పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్ధురాలు మృతి...

పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్ధురాలు మృతి...

ఏపీలో పెన్షన్ పంపిణీ రద్దు అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల విమర్శలు ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంటే, పెన్షన్ కోసం సచివాలయాల వద్ద వృద్ధులు పడిగాపులు కాస్తూ ఎండ వేడికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బ తగిలి 80ఏళ్ళ వృద్ధురాలు మరణించింది. కృష్ణా జిల్లా గంగూరు చెందిన వజ్రమ్మ పెన్షన్ కోసం సచివాలయం వద్దకు వెళ్లి వడదెబ్బకు గురై మరణించింది. వజ్రమ్మ మరణం ఆమె కుటుంబంలో విషాదం నింపింది.

సచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో వృద్దులు ఈ తెల్లవారుజాము నుండే సచివాలయ కేంద్రాల వద్ద క్యూలు కట్టారు. అయితే, పెన్షన్ కి సంబంధించిన సొమ్ము బ్యాంకుల్లో జమ కావటం ఆలస్యం అవ్వటంతో పెన్షన్ పంపిణీ చాలా చోట్ల ప్రారంభం కాలేదు. దీంతో వృద్దులు, వికలాంగులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. మరి కొన్ని చోట్ల పెన్షన్ రేపు ఇస్తామని చెప్పటంతో వృద్దులు, వికలాంగులు వెనుదీరగాల్సి వచ్చింది. చాలా చోట్ల వృద్దులు ఎండ వేడిమికి తాళలేక సొమ్మసిల్లిన ఘటనలు కూడా జరిగాయి.