తనదైన కామెడీ టైమింగ్‌తో యూత్‌కు దగ్గరైన మౌళి మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'లిటిల్ హార్ట్స్'తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కుర్రాడు.. ఇప్పుడు'దొంగ నా కొడుకు' అంటూ సరికొత్త ఎంటర్‌టైనర్‌తో అలరించేందుకు సిద్ధమయ్యాడు. టైటిల్‌తోనే క్యూరియాసిటీ పెంచిన ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు మేకర్స్. 'ఓ మై గాడ్'అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
'ఓ మై గాడ్'అంటూ సందడి..
ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, రామ్ మిరియాల తనదైన గాత్రంతో ఆలపించారు. సింజిత్ ఎర్రమిల్లి సంగీతం సమకూర్చారు. పాటలోని యూత్‌ఫుల్ ఫీల్, క్యాచీ ట్యూన్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ కామెడీ పంచ్‌లతో ఆకట్టుకోగా, ఇప్పుడు ఫస్ట్ సింగిల్‌తోనూ చిత్రబృందం ప్రమోషన్లను జోరుగా కొనసాగిస్తోంది.
దొంగగా మారిన కుర్రాడి కథేంటి?
ఇదొక క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్. ఇందులో మౌళి ఈశ్వర్ అనే యువకుడిగా కనిపించనున్నాడు. బాధ్యత లేకుండా తిరుగుతూ కుటుంబ సభ్యులకు తలనొప్పిగా మారే అతడి జీవితం.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. పరిస్థితుల ప్రభావంతో దొంగతనాలకు దిగిన ఈశ్వర్ ఎలాంటి చిక్కుల్లో పడతాడు? అతడి ప్రయత్నాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? అన్నదే ఆసక్తికరం.
►ALSO READ | RajiniKamal: థియేటర్లలోకి రాకముందే రూ. 150 కోట్ల ఓటీటీ డీల్? రజినీకాంత్-కమల్ హాసన్ల 'ధర్మన్' రికార్డు!
నటుడు అలీ తండ్రి పాత్రలో కనిపిస్తూ తన కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన వ్యక్తిగా నవ్వులు పంచనున్నారు. సుస్మిత శెట్టి కథానాయికగా నటిస్తుండగా, శ్రీను కంబాల రచన, దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సింజిత్ ఎర్రమిల్లి సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 13న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా.. కామెడీ, క్రైమ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
