
జయశంకర్ భూపాలపల్లి/హైదరాబాద్, వెలుగు: జయశంకర్- భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పాండవుల గుట్టపై మరో శాసనం బయటపడింది. చారిత్రక ప్రాధాన్యమున్న తెలుగు– కన్నడ శాసనాన్ని కనుగొన్నట్లు పురావస్తు శాస్త్రవేత్త, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో శివనాగిరెడ్డి, యువ చరిత్రకారుడు, టార్చ్ సంస్థ కార్యదర్శి అరవింద్ ఆర్య వెల్లడించారు. ఇటీవల పాండవుల గుట్ట, చుట్టుపక్కల ప్రదేశాల్లో జరిపిన పరిశోధనల్లో ఎదురు పాండవులు అని పిలిచే రాక్ షెల్టర్ పైకప్పుపై ఈ శాసనం కనిపించిందని తెలిపారు. లేబుల్ శాసనంలో ‘శ్రీ ఉత్పత్తి పిడుగు’అని రాసి ఉందని, ఈ లిపిని బట్టి ఇది 1,100 ఏండ్ల (8- లేదా 9వ శతాబ్దం) నాటి రాష్ట్ర కూటుల కాలానికి చెందినదిగా నిర్ధారించారు. ఇదే గుట్టలో గొంతెమ్మ గుహ అని పిలిచే మరో ప్రదేశంలో ఇలాంటి శాసనాన్నే1990లో కనుగొన్నారని శివనాగిరెడ్డి గుర్తుచేశారు. ఇలాంటి లఘు శాసనాలు ఏపీ, తెలంగాణలో 11 చోట్ల, మహారాష్ట్రలో మరోచోట దొరికాయన్నారు. కాజీపేట దర్గా శాసనం ఆధారంగా రాష్ట్ర కూటుల నాటి శిల్పుల సంఘానికి ‘ఉత్పత్తి పిడుగు’ అనే అర్థముందని చెప్పారు.