తెలంగాణలో సంచలనం సృష్టించిన పలు కీలక కేసుల దర్యాప్తుపై సీఐడీ చీఫ్ చారు సిన్హా కీలక అప్‌డేట్స్ ఇచ్చారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నట్లు ఆమె వెల్లడించారు. హెచ్‌సీఏపై గతంలో నమోదైన కేసులతో పాటు, తాజా కేసులపైనా సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోందని చెప్పారు. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఫిర్యాదులపై విచారణ జరిపి... ఇప్పటికే హెచ్‌సీఏ అధ్యక్ష, కార్యదర్శులను సీఐడీ అరెస్ట్ చేసిందని స్పష్టం చేశారు.
ఇక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ-ఫార్ములా రేస్ కేసుపై స్పందిస్తూ... ఈ కేసులో ఇప్పటికే న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేశామని, త్వరలోనే కోర్టులో ట్రయల్స్ కూడా ప్రారంభం అవుతాయని చారు సిన్హా తెలిపారు. మరోవైపు, రాష్ట్రంలో జరిగిన మైనింగ్ అక్రమాల పైన ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని... దీనిపై సీఐడీ పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేసి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందని వెల్లడించారు.
►ALSO READ | డప్పుల ముందు ఆర్సీబీ ఆటగాళ్ల ఊర మాస్ డ్యాన్స్.. నెట్టింట వీడియోలు వైరల్!
చివరగా బెట్టింగ్ యాప్స్ కేసుపై సెలబ్రిటీలకు సీఐడీ చీఫ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు సెలబ్రిటీలు మరోసారి ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే బెట్టింగ్‌లు పెట్టేవాళ్లు కూడా విచక్షణతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సీఐడీ చీఫ్ చారు సిన్హా హితవు పలికారు.
