ఆస్తులు ఆన్ లైన్ చేయాలంటే.. పన్నులు కట్టాల్సిందే!

ఆస్తులు ఆన్ లైన్ చేయాలంటే.. పన్నులు కట్టాల్సిందే!
  • బలవంతంగా ప్రాపర్టీ ట్యాక్స్‌, నల్లా బిల్లుల వసూలు
  • క్యాస్ట్​, ఇన్​కమ్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వబోమని బెదిరింపులు
  • ప్రభుత్వమే ఆదేశించిందంటున్న ఆఫీసర్లు
  • కరోనా కష్టకాలంలో పైసలు ఏడికెంచి తేవాలంటున్న జనం

హైదరాబాద్‌‌, వెలుగుపన్నులు కడితేనే ఆస్తులను ఆన్‌‌లైన్‌‌ చేస్తామంటూ ప్రజలను పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది సతాయిస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్‌‌, నల్లా బిల్లు కట్టిన రశీదులు చూపిస్తేనే పని అవుతుందని తెగేసి చెప్తున్నారు. కరోనా కష్టకాలంలో పనులే సరిగ్గా లేవని, పైసలు ఎక్కడి నుంచి తేవాలని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అయినా సర్వే స్టాఫ్​ వినిపించుకోవడం లేదు.  ఆస్తిని మ్యుటేషన్‌‌  చేయాలన్నా ట్యాక్స్‌‌లు క్లియర్‌‌ చేసి తీరాల్సిందేనని అంటున్నారు. లేకపోతే గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వబోమని బెదిరిస్తున్నారు. ట్యాక్సులు వసూలు చేయాలని ప్రభుత్వమే ఆదేశించిందని ఆఫీసర్లు చెప్తున్నారు. ఆస్తులు ఆన్​లైన్, మ్యుటేషన్​ కాకుంటే ఎక్కడ ఆ ఆస్తులు తమవి కాకుండా పోతాయోనని జనం భయపడుతున్నారు.

అందిన కాడికి దండుకుంటున్నరు

రాష్ట్రంలోని వ్యవసాయేతర ఆస్తులన్నీ ఆన్‌‌లైన్‌‌ చేసి వాటికి మెరూన్‌‌ కలర్‌‌ పాస్‌‌ బుక్‌‌లు ఇస్తామని సీఎం కేసీఆర్‌‌ ప్రకటించి, ఇందుకోసం సర్వే చేయిస్తున్నారు. ఈ సర్వేను కింది స్థాయి ఆఫీసర్లు, సిబ్బంది తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కొందరు సర్వే, మ్యుటేషన్‌‌ పేరుతో ప్రజల నుంచి అందినకాడికి డబ్బులు దండుకుంటున్నారు. ఆస్తుల ఆన్‌‌లైన్‌‌, మ్యుటేషన్‌‌ ఉచితంగా చేయాలని ప్రభుత్వం ఆదేశించినా.. ఆ ఆదేశాలను చాలా చోట్ల కింది స్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదు. పంచాయతీకి ఉన్న బకాయి పన్నులన్నీ చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారు.

సర్టిఫికెట్లు ఇవ్వబోమని బెదిరింపులు

ఇక మీదట క్యాస్ట్‌‌, నేటివిటీ, ఇన్‌‌కం ఇతర సర్టిఫికెట్లన్నీ గ్రామ పంచాయతీల నుంచే ఇవ్వాల్సి ఉంటుందని, ట్యాక్స్​లు కట్టకపోతే, ఆస్తులను ఆన్‌‌లైన్‌‌ చేసుకోకపోతే  ఆ సర్టిఫికెట్లు ఇవ్వబోమని కొందరు కార్యదర్శులు బెదిరిస్తున్నారు. ఎంపీవోలు, ఎంపీడీవోలే తమకు ఇలాంటి ఆదేశాలు ఇచ్చినట్లు వారు చెప్పుకుంటున్నారు. ఈ విషయమై ఎంపీడీవోలను ప్రశ్నించగా ప్రభుత్వం నుంచే ట్యాక్సులు వసూలు చేయాలనే ఆదేశాలు ఉన్నాయని చెప్తున్నారు.

