మీరు సేఫ్..భయపడొద్దు.. టన్నెల్​లో చిక్కుకున్న వారికి అధికారుల భరోసా

మీరు సేఫ్..భయపడొద్దు.. టన్నెల్​లో చిక్కుకున్న వారికి అధికారుల భరోసా
  • ధైర్యంగా ఉండాలంటూ కార్మికులకు సూచన
  • వర్టికల్ డ్రిల్లింగ్​ పనుల్లో వేగం పెంచిన రెస్క్యూ సిబ్బంది
  • రెండు రోజుల్లో 31 మీటర్ల వరకు తవ్విన మెషిన్

ఉత్తరాఖండ్: ఉత్తరకాశీలోని టన్నెల్​లో చిక్కుకున్న కార్మికులకు అధికారులు ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతున్నారు. వైర్ లెస్, మైక్​లతో మాట్లాడుతూ వారందరినీ క్షేమంగా బయటకు తీసుకొస్తామని, ప్రస్తుతం అదే పనిలో ఉన్నామని తెలిపారు. అందరినీ కాపాడతామని భరోసా ఇచ్చారు. బాధితుల కుటుంబ సభ్యులతోనూ మాట్లాడిస్తున్నారు. లో పల చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తెచ్చేందుకు చేపట్టిన రెస్య్కూ పనుల్లో అధికారులు వేగం పెంచారు. కొండపై నుంచి టన్నెల్​కు వర్టికల్ డ్రిల్లింగ్ పనులను ఆదివారం ప్రారంభించారు. 

86 మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ చేయాల్సి ఉండగా.. సోమవారం నాటికి 31 మీటర్ల డ్రిల్లింగ్ కంప్లీట్ అయింది. కార్మికులు చిక్కుకుపోయి 15 రోజులు గడిచాయి. కార్మికులకు సరిపడా ఆక్సిజన్, ఆహారంతో పాటు మందులను పైప్ లైన్ ద్వారా లోపలికి పంపిస్తున్నారు. 86 మీటర్ల మేర వర్టికల్ డ్రిల్లింగ్ చేయడంతో టన్నెల్ పైకప్పుకు చేసిన కాంక్రీట్, రాడ్లు మొత్తం తొలగిపోతాయి. 

దీంతో కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు లైన్ క్లియర్ అవుతుందని అధికారులు చెప్తున్నారు. శిథిలాల గుండా మ్యానువల్ గా హారిజంటల్ డ్రిల్లింగ్ చేసేందుకు ఆరుగురు సభ్యుల స్పెషల్ టీమ్ కూడా సైట్ చేరుకుందని వివరించారు. ప్రస్తుతం వర్టికల్, హారిజంటల్ డ్రిల్లింగ్​పైనే ఫోకస్ పెట్టామని తెలిపారు. టన్నెల్ బార్కోట్ ఎండ్ నుంచి కూడా హారిజంటల్ డ్రిల్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.

రోజుకు అర మీటర్ నుంచి మీటర్ ముందుకు

వర్టికల్ డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు అందులో 1.2 మీటర్ల పైపులను కూడా వేయాల్సి ఉంటుందని ఆర్మీ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ తెలిపారు. దానిలో నుంచే కార్మికులను పైకి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. మట్టి పొరలతో పాటు శిథిలాల్లో ఏమైనా అడ్డంకులు ఉన్నాయో.. లేదో తెలుసుకునేందుకు ముందు అమర్చిన 200 మిల్లీ మీటర్ల వ్యాసం కలిగిన పైపులు 70 మీటర్ల వరకు చేరుకున్నాయని తెలిపారు. మెయిన్ టన్నెల్​లో మ్యానువల్​గా హారిజంటల్ డ్రిల్లింగ్ ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నట్లు వివరించారు. 

800 మిల్లీ మీటర్ల వ్యాసం కలిగిన పైపుల ఫ్రేమ్​లు కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. క్రమంగా అర మీటర్ నుంచి ఒక మీటర్ మేర ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. అన్ని అనుకున్నట్లు జరిగి.. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉంటే.. 24 నుంచి 36 గంటల్లో 10 మీటర్ల మేర డ్రిల్లింగ్ ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. మ్యానువల్ డ్రిల్లింగ్ చాలా కష్టతరమైన ప్రక్రియ అని, శిథిలాల గుండా 800 మిల్లీ మీటర్ల వ్యాసం కలిగిన పైపులు ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేస్తారని చెప్పారు. మ్యానువల్ డ్రిల్లింగ్ పైప్​లో ఏర్పడే శిథిలాలను తొలగించేందుకు ర్యాట్ హోల్ మైనింగ్ టెక్నిక్ ద్వారా తొలగిస్తున్నామన్నారు. మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్​కు చెందిన ఇంజినీర్ల బృందం డ్రిల్లింగ్ పనులు పర్యవేక్షిస్తున్నది.

కార్మికులకు సైకియాట్రిస్టులతో కౌన్సెలింగ్

టన్నెల్​లో చిక్కుకున్న కార్మికులకు వారి కుటుంబ సభ్యులు ధైర్యం చెప్తున్నారు. ‘‘భయపడకండి.. మీరు సేఫ్ గా బయటికొస్తారు.. ధైర్యంగా ఉండండి’’ అంటూ మోటివేట్ చేస్తున్నారు. కూలిపోయిన భాగంలో పేరుకుపోయిన శిథిలాల నుంచి పైపు ద్వారా పంపించిన మైక్​ సాయంతో కమ్యూనికేట్ అవుతున్నారు. డాక్టర్లు, సైకియాట్రిస్ట్​లు కూడా కార్మికులతో మాట్లాడుతున్నారు. కౌన్సిలింగ్ ఇస్తూ రోజుకు రెండుసార్లు మాట్లాడుతున్నారు. ఉదయం 9 నుంచి 11 దాకా, సాయంత్రం 5 నుంచి 8 దాకా కార్మికుల కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తున్నా రు. కార్మికుల ఫ్యామిలీ మెంబర్స్ కోసం క్యాంప్ ఏర్పాటు చేశారు.