వృద్ధ దంపతులను చంపింది పాత నేరస్తుడే : డీసీపీ కోటిరెడ్డి

వృద్ధ దంపతులను చంపింది పాత నేరస్తుడే : డీసీపీ కోటిరెడ్డి
  • అల్వాల్ ​హత్య కేసును 48 గంటల్లో ఛేదించాం
  • డీసీపీ కోటిరెడ్డి

అల్వాల్, వెలుగు: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్య నగర్ లో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. కరుడుగట్టిన పాత నేరస్తుడే వారిని మర్డర్​చేశాడని, 48 గంటల్లోనే అరెస్ట్ చేశామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. సూర్యనగర్​కే చెందిన చింతకింది అనిల్​డబ్బుల కోసం పలు నేరాలు చేస్తుంటాడు. ఈ నెల 3న రాత్రి నిద్రిస్తున్న వృద్ధ దంపతులు అల్లి కనకయ్య(70), రాజమ్మ(65)పై సెంట్రింగ్ కర్రతో దాడి చేశాడు.

తలకు తీవ్ర గాయాలవడంతో ఇద్దరూ మృతిచెందారు. తర్వాత రాజమ్మ మెడలోని పుస్తె, ఇంట్లోని రూ.లక్ష, వెండి, రెండు ఫోన్లు ఎత్తుకెళ్లాడు. మరుసటి రోజు మృతుల కుమారుడి ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో అనిల్​ను బుధవారం అరెస్ట్​చేశారు. అతని వద్ద నుంచి రెండు ఫోన్లు, పుస్తె,150 గ్రాముల వెండి, రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. అనిల్​పై చోరీలు, అత్యాచారం, హత్య కేసులు మొత్తం 29 ఉన్నాయని, అతనిపై కేడీ షీట్ ఓపెన్ చేసినట్లు పేర్కొన్నారు. అత్యాచారం, మర్డర్​కేసుల్లో జైలుకెళ్లి, గత ఏప్రిల్ 26న బయటకు వచ్చాడని తెలిపారు.