పుతిన్ ఉక్రెయిన్​కు ఇండిపెండెన్స్​ డే విషెస్​ !

పుతిన్ ఉక్రెయిన్​కు ఇండిపెండెన్స్​ డే విషెస్​ !

కీవ్​: ఉక్రెయిన్‌‌పై రష్యా వార్​ ప్రారంభించి ఆరు నెలలైంది. ఒకప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్​కు ఇండిపెండెన్స్​ డే విషెస్​ చెప్పారు. ఇది సోషల్​ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆగస్ట్ 24, 2007 నాటి క్రెమ్లిన్ పత్రికా ప్రకటన ప్రకారం.. సోవియట్ యూనియన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన ఉక్రెయిన్​కు 16వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అప్పటి ఉక్రెయిన్​ అధ్యక్షుడు విక్టర్ యుష్చెంకోకు "గౌరవంగా" అభినందన సందేశాన్ని పుతిన్​ పంపారు.  "మన ప్రజలు శతాబ్దాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్నారు. అందరూ స్నేహపూర్వక సంబంధాలతో ముడిపడి ఉన్నారు" అని పుతిన్ లేఖలో పేర్కొన్నారు.  "ఈ రోజు ఉన్న స్థిరత్వం, స్థిరమైన అభివృద్ధి, ఉక్రెయిన్​ ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తాయి. ఇవి ప్రజాస్వామ్య సూత్రాలు. మన రెండు దేశాల ప్రధాన ప్రయోజనాలకు సంబంధించినవని నేను నమ్ముతున్నాను" అని పుతిన్​ చెప్పారు.

భద్రతామండలిలో రష్యాకు వ్యతిరేకంగా ఇండియా ఓటు

వాషింగ్టన్: ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో ఇండియా తొలిసారిగా రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. ఉక్రెయిన్ 31వ ఇండిపెండెన్స్ డే (ఆగస్టు 24) సందర్భంగా బుధవారం యూఎన్ఎస్సీలో ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించడాన్ని వ్యతిరేకిస్తూ రష్యా ప్రొసీజరల్ ఓటింగ్​ను కోరింది. ఓటింగ్ నిర్వహించగా.. 15 సభ్యదేశాల్లో ఇండియా సహా 13 దేశాలు జెలెన్ స్కీ ప్రసంగానికి మద్దతుగా ఓటేశాయి. చైనా గైర్హాజరు అయింది.