బోయింగ్ 727 క్రాష్.. ఒక ప్రయోగం

బోయింగ్ 727 క్రాష్.. ఒక ప్రయోగం

అది బోయింగ్ 727 విమానం. బయలుదేరిన కాసేపటికే కుప్పకూలి రెండు ముక్కలైంది. 

కట్ చేస్తే.. 

అది ప్రమాదం కాదు. ఒక ప్రయోగం మాత్రమే. 

బోయింగ్ 727 విమానం ఒకవేళ కూలితే.. ఏ సీట్లలో కూర్చున్న ప్రయాణికులు సేఫ్ గా ఉంటారు ? అనేది తెలుసుకునేందుకు మెక్సికో శాస్త్రవేత్తలు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రాక్టికల్ అది. 

పైగా ఆ వీడియో ఏడాది కిందటిదో.. రెండేళ్ల కిందటిదో కాదు.. పదేళ్ల కిందటిది. 

2012 సంవత్సరంలో ఈ ప్రయోగం మెక్సికోలోని ఒక ప్రదేశంలో జరిగింది. ఇందుకోసం ఎండిపోయిన సరస్సు ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు. 

అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాల శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. అప్పట్లో ఈ ప్రయోగం వీడియోలను టీవీ చానళ్లలోనూ ప్రసారం చేశారు.

ప్రయోగం ఇలా జరిగింది..

ఈ ప్రయోగం కోసం బోయింగ్ 727 విమానంలో ప్రత్యేక సైంటిఫిక్ పరికరాలను అమర్చారు. విమానంలోని సీట్లలో ప్రయాణికుడిని తలపించే కొన్ని బొమ్మలను తయారు చేసి కూర్చోబెట్టారు. కెమెరాలను అమర్చారు. అనంతరం ఒక పైలట్ ఆ విమానాన్ని కొంతదూరం నడిపాడు. ఆ తర్వాత అతడు పారచూట్ ద్వారా విమానం నుంచి బయటికి జంప్ చేశాడు. అనంతరం ఆ విమానాన్ని రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తూ కూలిపోయేలా వదిలేశారు. గంటకు దాదాపు 225 కిలోమీటర్ల వేగంతో విమానం కూలిపోయింది.

ఘోరంగా దెబ్బతిన్న ఫస్ట్ క్లాస్

విమానంలోని డమ్మీ ప్రయాణికుల బొమ్మలన్నింటికి బాగా గాయాలైనట్లు గుర్తించారు. ప్రధానంగా విమానం ఫస్ట్ క్లాస్ విభాగం చాలా ఘోరంగా దెబ్బతింది. ఫస్ట్ క్లాస్ విభాగంలో ఉండే ప్యాసింజర్స్ బతికే చాన్సే ఉండదని శాస్త్రవేత్తలు అప్పట్లో ప్రయోగం అనంతరం తెలిపారు. విమానంలో చివర్లో ఉండే సీట్లలో కూర్చునే వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారని చెప్పారు.  వాస్తవానికి ఈ ప్రయోగాన్ని అమెరికాలో నిర్వహించాలని తొలుత భావించారు. కానీ అక్కడ అనుమతులు లభించకపోవడంతో మెక్సికోలో నిర్వహించారు. తాజాగా Tangsu Yegen అనే వ్యక్తి ట్విట్టర్ ఈ ప్రయోగం వీడియోను ట్విట్టర్ లో సెప్టెంబరు 13న షేర్ చేశాడు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే దానికి 2 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. లైక్స్, రీట్వీట్స్ కూడా వేలాది వెల్లువెత్తాయి.