నీ సంగతి ఏందో త్వరలో బయటపెడతా: KTR పరువు నష్టం కేసుపై బండి సంజయ్ రియాక్షన్

నీ సంగతి ఏందో త్వరలో బయటపెడతా: KTR పరువు నష్టం కేసుపై బండి సంజయ్ రియాక్షన్

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిరాధార ఆరోపణలు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్‎పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ క్రమంలో కేటీఆర్ పరువు నష్టం దావా కేసుపై బండి సంజయ్ స్పందించారు. సోమవారం (సెప్టెంబర్ 15) ఆయన కరీంనగర్‎లో మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ పరువు నష్టం దావా వేసి బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు.

కేటీఆర్ వేసిన డిఫమేషన్ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. గతంలో తొమ్మిది సార్లు జైల్‎కు వెళ్ళి వచ్చా.. నాపై వందకు పైగా కేసులు ఉన్నాయని ఇలాంటి ఉడత ఊపులకు భయపడేది లేదన్నారు. గతంలో తాను లవంగం తింటే తంబాకు తిన్నానని అన్నారు. కావాలనుకుంటే కేటీఆర్ లాగా నేను పరువు నష్టం దావా కేసులు వేయొచ్చు. కానీ నేను రాజకీయంగా ఎదుర్కొంటా.. ఇలా పరువు నష్టం దావాలు వేసి బెదిరించే ప్రయత్నం చేయనని చెప్పారు.

►ALSO READ | గ్రామాల్లో వీధి దీపాల బాధ్యతలు సర్పంచులకే అప్పగించండి: సీఎం రేవంత్

బీఆర్ఎస్ హయాంలో ఫోన్లు ట్యాప్ చేయకపోతే కుటుంబ సభ్యులతో సహా దేవుడు సన్నిధికి రమ్మని సవాల్ విసిరా. మరీ కేటీఆర్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ అమెరికాలో ఎవరెవరిని కలిశాడో.. ఆయన సంగతి ఏందో త్వరలో బయటపెడతానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. 

కాగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‎పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయ పోరాటానికి దిగారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోన్న సమయంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో బండి సంజయ్‎పై కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్‎పై విచారణను‎ 2025, డిసెంబర్ 15కి వాయిదా వేసింది సిటీ సివిల్ కోర్టు.