- అన్ని నియోజకవర్గాల్లో ఫైనల్ వెరిఫికేషన్ కంప్లీట్
- కూకట్పల్లి, శేరిలింగంపల్లిలో టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన పూర్తి
- వచ్చే వారంలోమరికొన్ని చోట్ల భూమిపూజ
హైదరాబాద్, వెలుగు: “తెలంగాణ హౌసింగ్ బోర్డు ఇందిరమ్మ ఇండ్ల ప్రాజెక్ట్ లో మీకు ఇల్లు కేటాయించబడింది. అలాట్మెంట్ లెటర్ మీకు పంపించబడుతోంది. దయచేసి అలాట్మెంట్ లెటర్లో పేర్కొన్న నిబంధనలు, చెల్లింపు షెడ్యూల్, ఇతర సూచనలను జాగ్రత్తగా పరిశీలించి, నిర్దేశించిన గడువులోగా వాటిని పాటించగలరు.” అని ఇందిరమ్మ టవర్స్‌లో ఇల్లు దక్కిన లబ్ధిదారులకు హౌసింగ్ బోర్డు అధికారులు ఫ్లాట్ కన్ఫర్మేషన్ సమాచారం పంపిస్తున్నారు.
వెరిఫికేషన్ కంప్లీట్..
క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో 7,340 ఫ్లాట్లకు మొత్తం 61 వేల మంది అప్లై చేయగా, ఇందులో 40 వేల మంది అర్హులుగా తేలారు. 7,340 ఫ్లాట్లకు లబ్ధిదారులను డ్రా పద్ధతిలో హౌసింగ్ బోర్డు అధికారులు ఎంపిక చేశారు. గత 10 రోజులుగా డ్రాలో ఎంపికైన లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వెరిఫికేషన్ పూర్తి చేశారు. వీరిలో ఇప్పటివరకు 4 వేల మందికి ఫ్లాట్ కన్ఫర్మేషన్ మెసేజ్‌లను అధికారులు పంపారు. వచ్చే రెండు రోజుల్లో మిగతా వారికి కూడా మెసేజ్‌లు పంపుతామని అధికారులు చెబుతున్నారు.
నాలుగు విడతల్లో చెల్లింపు..
డ్రా పద్ధతిలో ఫ్లాట్లు దక్కించుకున్న లబ్ధిదారులు 4 విడతల్లో రూ.6 లక్షలను హౌసింగ్ బోర్డుకు చెల్లించాల్సి ఉంటుంది. మెసేజ్ వచ్చిన వారంలోపు తొలి విడత రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుంది. రెండో విడత స్లాబ్ సమయంలో రూ.2 లక్షలు, మూడో విడత ఫ్లాట్ పని పూర్తయ్యే సమయంలో రూ.2 లక్షలు, ఫైనల్ విడత ఫ్లాట్ లబ్ధిదారుడికి హ్యాండోవర్ చేసే సమయంలో రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
ఫ్లాట్ నిర్మాణానికి రూ.11 లక్షలు ఖర్చు అవుతుండగా, ఇందులో ఇందిరమ్మ ఇంటికి ఇచ్చినట్లు ప్రభుత్వం రూ.5 లక్షలు సబ్సిడీ ఇస్తోంది. ఇంటి రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం ఉచితంగా లబ్ధిదారుడి పేరు మీద చేయిస్తుంది.
నియోజకవర్గాల్లో పనులు షురూ..
16 నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్లకు కూకట్పల్లి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇటీవల రాయదుర్గం (శేరిలింగంపల్లి) నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వచ్చే వారం మరో రెండు నియోజకవర్గాల్లో హౌసింగ్ శాఖ మంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వెరిఫికేషన్ పూర్తయిన లబ్ధిదారులకు మంత్రి ఫ్లాట్ మంజూరు పత్రాలను అందజేశారు.
16 నియోజకవర్గాల్లో ఫ్లాట్ల నిర్మాణం చేపట్టనున్న స్థలాలను ఇప్పటికే టెండర్లు దక్కించుకున్న కంపెనీలు స్వాధీనం చేసుకొని నిర్మాణ పనులు చేపట్టాయి. టెండర్లు దక్కించుకున్న కంపెనీలతో హౌసింగ్ బోర్డు ఇటీవల అగ్రిమెంట్ చేసుకుంది. అగ్రిమెంట్ చేసుకున్న తేదీ నుంచి ఏడాదిలోగా ఫ్లాట్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని కంపెనీలను ఆదేశించింది. వచ్చే ఏడాది బోనాల పండుగను ఇందిరమ్మ టవర్లలోనే లబ్ధిదారులు జరుపుకొంటారని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