పైసలు లేవంటున్న జనం

సాధారణంగా దసరా పండుగ రోజుల్లో ఊళ్లలో ప్రజల వద్ద పైసలు దొరకడం కష్టం. వ్యవసాయం పెట్టుబడులకే ఎక్కువ మిత్తీలకు అప్పులు తెచ్చుకుంటారు. పైగా ఇది కరోనా టైం కావడంతో  పనులు కూడా పెద్దగా లేవు. అనారోగ్యం బారిన పడితే కూడా దవాఖాన్లలో చూపించుకోలేని పరిస్థితి. ఇలాంటి టైంలో సర్వే పేరుతో పంచాయతీ ఆఫీసర్లు తమ నుంచి బలవంతంగా పన్నులు కట్టించుకోవడంపై జనం ఆందోళన చెందుతున్నారు.

రోజూ అర్ధరాత్రి దాకా సర్వే

పంచాయతీ కార్యదర్శులు (పురుషులు) ప్రతి రోజూ అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వే చేయాలని పంచాయతీరాజ్‌‌ ఆఫీసర్లు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. మహిళా కార్యదర్శులైతే డే టైంలో సర్వే చేయాలని, పురుషులు మాత్రం అర్ధరాత్రి వరకు పనిచేసి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. డెడ్‌‌లైన్‌‌ మీట్‌‌ కావాలంటే రాత్రిపూట కూడా సర్వే చేయాల్సిందేనని చెబుతున్నారు. రాత్రి పూట లైవ్‌‌ ఫొటో ఎలా తీయాలో, అది అప్‌‌లోడ్‌‌ అవుతుందో లేదో అర్థం కావడం లేదని కార్యదర్శులు అంటున్నారు.

సర్వే కోసం ఊళ్లకు అదనపు స్టాఫ్​

పంచాయతీ సెక్రటరీలు లేని ఊళ్లలో ఎంపీడీవో ఆఫీసుల్లో  పని చేస్తున్న జూనియర్​ అసిస్టెంట్లు, టైపిస్టులు, సెర్ప్​ సీసీలను కేటాయించారు. ఈ ఊళ్లలో వీరే ఆస్తుల నమోదును చేపట్టాల్సి ఉంటుంది. అలాగే ఇండ్ల సంఖ్య ఎక్కువగా ఉన్న పెద్ద ఊళ్లలో ఒక్క పంచాయతీ సెక్రటరే ఊరంతా తిరిగే పరిస్థితి లేకపోవడంతో పంచాయతీరాజ్, డీఆర్​డీఏకు చెందిన సిబ్బందిని అదనంగా నియమించారు. 501 ఇండ్ల నుంచి 1,500 ఇండ్లు ఉన్న ఊళ్లకు  పంచాయతీ సెక్రటరీతోపాటు మరొకరిని.. 1,500 నుంచి 2,499 ఇండ్లు ఉన్న ఊళ్లకు  మరో ఇద్దరిని అదనంగా కేటాయించారు. మరోవైపు ఆస్తులు నమోదు చేసే క్రమంలో మొదటి 30 ఇండ్లకు రూ.5 చొప్పున పంచాయతీ సెక్రటరీలకు చెల్లిస్తామని పంచాయతీ రాజ్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ సందీప్‌‌ కుమార్​ సుల్తానియా చెప్పారు. 30 ఇండ్లు దాటాక అదనంగా అసెస్మెంట్ చేసే మరో 30 ఇండ్లకు రూ.10 చొప్పున ఇవ్వనున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శులను ప్రోత్సహించడానికే ఇన్సెంటివ్‌‌ ప్రకటించారు.

గింత తిప్పలు ఎందుకు పెడుతున్నరు?

