నిధుల వేటలో ఓలా: మైక్రోసాఫ్ట్‌‌తో చర్చలు

నిధుల వేటలో ఓలా: మైక్రోసాఫ్ట్‌‌తో చర్చలు

రూ.1,400 కోట్లు ఇవ్వాలని రిక్వెస్ట్​

15 రోజుల్లో తుది నిర్ణయం

న్యూఢిల్లీ: క్యాబ్‌‌ అగ్రిగేటింగ్‌‌ స్టార్టప్‌‌ ఓలా రూ.1,400 కోట్ల ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ కోసం ప్రముఖ ఐటీ సేవల కంపెనీ మైక్రోసాఫ్ట్‌‌తో చర్చలు మొదలుపెట్టింది. సంప్రదింపులు ముగింపుకు చేరుకున్నాయని, 10–15 రోజుల్లో తుది నిర్ణయం వెలువడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయమై వివరణ కోసం ఓలాకు పంపిన ఈ–మెయిల్‌‌కు బదులు రాలేదు. మైక్రోసాఫ్ట్‌‌ కూడా స్పందించేందుకు ఇష్టపడలేదు. ప్రపంచవ్యాప్తంగా కార్ల కంపెనీలకు ‘కనెక్టెడ్‌‌ వెహికిల్‌‌’ ప్లాట్‌‌ఫారాన్ని అందించేందుకు 2017లో ఓలా, మైక్రోసాఫ్ట్‌‌ చేతులు కలిపాయి. ఇక నుంచి కూడా క్లౌడ్‌‌, కనెక్టెడ్‌‌ వెహికిల్స్‌‌ వంటి టెక్నాలజీల అభివృద్ధి కోసం కలిపి పనిచేయాలని రెండు కంపెనీలూ నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

ఓలాకు ఇండియా, ఇంగ్లండ్‌‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌లో దాదాపు 20 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఈ–వెహికిల్స్‌‌, కనెక్టెడ్‌‌ వెహికిల్స్‌‌పై దృష్టి సారించేందుకు అమెరికాలోని బే ఏరియాలో రీసెర్చ్‌‌ యూనిట్‌‌ను స్థాపిస్తామని ఇది ఇటీవల ప్రకటించింది. ఇండియా మార్కెట్‌‌పై పట్టు సంపాదించేందుకు ఓలా, అమెరికాకు చెందిన ఉబర్‌‌తో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఇది పలు కంపెనీల నుంచి మూడు బిలియన్ డాలర్లు (దాదాపు రూ.21 వేల కోట్లు) సేకరించింది. రతన్‌‌ టాటా, సాఫ్ట్‌‌బ్యాంక్‌‌, టెన్సెంట్‌‌ హోల్డింగ్స్‌‌, హ్యుఐండై మోటార్‌‌ కంపెనీ, కియా మోటార్స్‌‌, సచిన్ బన్సల్‌‌, మరికొందరు ఓలాలో ఇన్వెస్ట్‌‌ చేశారు. సిరీస్‌‌ జే ఫండింగ్‌‌లో భాగంగా ఇది ఏఆర్‌‌కే ఓలా ప్రి ఐపీఓ ఫండ్‌‌ నుంచి రూ.35.8 కోట్లు సేకరించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఓలా వచ్చే కొన్నేళ్లలో ఐపీఓకు రానుంది.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి