మూడేండ్లుగా పోస్టింగ్ ఇయ్యట్లే..నష్టాలను సాకుగా చూపుతున్నఆర్టీసీ అధికారులు

మూడేండ్లుగా పోస్టింగ్ ఇయ్యట్లే..నష్టాలను సాకుగా చూపుతున్నఆర్టీసీ అధికారులు
  • విలీనం కంటే ముందే పోస్టింగ్ ఇవ్వాలి
  • 72 మంది జూనియర్ అసిస్టెంట్ల డిమాండ్
  • అర్హత ఉన్నవాళ్లతో తమ పోస్టులు ఎలా భర్తీ చేస్తారని ఫైర్

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో టీఎస్​పీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయిన 72 మంది జూనియర్ అసిస్టెంట్లకు అధికారులు మూడేండ్లుగా పోస్టింగ్​లు ఇవ్వడం లేదు. తాజాగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను అర్హత ఉన్న కండక్టర్లు, టెలిఫోన్ ఆపరేటర్ల ద్వారా భర్తీ చేయాలని ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 26న ఎగ్జామ్ కూడా నిర్వహిస్తున్నారు. దీంతో ఇప్పటికే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు.. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. తమను జాబ్​లోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. నష్టాలు, అప్పులను సాకుగా చూపడం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయనున్న నేపథ్యంలో తమకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. విలీనం అయిన తర్వాత అనేక ఇబ్బందులు ఉంటాయని చెబుతున్నారు. మంత్రి హరీశ్ రావును కలిసి అభ్యర్థులు వినతి పత్రాలు అందజేశారు. ఆయన సానుకూలంగా స్పందించి పోస్టింగ్ ఇవ్వాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని అభ్యర్థులు మండిపడుతున్నారు.

అప్పులు సాకుగా చూపుతున్న అధికారులు 

ఆర్టీసీలో 72 జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనో గ్రాఫర్ పోస్టులకు 2018లో టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. రాత పరీక్ష నిర్వహించి 2020, మార్చి 21న ఫలితాలు ప్రకటించింది. ఎంపికైన వారి మెరిట్ లిస్ట్ ను కూడా రిలీజ్ చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసి 72 మంది ఎంపికయ్యారని ప్రకటించింది. తర్వాత నష్టాలు, అప్పులు సాకుగా చూసి పోస్టింగ్​లు ఇవ్వలేదు. జాబ్​లో తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదు. దీంతో అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. అందరినీ డ్యూటీలో తీసుకోవాలని కోర్టు కూడా ఆదేశించింది. ఆర్టీసీ కార్పొరేషన్ నష్టాల్లో ఉందని, త్వరలోనే తీసుకుంటామని కోర్టుకు అధికారులు వివరణ ఇచ్చారు. తర్వాత అభ్యర్థులను పట్టించుకోలేదు.

ఆర్టీసీ ఉన్నతాధికారులకు వినతులు

ఆఫర్ లెటర్ల విషయమై ఆర్టీసీ చీఫ్ పర్సనల్ మేనేజర్, ఈడీ కృష్ణకాంత్​ను పలువురు అభ్యర్థులు ఇటీవల కలిశారు. మీ అంశాన్నే పరిశీలిస్తున్నామని వాళ్లు సమాధానం ఇచ్చినట్లు అభ్యర్థులు తెలిపారు. 2014 నుంచి ఆర్టీసీలో రిక్రూట్​మెంట్లు జరగలేదని, ఉన్న ఉద్యోగులను వీఆర్ఎస్​తో పంపారని చెప్పారు. ఇటీవల 166 మంది కానిస్టేబుల్స్​ను కారుణ్య నియామకాల కింద తీసుకున్నారన్నారు. ఆర్టీసీలో 4వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

మూడేండ్ల సర్వీస్, జీతం లాస్ అయినం

పోస్టింగ్ ఇవ్వాలని కోరితే.. సమ్మె, కరోనా కారణంగా నష్టపోయామని అధికారులు చెబుతున్నారు. రెండు నెలల్లో ఉద్యోగాలివ్వాలని హైకోర్టు ఆదేశించినా పట్టించుకోలేదు. మూడేండ్ల సర్వీస్, జీతం లాస్ అయినం. పోస్టింగ్ ఇవ్వాలని ప్రతి నెలా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా రెండు నెలలు ఆగాలని అంటున్నరు. మిగిలిన వారికి వేరే జాబ్​లు ఇచ్చి జాయిన్ చేయించుకుంటున్నరు. 2018లో మాతో పాటు గ్రూప్ 4కు సెలెక్ట్ అయినవారిని డ్యూటీలో తీసుకున్నరు. మమ్మల్ని ఆర్టీసీ అధికారులు తీసుకోలేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం.
- సెలెక్టెడ్ అభ్యర్థి, ఖమ్మం