పరిష్కారంపై ఫోకస్ దగ్గరపడుతున్న గడువు..ఫీల్డ్ వెరిఫికేషన్ వల్లే ఆలస్యం

పరిష్కారంపై ఫోకస్ దగ్గరపడుతున్న గడువు..ఫీల్డ్ వెరిఫికేషన్ వల్లే ఆలస్యం
  • సర్కారు స్థాయిలోనే సాదాబైనామాల పరిష్కారం
  • ఉమ్మడి వరంగల్​ జిల్లాలో 2,27,961 అప్లికేషన్లు

జనగామ, వెలుగు: భూభారతి రెవెన్యూ సదస్సుల అప్లికేషన్ల పరిష్కారంపై అధికారులు ఫోకస్​ పెడుతున్నారు. జూన్​3 నుంచి 20 వ తేదీ వరకు ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించగా, ధరణి బాధితులు పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు అందజేశారు. వీటిని ఆన్​లైన్​ చేసిన అధికారులు పరిష్కారంపై దృష్టి పెట్టారు. ఆయా అప్లికేషన్లలో సాదాబైనామాల సమస్యలు ఎక్కువగా ఉండగా, సర్కారుపై స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో మిగిలినవాటిపై అధికారులు ఓవర్​టైం, సెలవు రోజుల్లోనూ పనిచేస్తూ వెరిఫికేషన్​ స్పీడప్​ చేశారు. 

సమస్యల పరిష్కారం స్పీడప్..

భూభారతి సదస్సులలో వచ్చిన దరఖాస్తుల్లోని పరిష్కారంపై అధికారులు గడువులోగా ముగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ లోని ఆరు జిల్లాలో మొత్తంగా 1378 రెవెన్యూ సదస్సులు నిర్వహించగా, 2,27,961 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎక్కువ మొత్తం భూభారతి మాడ్యూల్స్​ పరిధిలో లేని అప్లికేషన్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా వరంగల్​ జిల్లాలో 54,933 అప్లికేషన్లు రాగా, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో 48,651 మంది అప్లై చేశారు.

మహబూబాబాద్ లో 39,419, జనగామలో 17,867, హనుమకొండలో 34,973, ములుగు జిల్లాలో 31,118 మంది అప్లై చేసుకున్నారు. ఎక్కువగా సాదాబైనామాలు, మిస్సింగ్​ సర్వే నంబర్లు, ప్రొహిబిటెడ్​ జాబితాలోంచి తొలగించాలని వచ్చాయి. డిజిటల్​ సైన్​ పెండింగ్, అసైన్డ్​ భూములకు పట్టాలు ఇవ్వాలని, విస్తీర్ణం ఎక్కువ తక్కువలపై, పాస్​బుక్​లలో ఇంటి పేర్ల తప్పులు, ఆధార్​ మిస్టేక్స్, వారసత్వ సమస్యలపై దరఖాస్తులు చేసుకోగా, పరిష్కారాన్ని అధికారులు స్పీడప్​ చేశారు. 

ఫీల్డ్​వెరికేషన్​ ట్రబుల్స్​తో లేట్..​

వేలల్లో అప్లికేషన్లు ఉంటే పరిష్కారం వందల్లో అవడానికి ఫీల్డ్​వెరిఫికేషన్​సమస్యలు కారణంగా అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో నోటీసుల జారీ, ఎంక్వైరీకి జాప్యం జరుగుతుందంటున్నారు. వీఆర్ఓలు, వీఆర్ఏలు లేక ఇక్కట్లు తప్పడం లేదు. జీపీవోల నియామకం ఎప్పుడనేది క్లారిటీ లేదు. మరోవైపు అసైన్డ్, సాదాబైనామా, పీవోటీ వంటి వాటి పరిష్కారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటున్నారు.

సర్కారు ఆదేశాలు వస్తేనే సదరు వాటిపై ముందుకు సాగనున్నట్లు చెబుతున్నారు. ఇదిలాఉంటే సాదాబైనామా దరఖాస్తులు అన్ని జిల్లాల్లో పెద్ద సంఖ్యలో వచ్చాయి. ఒక్క జనగామ జిల్లాలోనే 17 వేల పైచిలుకు అప్లికేషన్లలో 10 వేలు సాదాబైనామావే ఉన్నాయి. వీటి సంఖ్య మినహాయిస్తే అప్లికేషన్ల పరిష్కారం స్పీడందుకున్నట్లేననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

డెడ్​ లైన్ పంద్రాగస్టు..

ఉమ్మడి వరంగల్​జిల్లాలో ఇప్పటి వరకు 2613 అప్లికేషన్లు పరిష్కారమయ్యాయి. మిగిలినవి వెరిఫికేషన్​జరుగుతున్నాయి. పంద్రాగస్టు వరకు అప్లికేషన్లన్నీ పరిష్కరించాలనే లక్ష్యంతో యంత్రాంగం ముందుకు సాగుతోంది. జనగామ కలెక్టర్​రిజ్వాన్​ భాషా షేక్, అడిషనల్​ కలెక్టర్​ రోహిత్​ సింగ్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. జాప్యం చేస్తున్న తహసీల్దార్లపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల కొడకండ్ల, చిల్పూరు తహసీల్దార్లకు మెమోలు జారీ చేశారు. మిగతా జిల్లాల కలెక్టర్లు కూడా స్పీడప్​ చేస్తున్నారు. జనగామ జిల్లాలోని 12 మండలాల్లో 17,867 దరఖాస్తులు వస్తే ఇప్పటి వరకు 661 అప్లికేషన్లు మాత్రమే క్లియర్​అయ్యాయి.

మరో 1757 పరిష్కార దశలో ఉన్నాయి. జయశంకర్​ భూపాలపల్లిలోని 12 మండలాల్లో 48,651 అప్లికేషన్లకు 386 క్లియర్​ కాగా, 1364 పరిష్కార దశలో ఉన్నాయి. హనుమకొండ 14 మండలాల్లోని 34,973 అప్లికేషన్లకు 244 క్లియర్​ కాగా, 1010 పరిష్కార దశలో ఉన్నాయి. మహబూబాబాద్​ జిల్లాలోని 18 మండలాల్లో 39,419 అప్లికేషన్లకు 214 క్లియర్​ కాగా, 952 పరిష్కార దశలో ఉన్నాయి. ములుగు 10 మండలాల్లో 32,118 అప్లికేషన్లకు 878 క్లియర్​ కాగా, 2,234 పరిష్కార దశలో ఉన్నాయి. వరంగల్ జిల్లాలోని 13 మండలాల్లో 54,933 అప్లికేషన్లకు 230 క్లియర్​ కాగా, 998 పరిష్కార దశలో ఉన్నాయి.   

ఉమ్మడి జిల్లా వివరాలు

జిల్లా     రెవెన్యూ సదస్సులు    మొత్తం అప్లికేషన్లు        పరిష్కరించినవి

జనగామ                 176                                                  17867                                                               661
హనుమకొండ        163                                                  34973                                                               244
వరంగల్                 191                                                 54933                                                                230
భూపాలపల్లి           223                                                 48651                                                                386
మహబూబాబాద్    288                                                 39419                                                                214
ములుగు                  337                                                 32118                                                                 878
మొత్తం                  1378                                                227961                                                                2613

మరిన్ని వార్తలు