నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి : అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి

నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి :  అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి
  •     అడిషనల్​ కలెక్టర్​ దీపక్ తివారి

దహెగాం/మంచిర్యాల/కుంటాల, వెలుగు: పంచాయతీ ఎన్నికల రెండవ విడత నామినేషన్ల ప్రక్రియను పలు చోట్ల అధికారులు పరిశీలించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం మండలం కోత్మీర్, దహెగాం గ్రామపంచాయతీల్లో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ తనిఖీచేశారు. 

నామినేషన్ ప్రక్రియ మొదలుకొని పరిశీలన, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, ఫొటో ఓటర్ స్లిప్పుల పంపిణీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ ప్రక్రియ, ఫలితాలు వంటి ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులు సమర్పించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. 

బీబ్రాలోని జడ్పీ హైస్కూల్, పెంచికల్ పేట మండలం దరోగాపల్లిలోని ప్రైమరీ స్కూల్​ను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యా బోధన తీరు, కిచెన్ తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తహసీల్దార్ మునావర్​షరీఫ్, మండల పంచాయతీ అధికారులు, ఎన్నికల విభాగం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలి

ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ సూచించారు. హాజీపూర్ మండలంలోని దొనబండ, రాపల్లి పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. శాంతిభద్రతల కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి పోలీసులకు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. 

డీసీపీ వెంట హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ దేశ్ పాండే ,ఎస్సై స్వరూప్ రాజ్ తదితరులున్నారు. నిర్మల్​జిల్లా కుంటాల మండలంలోని కల్లూర్ నామినేషన్ సెంటర్ ను జిల్లా ఎన్నికల పరిశీలకురాలు ఆయేషా మస్రత్ ఖానం పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఎంపీడీవో వనజ, ఎంపీవో రహీం, సిబ్బంది ఉన్నారు.