గుడిసెలను కూల్చివేసిన అధికారులు..

గుడిసెలను కూల్చివేసిన అధికారులు..

జగిత్యాల జిల్లా కోరుట్లలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్న గుడిసెలను పోలీసుల సహాయంతో రెవెన్యూ సిబ్బంది కూల్చి వేశారు. ఈ క్రమంలోనే ఆందోళనలు జరిగే అవకాశం ఉన్నందున గుడిసెలలో ఉన్నవారిని పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. వివరాల్లోకి వెళితే కోరుట్ల పట్టణ శివారులోని 923 సర్వే నెంబర్ లో ఉన్న ప్రభుత్వ భూమిలో గత సంవత్సర కాలంగా ఇళ్లు లేని వారు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీ నాయకులు పట్టాలు ఇస్తామని వాగ్దానం చేయడంతో గుడిసెలు తీసేసి ఇండ్ల నిర్మాణం చేపట్టారు.

 కొందరు బడాబాబులు రంగంలోకి దిగి తాము కూడా పేదలమేంటూ స్థలాలు ఆక్రమించుకున్నారు. ఇది వరకే అధికారులు చాలా సార్లు గుడిసెల తీసేయాలని హెచ్చరించారు.  అయినా గుడిసెలు తీసేయకపోవడంతో అధికార యంత్రాంగం కూల్చి వేతకు సిద్ధపడింది. ఇంటికి కిరాయి కట్టుకోలేని పరిస్థితిలో రాజకీయ నాయకులు చెప్పిన మాటలు నమ్మి డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నామంటున్న బాధితులు చెప్పారు. ఇప్పుడు కూల్చివేస్తే తమకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

జాతీయ రహదారి జాతీయ రహదారి 63 భూసేకరణలో క్లియర్ చేయడానికి ఇండ్లను కూల్చి వేస్తున్నామని రెవెన్యూ అధికారులు తెలిపారు. ప్రభుత్వ స్థలాలను అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ రాజేశ్వర్ హెచ్చరించారు. ఇల్లు లేని వారు తాసిల్దార్ లేదా ఆర్డీవో కార్యాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టి నష్టపోవద్దని ప్రజలను కోరారు.