దసరా పండుగ టైంల పంటల లాగోడికే పైసలు దొరుకయ్. మళ్ల ఇప్పుడు కరోనా టైం. చేతిల చిల్లిగవ్వ ఉంటలేదు. ఇంటిని ఆన్‌లైన్ల పెడుతమని ఆఫీసర్లు వస్తున్నరు. అట్ల పెట్టాల్నంటే  ట్యాక్స్​లు కట్టుమంటున్నరు. మేం బతుకుడే కష్టంగా ఉన్నది. పంచాయతీకి ఎక్కడ్నుంచి పైసలు తెచ్చి కట్టాలె?  ఆన్​లైన్​ చేసుకోకుంటే..  ఏ సర్టిఫికెట్లు  అడిగినా ఇయ్యరట. మాకు గింత తిప్పలు ఎందుకు పెడుతున్నరో తెలుస్తలేదు.

– కె. జమున, ఎల్కతుర్తి

పది ఇండ్లు కూడా సర్వే చేయలేకపోతున్నం

‘‘రోజుకు 70 ఇండ్లను ఆన్‌‌లైన్‌‌ చేయాలని ఆఫీసర్లు టార్గెట్‌‌ పెట్టిన్రు. కానీ మేం పది ఇండ్లను కూడా అప్‌‌లోడ్‌‌ చేయలేకపోతున్నం. ఊళ్లలో సర్వేపై ప్రజలకు అనేక అనుమానాలున్నయ్. మొబైల్‌‌ అప్లికేషన్‌‌ కూడా సతాయిస్తున్నది. మా మండలంలో 34 పంచాయతీలు ఉంటే 20 మంది సెక్రటరీలకే యాప్‌‌ ఇన్‌‌స్టాల్‌‌ చేసిన్రు. ఆస్తుల మ్యుటేషన్‌‌కు లీగల్‌‌ ఎయిడ్‌‌ సర్టిఫికెట్‌‌ తప్పనిసరి అని ఎంపీడీవో చెప్తున్నరు. వాటిపై ప్రజలకు అవగాహన ఉండటం లేదు. సర్వే నంబర్‌‌, కరెంట్‌‌ మీటర్‌‌ ఈ వివరాలన్నీ ఎందుకు అని ప్రజలు అడిగితే వాళ్లకు ఆన్సర్‌‌ చెప్పలేకపోతున్నం’’

– నల్గొండ జిల్లాకు చెందిన ఓ మహిళా పంచాయతీ కార్యదర్శి

యాప్లో సమస్యలే సమస్యలు

ఆస్తుల నమోదు కోసం ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ స్టేట్​ నాన్​ అగ్రికల్చర్​ ప్రాపర్టీ బుక్​(టీఎస్​ ఎన్‌‌పీబీ) అప్‌‌డేషన్  యాప్​  సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నది.  ఫొటోలు తీసేందుకు కెమెరా ఆన్ చేస్తే బఫర్ అవుతున్నది. సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడం, యాప్​ పనితీరు వల్ల ఒక్కో ఇంటికి కనీసం 20 నిమిషాల నుంచి అరగంట పడుతున్నదని పంచాయతీ సెక్రటరీలు అంటున్నారు. ప్రభుత్వం రోజుకు కనీసం 70 ఆస్తులను ఆన్‌‌లైన్​ చేయాలని టార్గెట్​ విధిస్తే.. యాప్‌‌లో తలెత్తుతున్న టెక్నికల్​ సమస్యలతో ఈ సంఖ్య పదికి మించడం లేదు. మరో వైపు ఒక జిల్లాకు చెందిన పంచాయతీ కార్యదర్శి తన ఫోన్​ నంబర్‌‌తో లాగిన్​ అయితే ఇతర జిల్లాల సమాచారం కనిపిస్తున్నది. చాలా చోట్ల  ఫోన్​ నంబర్​, పాస్​వర్డ్ తో లాగిన్​ అయ్యేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా యాప్​ ఓపెన్​ కావడం లేదు. దీంతో ఆయా సెక్రటరీలు ప్రస్తుతం  మాన్యువల్‌‌గా వివరాలు సేకరిస్తున్నారు. ఇలాంటి గ్రామాలు మండలానికో మూడు నుంచి ఐదు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వెయ్యి వరకు ఉండొచ్చు.