కబ్జాదారులనే కాపాడుతున్నరు

కబ్జాదారులనే కాపాడుతున్నరు
  • లోకాయుక్త ఆదేశాలతో గతేడాది డిజిటల్‍ సర్వే
  • రూ.300 కోట్ల విలువైన 21 ఎకరాలు ఆక్రమించారని నివేదిక
  • 8 నెలలు గడుస్తున్నా ఆక్రమ నిర్మాణాలు తొలగించట్లే.. బౌండరీలు పాతట్లే
  • ఓరుగల్లులో ఆలయ భూముల వివాదంలో ఆఫీసర్ల తీరు

వరంగల్, వెలుగు :  గ్రేటర్​వరంగల్​లోని ప్రముఖ ఆలయాల భూములను కబ్జా చేసిన వారిపై  చర్యలు తీసుకోవాలన్న కోర్టు ఆదేశాలను ఆఫీసర్లు బేఖాతరు చేస్తున్నారు. ఆక్రమణలపై లోకాయుక్త కన్నెర్ర చేయడంతో గతేడాది డిజిటల్ ​సర్వే చేసిన రెవెన్యూ, ఎండోమెంట్​ఆఫీసర్లు రూ.300 కోట్ల విలువ చేసే భూములు కబ్జాకు గురైనట్లు తేల్చారు. ఆక్రమించిన వారిలో అధికార పార్టీ లీడర్లు, ప్రముఖులు ఉండడంతో స్వాధీనానికి వెనుకాడుతున్నారు. కబ్జాదారుల్లో ఎంతటివారున్నా వదిలే ప్రసక్తి లేదని కిందటేడాది మాట్లాడిన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు నోరు మెదపడంలేదు.

కోర్ట్ ఆర్డర్‍ తో డిజిటల్‍ సర్వే.. 

ఎండోమెంట్​ఆఫీసర్ల లెక్కల ప్రకారం.. హన్మకొండలోని పద్మాక్షి ఆలయానికి 72.23 ఎకరాలు, సిద్దేశ్వర టెంపుల్‍ కు 882, 889, 922 సర్వే నంబర్​లో 24.03 ఎకరాలు, సర్వే నంబర్ 879లో వీర పిచ్చమాంబ దేవాలయానికి 1.14 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో 21 ఎకరాలను వివిధ పార్టీల లీడర్లు, బిల్డర్లు, విద్యావేత్తల ముసుగులో కొందరు కొద్దికొద్దిగా కబ్జా చేశారు. ఈ ప్రాంతంలో గజం స్థలం రూ.40 నుంచి50 వేల చొప్పున ఒక్కో ఎకరానికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లు పలుకుతోంది. వీటితోపాటు హనుమకొండలోని రంగనాయకస్వామి ఆలయానికి  బ్రాహ్మణవాడ, ములుగు రోడ్, పెద్దమ్మగడ్డ ఏరియాల్లో ఉన్న 9.32 ఎకరాలు, వరంగల్​లోని వేణుగోపాలస్వామి గుడికి చెందిన 1.11 ఎకరాలు కబ్జా కోరల్లో చిక్కాయి. వీటి విలువ సైతం  రూ.150 కోట్లు ఉంటుంది. కొన్నేండ్లుగా రూలింగ్​ పార్టీ నేతల అండదండలతో కొందరు ఈ భూములను ఆక్రమిస్తున్నా ఆఫీసర్లు చోద్యం చూశారు. టౌన్​ప్లానింగ్ లోని అవినీతి ఆఫీసర్లు ఎడా పెడా నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చేశారు. ఈ క్రమంలో గతేడాది  ‘రాష్ట్ర వినియోగదారుల మండలి, కాకతీయ ఆస్తుల పరిరక్షణ వేదిక’ ఆధ్వర్యంలో కొందరు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు.  వరంగల్​ నడిబొడ్డున ఎండోమెంట్​కు చెందిన  వందల కోట్ల విలువైన భూములు కబ్జా అయిన విషయాన్ని లోకాయుక్తా సీరియస్​గా తీసుకుంది. ఎండోమెంట్, గ్రేటర్, రెవెన్యూ ఆఫీసర్లు కలిసికట్టుగా డిజిటల్‍ సర్వే చేసి ఆక్రమణల నిగ్గుతేల్చాలని  జస్టిస్‍ సీ.వీ.రాములు ఆదేశించారు. కబ్జాలు నిజమని తేలితే ఆక్రమణలు కూల్చేసి శాశ్వత హద్దులు ఏర్పాటు చేయాలని ఆర్డర్​ వేశారు. ఈ క్రమంలో  దేవాదాయశాఖ వరంగల్‍ జోన్ డిప్యూటీ కమిషనర్‍ శ్రీకాంతారావు, అసిస్టెంట్‍ కమిషనర్‍ వీరస్వామి, అసిస్టెంట్‍ డైరెక్టర్‍ ప్రభాకర్ల టీమ్​ ఎన్నో అవాంతరాల మధ్య సర్వే పూర్తి చేసి జనవరి 5న  కోర్టుకు రిపోర్టు అందజేసింది. అయితే కబ్జాలు నిజమని తేలి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు అక్రమ నిర్మాణాలు తొలగించలేదు. రిపోర్ట్​ ఆధారంగా బౌండరీలు ఏర్పాటుచేయాల్సిన ఉన్నతాధికారులు సైలెన్స్​ అయ్యారు. కబ్జా చేసిన వారు ఎవ్వరైనా వదిలేది లేదన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు నోరు మెదపడంలేదు.

కబ్జాదారులపై కేసులు బుక్‍ చేయాలే

ఆలయ భూములను కబ్జా చేసినవాళ్లపై  పకడ్బందీగా కేసులు పెట్టాలె.  లీడర్లు దగ్గరుండి  కబ్జా చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. కోర్టు జోక్యం వల్లే కబ్జాలు బయటకొచ్చాయి.  కనీసం సర్వే చేశాకైనా అక్రమ కట్టడాలను పడగొట్టి బౌండరీలు సెట్​ చేయాల్సి ఉండె. కానీ ఆఫీసర్లు ఎందుకో సైలెన్స్​అయ్యారు.  

- చీకటి రాజు (కాకతీయ ఆస్తుల పరిరక్షణ వేదిక కన్వీనర్)

కబ్జాదారులకే సపోర్ట్​ చేస్తున్రు

ఎండోమెంట్​, రెవెన్యూ ఆఫీసర్లు మొదటినుంచీ అక్రమార్కులకు సహకరిస్తున్నారు. ఆలయ భూముల కబ్జాల విషయమై ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో లోకాయుక్తను ఆశ్రయించాం. కోర్టు ఆదేశాలతో ఆఫీసర్లు డిజిటల్‍ సర్వే చేయించారు తప్పితే.. భూములను స్వాధీనం చేసుకోవట్లేదు.  కావాలనే కొన్ని రికార్డులు మాయం చేసినట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు ఆఫీసర్లు   కబ్జాదారులకు సపోర్ట్​ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది.

- సాంబరాజు చక్రపాణి (వినియోగదారుల మండలి అధ్యక్షుడు)