పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు 'ఓజీ' సినిమా ఒక పండుగలా మారింది. దర్శకుడు సుజీత్ రూపొందించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కల్యాణ్ స్టైలిష్ లుక్, థమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాపై ఉన్న హైప్‌ని మరింత పెంచాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 25న విడుదల కానున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధమైంది.
సెన్సార్ బోర్డు నుంచి 'ఎ' సర్టిఫికెట్
'ఓజీ' చిత్రం సెన్సార్ బోర్డు నుంచి 'ఎ' సర్టిఫికెట్ పొందింది. సినిమా నిడివి 154.15 నిమిషాలు (2 గంటల 34 నిమిషాల 15 సెకన్లు). వాస్తవానికి ఈ సినిమా రన్‌టైమ్ 156.10 నిమిషాలు కాగా, సెన్సార్ బోర్డు సూచనల మేరకు కొన్ని మార్పులు చేశారు. స్మోకింగ్ సీన్స్‌కు సంబంధించి డిస్‌క్లైమర్, వాయిస్ ఓవర్ ఇవ్వడంతో పాటు కొన్ని హింసాత్మక సన్నివేశాలకు కట్ చెప్పినట్లు సమాచారం. చిత్ర బృందం ఈ మార్పులు చేసి ఫైనల్ వెర్షన్‌ను సిద్ధం చేసింది.
ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు
సినిమా విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో 'ఓజీ' సందడి మొదలైంది. తెలంగాణలో ఈ నెల 24న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోలు ప్రదర్శితం కానున్నాయి. ఈ ప్రత్యేక ప్రదర్శనలకు, అలాగే ఈ నెల 25 నుంచి అక్టోబర్ 4 వరకు టికెట్ ధరలు పెంచడానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో మొదలయ్యాయి.
అంచనాలను పెంచిన ట్రైలర్
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'ఓజీ' ట్రైలర్ ఈ రోజు ( సెప్టెంబర్ 22న ) విడుదలైంది. ట్రైలర్‌లో పవన్ కల్యాణ్ స్టైలిష్ లుక్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, థమన్ నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఓజాస్ గంభీర అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి వంటి తారలు ముఖ్య పాత్రలు పోషించారు. డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
పవన్ కల్యాణ్ స్పందన
హైదరాబాద్‌లో జరిగిన 'ఓజీ కాన్సర్ట్' ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ''ఓజీని ప్రేక్షకులు ఇంత గొప్పగా ప్రేమిస్తారని నేను ఊహించలేదు. 'ఖుషీ' సినిమా సమయంలో ఇలాంటి జోష్ చూశాను. నేను రాజకీయాల్లోకి వెళ్లినా ప్రేక్షకులు నన్ను వదిలిపెట్టలేదని ఈ ఆదరణను బట్టి అర్థమవుతోంది" అని పవన్ అన్నారు. 'ఓజీ' సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
