
గురుగ్రామ్ లో టెన్నిస్ క్రీడాకారిణి రాధికాయాదవ్ హత్య ఓ మిస్టరీగా మారింది. వంటింట్లో వంట చేస్తున్న రాధికా యాదవ్ ను రివాల్వర్ తో కాల్చిన చంపిన ఆమె తండ్రి..ఎందుకు చంపావు అని అడిగితే అతను చెప్పిన కారణాలతో పోలీసులకు సంతృప్తి చెందలేదు..క్రీడాకారిణి హత్యకు అసలు కారణం ఏదో ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో విచారణ చేపట్టారు.
గురువారం (జూలై 10) ఉదయం 10.30 గంటల సమయంలో రాధికాయాదవ్ తన తండ్రి చేతిలో హత్యకు గురైంది. వెనకనుంచి రాధికపై ఆమె తండ్రి దీపక్ యాదవ్ మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. రక్తపు మడుగులో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రి తరలించగా అప్పటికే మృతి చెందింది. ఈ కేసులో నిందితుడు ఆమె తండ్రి దీపక్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
కూతురు రాధికా యాదవ్ ను తాను హత్య చేసినట్లు స్వయంగా ఒప్పుకున్న దీపక్ యాదవ్ ..ఆమెను ఎందుకు చంపావు అని పోలీసులు విచారించగా చెప్పిన కారణాలు అందుకు సరిపోల్చలేవు. తన కూతురు టెన్నిస్ అకాడమి నిర్వహించడం తనకు ఇష్టం లేకనే ఆమెను చంపేశానని దీపక్ యాదవ్ చెబుతున్నారు. అయితే దీపక్ యాదవ్ చెప్పింది నిజమేనా.. రాధికా యాదవ్ ను చంపేందుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
హత్య జరిగిన సమయంలో రాధికాయాదవ్ తల్లి అదే ఇంట్లో ఉన్నట్లు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది. పైపోర్షన్ లో పెద్ద వినిపించిన శబ్దంతో కిందిపోర్షన్ లో ఉన్న ఆమె తల్లి, బాబాయిలు పైకి చూడగా రాధికా యాదవ్ రక్తమడుగులో ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటోంది.. వెంటనే సమీపంలో ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు.
రాధికా యాదవ్ హత్యకు ముందు పదిహేను రోజులుగా తండ్రి దీపక్ యాదవ్ తో ఆమెకు గొడవలు జరుగుతున్నట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. చేతికి గాయం కారణంగా టెన్నిస్ కు గుడ్ బై చెప్పి చిన్న పిల్లలకు కోచింగ్ ఇచ్చేందుకు అకాడమి నడుపుతోంది రాధిక యాదవ్..అయితే ఆమె టెన్నిస్ అకాడమి నడపడం ఆమె తండ్రి దీపక్ యాదవ్ కు ఇష్టం లేదని అందుకే తరుచుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
హత్యకు గల మరో కారణంగా ఆమె సోషల్ మీడియాలో రీల్స్ చేయడం అని తెలుస్తోంది. ఇటీవల ఆమె చేసిన ఓ రీల్స్ లో ఆమె ఓ ప్రేమికురాలిగా నటించినట్లు తెలుస్తోంది. అకాడమీ నడిపించడం, రీల్స్ చేయడం ఆమె తండ్రి దీపక్ యాదవ్ కు నచ్చలేదని అందుకే ఆమెను చంపేశానని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిపారు.
►ALSO READ | 10 రాష్ట్రాలు, 49 వేల కోట్లు : PACL కుంభకోణం సూత్రధారి అరెస్టు..
గురుగ్రామ్ లో దీపక్ యాదవ్ చాలా ఆస్తులు ఉన్నాయని, నెలకొ 15నుంచి 17 లక్షలు రెంట్లే వస్తాయని అతని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే దీపక్ యాదవ్ తన కూతురి సంపాదన మీద జీవిస్తున్నాడని గ్రామస్థులు, చుట్టుపక్కల వారు ఎగతాళి చేస్తున్నారని, ఇది తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిందని పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఈ అవమానాలు, అభద్రతాభావం అతనిలో తీవ్ర ఒత్తిడికి గురి చేసి చివరికి ఈ దారుణానికి పాల్పడేలా చేసినట్లు తెలుస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయినా ఈ నిందలు అతన్ని తీవ్రంగా వేధించాయని మదనపడి తాను హత్య చేసినట్లు దీపక్ యాదవ్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
రాధికా యాదవ్ ఇటీవల మ్యూజిక్ వీడియోలో కనిపించడం కూడా దీపక్ యాదవ్‌కు నచ్చలేదని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ విషయంపై కూడా తండ్రికి అభ్యంతరం ఉందని ఆమె వాటిని తొలగించమని కోరినట్లు సమాచారం. అయితే ఈ కారణాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు.
టెన్నిస్ ప్లేయర్ గా రాధికా యాదవ్ ..
రాధికా యాదవ్ భారత టెన్నిస్‌లో ఎదుగుతున్న క్రీడాకారిణి. ఆమె మార్చి 23, 2000న జన్మించింది. నేషనల్ లెవెల్ టెన్నిస్ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. పలు పోటీల్లో విజేతగా నిలిచింది. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ITF) మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఆమె కెరీర్ బెస్ట్ 113వ ర్యాంక్‌ను చేరుకుంది. హర్యానా మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఐదవ స్థానంలో ఉంది. ఆమె మరణం పట్ల భారత టెన్నిస్ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. దీపక్ యాదవ్ ను రెండు రోజులు కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే దీపక్ యాదవ్ స్వయంగా నేరాన్ని అంగీకరించినప్పటికీ రాధికా తల్లి, మామ వంటి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. రాధికా ఫోన్, సోషల్ మీడియా కార్యకలాపాలను కూడా పరిశీలిస్తున్నారు. పోలీసుల కస్టడీ రాధికా యాదవ్ హత్యకు సంబంధించిన అసలు కారణాలు వెలుగులోకి రానున్నాయి.