లంచం తీసుకోవడంలోనూ కొత్త స్టైల్.. బాధితుల మీద భారం తగ్గిస్తోన్న అవినీతి ఆఫీసర్స్

లంచం తీసుకోవడంలోనూ కొత్త స్టైల్.. బాధితుల మీద భారం తగ్గిస్తోన్న అవినీతి ఆఫీసర్స్

గాంధీనగర్: దేశ ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో లంచాలు తీసుకోవడంలో కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు అవినీతి అధికారులు. లంచం తీసుకోవడం తప్పని తెలిసిన.. తీసుకోవడం మాత్రం ఆపడం లేదు. పని కోసం వచ్చిన బాధితుల నుంచి ముక్కు పిండి లంచం వసూల్ చేస్తున్నారు. కాదు కూడదు అంటే పనులు పెండింగ్‎లో పెట్టేస్తున్నారు. దీంతో చేసేదేమిక లేక మనసు చంపుకుని లంచాలు ఇస్తున్నారు బాధితులు. అయితే.. లంచాలు తీసుకోవడంలోనూ మానవత్వం ప్రదర్శిస్తున్నారు కొందరు అవినీతి ఆఫీసర్లు. లంచం ఇవ్వడం బాధితులకు భారం కాకుండా.. ఇన్‎స్టాల్‎మెంట్ ఆప్షన్స్ ఇస్తున్నారు. 

లంచం డబ్బులను ఒకేసారి కాకుండా ఈఎంఐల రూపంలో తీసుకుంటున్నారు. యాంటి కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారుల విచారణలో ఈ విషయం బయటపడింది. ఇలాంటి కేసులకు సంబంధించిన కొన్ని వివరాలను వెల్లడించారు ఏసీబీ అధికారులు. అధికారులు ఈఎంఐల రూపంలో లంచాలు తీసుకునే ఆచారం గుజరాత్ లో రోజురోజుకు పెరిగిపోతుందని చెప్పారు అధికారులు. దీనిపై గుజరాత్‌ ఏసీబీ డైరెక్టర్ షంషేర్ సింగ్ మాట్లాడుతూ.. ప్రారంభ వాయిదాలు చెల్లించిన తర్వాత ప్రజలు మమ్మల్ని సంప్రదించిన కేసులను మాత్రమే ఏసీబీ దృష్టికి వచ్చాయని తెలిపారు.

Also Read  :రాధిక యాదవ్ హత్యలో మిస్టరీ

  • 2025 మార్చిలో SGST బోగస్ బిల్లింగ్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి నుంచి రూ. 21 లక్షల లంచం డిమాండ్ చేశాడు ఓ ఆఫీసర్. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా తీసుకునేందుకు అంగీకరించాడు. నెలకు రూ.2 లక్షల చొప్పున తీసుకున్నాడు.
  • ఏప్రిల్ 4న, సూరత్‌లో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఒక గ్రామస్థుడి పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి రూ. 85,000 లంచం డిమాండ్ చేశాడు. అంతా మొత్తం ఒకేసారి ఇవ్వలేనని బాధితుడు చెప్పడంతో.. మానవత్వం గల అవినీతి అధికారి వాయిదా పద్దతిలో లంచం డబ్బులు ఇవ్వాలని ఉచిత సలహా ఇచ్చాడు. ముందుగా రూ.35 వేలు ఇచ్చి.. మిగిలిన డబ్బులను మూడు వాయిదాల్లో చెల్లించాలని కండిషన్ పెట్టాడు. 
  • ఓ సైబర్ క్రైమ్ పోలీసు అధికారి పని కోసం తన వద్దకు వచ్చిన వ్యక్తి నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. బాధితుడు రూ.10 లక్షలు ఒకేసారి చెల్లించలేనని చెప్పడంతో.. సదరు పోలీస్ అధికారి జాలి చూపించాడు. లంచం అయితే ఇవ్వాల్సిందే కానీ రూ.10 లక్షలు ఒకేసారి కాకుండా నెలకు రెండున్నర లక్షలు నాలుగు విడతల్లో చెల్లించాలని ఈఎంఐ ఆప్షన్ ఇచ్చాడు. చేసేదేమి లేక బాధితుడు వాయిదా పద్దతిలో లంచం డబ్బులు చెల్లించాడు. 
  • ఒక సీఐడి (క్రైమ్) ఇన్‌స్పెక్టర్ ఒక నేరానికి సంబంధించి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లతో సహా పలు వస్తువులను తిరిగి ఇచ్చేందుకు బాధితుడిని రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశాడు. లంచం డబ్బులను ఒకేసారి కాకుండా నెలకు రూ.10 వేల చొప్పున మొత్తం ఐదు విడతల్లో తీసుకున్నాడు.
  • గుజరాత్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డులోని క్లాస్ II అధికారి ఒకరు ఇన్‌వాయిస్‌లు క్లియర్ చేయడానికి కాంట్రాక్టర్ నుంచి రూ. 1.20 వేలు డిమాండ్ చేశాడు. బాధితుడు ఒకేసారి ఇవ్వలేనని చెప్పడంతో వాయిదాల పద్దతిలో చెల్లించాలని సూచించాడు అవినీతి ఆఫీసర్.  దీంతో నెలకు 40 వేల చొప్పున మొత్తం నాలుగు నెలల్లో రూ. 1.20 వేల లంచం డబ్బులు అధికారికి అప్పజెప్పాడు బాధితుడు.