- ఇప్పుడు మల్లన్న సాగర్‌కు వస్తున్నవి ఎల్లంపల్లి నీళ్లు
- నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కట్టింది కాంగ్రెస్ సర్కారే
- హరీశ్‌కు మంత్రి తుమ్మల కౌంటర్
సిద్దిపేట, వెలుగు: కాళేశ్వరం నీళ్లు రాకముందు నుంచే సిద్దిపేట జిల్లాలో పామాయిల్ తోటలు ఉన్నాయని.. అయినా, పామాయిల్ పండేందుకు నీళ్లు పెద్దగా అవసరం లేదని మాజీ మంత్రి హరీశ్ రావుకు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కౌంటర్ఇచ్చారు. ‘‘కాళేశ్వరానికి జీవనాడి ఎల్లంపల్లి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ సర్కారు స్విచ్నొక్కింది.
కాళేశ్వరం కూలిపోయినా ఎల్లంపల్లి నుంచే మల్లన్న సాగర్‌కు నీళ్లు వస్తున్నాయి. మల్లన్నసాగర్ రాకముందే ఇక్కడ పామాయిల్ తోటల పెంపకం మొదలైంది. పాలకులు మారినా ప్రభుత్వం మారదు. నా స్థానంలో ఎవరున్నా ఇక్కడ ఫ్యాక్టరీ వచ్చేది. ఇక్కడైతేనే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని సీఎంతో తో చెప్పి నిధులు మంజూరు చేసుకున్నాం.
నేను వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాక మొదటి సంతకం నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పైనే పెట్టిన. మొత్తం 30 ఎకరాల్లో 300 కోట్ల వ్యయంతో కేవలం 16 నెలల్లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని నిర్మించాం’’ అని తెలిపారు. ఈ పామాయిల్ఫ్యాక్టరీకి ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభోత్సవం చేయనుండగా, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మంత్రి తుమ్మల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులిద్దరూ మాట్లాడారు.
