలో కమీషన్లు: అధికారులు, టీఆర్ఎస్ లీడర్ల దందా

కల్యాణలక్ష్మిలో కమీషన్లు: అధికారులు, టీఆర్ఎస్ లీడర్ల దందా

వరంగల్ అర్బన్ (హనుమకొండ), వరంగల్ రూరల్ (వరంగల్), జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ అమలులో అవినీతికి పాల్పడిన 48 మంది రెవెన్యూ అధికారులను విజిలెన్స్ అధికారులు గుర్తించారు.  వీరిలో వీఆర్ఏలు, వీఆర్వోలు, తహసీల్దార్లు ఆర్ఐలతోపాటు డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్ స్థాయి అధికారులు ఉన్నారు. వీరికి సర్పంచ్ లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు వంటి ప్రజాప్రతినిధులతోపాటు లోకల్​ టీఆర్​ఎస్​ లీడర్లు, ఎంఐఎం లీడర్లు, మీ సేవ సెంటర్ల సిబ్బంది దళారులుగా వ్యవహరించినట్లు తేలింది.  
ఇదీ దందా..!
  మహబూబాబాద్ జిల్లా గూడూరు తహసీల్దార్ శైలజ అప్లికేషన్ల ప్రాసెసింగ్ కోసం రూ. 5 వేల నుంచి 10 వేలు వసూలు చేసినట్లు విజిలెన్స్​ పేర్కొంది.  ఈ దందాకు గూడూరు వీఆర్వో ఉప్పలయ్య, టీఆర్ఎస్ లీడర్ సురేందర్, వైస్ ఎంపీపీ ఆరె వీరన్న దళారులుగా వ్యవహరించారు. ఇదే జిల్లా కేసముద్రం తహసీల్దార్ ఎం. వెంకట్ రెడ్డి(రిటైర్డ్) అప్లికేషన్ల ప్రాసెసింగ్ కోసం రూ. 5 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేశారు. ఈయనకు దళారులుగా తహసీల్దార్ ఆఫీసు టైపిస్ట్ వెంకన్న, లింగమూర్తి, కేసముద్రం వీఆర్వో జి. కొమ్మాలు, వెంకటగిరి సర్పంచ్ సాదరపు సత్యానారాయణ, కేసముద్రం సర్పంచ్ ఎనమాల ప్రభాకర్, స్టేషన్ కేసముద్రం సర్పంచ్ బట్టు శ్రీను, కేసముద్రం టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ వీరు నాయక్ వ్యవహరించారు. మహబూబాబాద్ తహసీల్దార్ ఎం.రంజిత్ కుమార్ అప్లికేషన్ల ప్రాసెసింగ్ కోసం రూ.7 వేల నుంచి రూ.10 వేల వసూలు  చేశారు. తహసీల్దార్ ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ ఎం.కీర్తన్ దళారిగా వ్యవహరించారు.
 వరంగల్ అర్బన్(హనుమకొండ) జిల్లాలో ధర్మసాగర్ తహసీల్దార్ ఎం. రాజ్ కుమార్,  వేలేరు తహసీల్దార్ మహ్మద్ దిలావర్ అభిద్ అలీ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అప్లికేషన్ల ప్రాసెస్ చేయడం కోసం రూ.10 వేల చొప్పున లంచం తీసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వీరికి మాజీ ఎంపీపీ గుడివెనుక దేవేందర్, నారాయణగిరి సర్పంచ్ కర్ర సోమిరెడ్డి, సొంపల్లి కరుణాకర్, మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, వేలేరు ఎంపీపీ కేసిరెడ్డి సోమిరెడ్డి దళారులుగా వ్యవహరించినట్లు రిపోర్టులో వెల్లడించారు. 
 వరంగల్ రూరల్(వరంగల్) జిల్లా పరకాల ఎంఆర్ఐ ఎ.సంపత్ కుమార్, శాయంపేట ఎంఆర్ఐ ఎల్.హేమా నాయక్, సంగెం ఎంఆర్ఐ ఆనంద్ కుమార్, చెన్నారావుపేట ఎంఆర్ఐ సీహెచ్ స్వామి, నల్లబెల్లి ఎంఆర్ఐ వి. సదయ్య, దుగ్గొండి ఎంఆర్ఐ జ్యోతి, నర్సంపేట డిప్యూటీ తహసీల్దార్ గడ్డం ఉమారాణి, జనగామ జిల్లా జనగామ మండల ఆర్ఐ తాళ్లూరి కృష్ణ ప్రసాద్, బచ్చన్న పేట ఆర్ఐ కృష్ణ స్వామి, నర్మెట్ట ఆర్ఐ  నర్సింహా స్వామి, తరిగొప్పుల ఆర్ఐ బి.రంజిత్ నాయక్, జఫర్ ఘడ్ ఆర్ఐ రాంబాబు,  పాలకుర్తి ఆర్ఐ కె.రవి అక్రమాలకు పాల్పడ్డారు. వీరు ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ. 5 వేల చొప్పున వసూలు చేసినట్లు విజిలెన్స్​ తన రిపోర్టులో పేర్కొంది. 
 జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి ఆర్ఐ దేవేందర్, భూపాలపల్లి కంప్యూటర్ ఆపరేటర్  నరేశ్​, గణపురం మండలం చెల్పూర్ వీఆర్వో శ్రవణ్ అప్లికేషన్ల ప్రాసెస్ కోసం రూ. 5 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేశారు. మీ సేవ సెంటర్ నిర్వాహకులు తిరుపతి, కొత్త కిరణ్ దళారులు గా వ్యవహరించారు.
 నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం తహసీల్దార్ కేసీ ప్రమీల, ఆర్​ఐలు ఝాన్సీ, విశ్వేశ్వర్ రెడ్డి అప్లికేషన్ల ప్రాసిసెంగ్ కోసం రూ. 5 వేల నుంచి  10 వేల వరకు వసూలు చేశారు. నిడమనూరు తహసీల్దార్ హెచ్. ప్రమీల కూడా ఇదే స్థాయిలో డబ్బులు వసూలు చేయగా.. దళారులుగా ఆర్ఐ రామారావు, పంచాయతీ సెక్రటరీ శ్రీదేవితోపాటు సైదిరెడ్డి(ముకుందాపురం), మీర్ రెడ్డి వెంకటరమణ, దోరెపల్లి నాగరాజు వ్యవహరించారు.  తిరుమలగిరి సాగర్ తహసీల్దార్ ఇస్లావత్ పాండు నాయక్ రూ. 5 వేల నుంచి 10 వేలు వసూలు చేయగా.. దళారులుగా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ రవి, ఆర్ఐ ఇషాక్ తోపాటు జాటవత్ శంకర్ నాయక్, జవహర్ లాల్, అంగోత్ మునినాయక్ వ్యహరించారు. దామరచర్ల ఆర్ఐ ఎస్.నాగరాజు, మిర్యాలగూడ టౌన్ ఆర్ఐ పి.శ్యాంసుందర్, వేములపల్లి ఆర్ఐలు కె.సాయిరాం, బి.శ్రీధర్ రెడ్డి రూ. 3 వేల నుంచి 5 వేలు వసూలు చేశారు. నకిరేకల్ తహసీల్దార్ టి.జంగయ్య, రూ. 2 వేల నుంచి 5 వేల వసూలు చేయగా..  దళారులుగా ఆర్ఐ ఎ.రాంప్రసాద్, కంప్యూటర్ ఆపరేటర్ ఎం.రాజు దళారులుగా వ్యవహరించారు. కేతపల్లి తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు రూ.2 వేల నుంచి 5 వేలు వసూలు చేయగా.. దళారులుగా ఆర్ఐ బి.శ్యాంసుందర్, ఏఆర్ఐ ఏ.రాజ్యలక్ష్మి, కంప్యూటర్ ఆపరేటర్ సాగర్ పని 
చేశారు. 
సూర్యాపేటలోని నూతన్ కల్ మండలం ఏఆర్ఐ పి.సుజిత్ కుమార్ అప్లికేషన్ల ప్రాసెసింగ్ కోసం రూ. 2 వేల నుంచి 5 వేలు వసూలు చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో కల్యాణలక్ష్మి అప్లికేషన్ల స్ర్కూట్నీ కోసం కల్వకుర్తి ఆర్ఐ శశికాంత్ రూ.1,000 నుంచి 1,500 వసూలు చేశారు. కొల్లాపూర్ వీఆర్వో నవీన్ రెడ్డి ఒక్కో అప్లికేషన్ కు రూ. 500 నుంచి 1,000 వసూలు చేశారు. వంగూరు ఆర్ఐలు సీతారాం నాయక్, మంజుల, ఉప్పునూతల ఆర్ఐ పద్మ అప్లికేషన్ల స్క్రూట్నీ, ఫీల్డ్ ఎంక్వైరీ కోసం రూ.5 వేల నుంచి 6 వేలు వసూలు చేశారు. నిజామాబాద్ నార్త్ తహసీల్దార్ నారాయణ, డిప్యూటీ తహసీల్దార్ మధు, ఆర్ఐ బషరత్ అలీ చెక్కుల మంజూరు కోసం రూ.5 వేల వరకు వసూలు చేసినట్లు 
బయటపడింది.

