వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి .. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఘటనలు

వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి .. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఘటనలు

చేర్యాల/ఝరాసంగం/తూప్రాన్‌‌/రామచంద్రాపురం/కుకునూరుపల్లి, వెలుగు: ఉమ్మడి మెదక్‌‌ జిల్లాలో మంగళవారం వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు చనిపోయారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం గుర్జకుంట గ్రామానికి చెందిన ఎర్ర నర్సింలు(34) బైక్‌‌ పై వెళ్తుండగా.. అదే గ్రామానికి చెందిన బండారి రమేశ్‌‌, నంగి రాజు ఎదురుగా వచ్చి ఢీకొట్టారు. 

ఈ ప్రమాదంలో నర్సింలు స్పాట్‌‌లోనే చనిపోగా.. రమేశ్‌‌, రాజుకు తీవ్రగాయాలు కాగా హాస్పిటల్‌‌లో చికిత్స పొందుతున్నారు. సంగారెడ్డి మండలం ఝరాసంగంలో రెండు బైక్‌‌లు ఢీకొని వికారాబాద్ జిల్లా స్టేషన్ మర్పల్లి మండలం తుమ్మన్‌‌పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి స్పాట్‌‌లోనే చనిపోయాడు. కొల్లూర్ పీఎస్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన కర్నేన జనార్ధన్‌‌రావు(45) చనిపోయాడు. 

జనార్దన్‌‌రావు తెల్లాపూర్‌‌‌‌లోని ఓ నిర్మాణ సంస్థలో మెకానికల్ ఇంజినీర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు బైక్ పై బయలుదేరాడు. మార్గమధ్యలో రాజపుష్ప సర్కిల్ వద్దకు రాగానే ఓ టిప్పర్ అతివేగంగా వచ్చి  ఢీకొట్టింది. దీంతో జనార్దన్ తల పగిలిపోయి స్పాట్‌‌లోనే చనిపోయాడు. 

మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ తోటి ఉద్యోగులు, కార్మికులు రోడ్డుపై నిరసన చేపట్టడంతో పోలీసులు కలుగజేసుకొని సర్ది చెప్పారు. మెదక్ జిల్లా తూప్రాన్‌‌ మండలం ఇమాంపూర్‌‌‌‌లో బైక్‌‌ను ఢీసీఎం వెనుక నుంచి ఢీకొనడంతో మనోహరాబాద్ గ్రామానికి చెందిన చిత్తారి బుచ్చయ్య(50) చనిపోయినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. 

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల విద్యుత్ సబ్‌‌స్టేషన్‌‌ ఎదుట రోడ్డు దాటుతుండగా మార్కుకు గ్రామానికి చెందిన అచ్చంగారి కృష్ణ (28) గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయినట్లు ఎస్సై తెలిపారు.