సీఎం క్షమాపణ చెప్పాలి
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​లో అవినీతి జరుగుతున్నదని నేను అసెంబ్లీలో మాట్లాడితే సీఎం కేసిఆర్  కొట్టిపారేసిన్రు. నన్ను మాట్లాడనీయకుండా అడ్డుకున్నరు. అవినీతి జరగడం లేదని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అబద్ధాలు చెప్పిన్రు. ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్​పై సీఎం ఏం సమాధానం చెప్తరు? అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన సీఎం, నన్ను అడ్డుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రైతు బంధు, ఈజీఎస్ స్కీమ్​లోనూ అవినీతి జరుగుతున్నది. తానే తెలివి కలిగిన వ్యక్తినని భావించే కేసీఆర్ ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలి.                 - బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
నిరుటి ఘటనతో కూపీ  లాగితే!
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అప్లికేషన్లను ప్రాసెస్ చేయడంలో ఆదిలాబాద్ ఆర్డీవో ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న నదీం రూ.86,09,976 దుర్వినియోగానికి పాల్పడినట్లు నిరుడు తేలింది. ఆయనపై గుడిహత్నూర్ పోలీస్టేషన్ లో 2020 నవంబర్ 18న  కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అక్రమాలపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో టీఆర్​ఎస్​తోపాటు నిజామాబాద్​ లాంటి చోట్ల ఎంఐఎం లీడర్లు దందాలో దళారులుగా వ్యవహరించినట్లు తేలింది. ఆదిలాబాద్​ కేసులో నదీంకు దళారులుగా సిందె అచ్యుత్(పొన్న), జాదవ్ శ్రీనివాస్(సుంకిడి), మోహినుద్దీన్ (ఇచ్చోడ), ఎన్.బాలకృష్ణ, సంగ్లె సునీల్, మీసాల శంకర్, బి.జ్ఞానేశ్వర్, దినేష్, ఆత్రం నిర్మల వ్యవహరించినట్లు బయటపడింది. వీరిలో మీ సేవ సెంటర్ల నిర్వాహకులు కూడా ఉన్నారు.