లోక్​సభ స్పీకర్​గా బిర్లా : స్టూడెంట్ లీడర్​ నుంచి స్పీకర్​ దాకా

లోక్​సభ స్పీకర్​గా బిర్లా : స్టూడెంట్ లీడర్​ నుంచి స్పీకర్​ దాకా

న్యూఢిల్లీ17వ లోక్​సభ స్పీకర్​గా రాజస్థాన్​కు చెందిన ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్​ దాఖలు చేసిన ఆయనకు, కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ, ఇతర ప్రతిపక్ష పార్టీలూ సపోర్ట్​ ఇచ్చాయి. నామినేషన్​ దాఖలుకు మంగళవారమే చివరిరోజు కావడం, వేరే అభ్యర్థులెవరూ పోటీకి దిగకపోవడంతో స్పీకర్​గా బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లైంది. అయితే ఈ విషయాన్ని నేడు(బుధవారం) అధికారికంగా వెల్లడిస్తారు. ఆ తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. రాజస్థాన్​లోని కోటా లోక్​సభ స్థానం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లాకు, అంతకుముందు మూడు సార్లు కోటా(సౌత్​) ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవముంది.

లోక్​సభ స్పీకర్​ పోస్టు రాజస్థాన్​కు దక్కనుండటం ఇదే తొలిసారి. స్పీకర్​ క్యాండేట్​గా బిర్లా పేరును ప్రపోజ్​ చేస్తూ బీజేపీ.. మంగళవారం లోక్​సభ సెక్రటేరియట్​కు నోటీసు ఇచ్చింది. ఎన్డీఏ పార్టీలకుతోడు ఎన్డీఏలో లేని వైఎస్సార్​సీపీ, బీజేడీ పార్టీల మద్దతూ తమకున్నట్లు నోటీసులో పేర్కొంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాల్ని వెల్లడించారు. స్పీకర్​ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించాల్సిందిగా కాంగ్రెస్​ను కూడా కోరినట్లు జోషి తెలిపారు. కొత్త స్పీకర్​గా బాధ్యతలు చేపట్టబోతున్న ఓం బిర్లా ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. స్వీట్లు తినిపించుకుంటూ కుటుంబీకులు సంతోషాన్ని పంచుకున్నారు. పేరు ప్రకటించిన కొద్దిసేపటికే బిర్లా.. మాజీ స్పీకర్​ సుమిత్రా మహాజన్​ను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

డిసైడ్​ చేసింది మోడీ–షానే

సాధారణంగా అన్ని పార్టీలూ సుదీర్ఘ అనుభవమున్న నేతలను మాత్రమే స్పీకర్​ స్థానంలో కూర్చోబెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఫస్ట్​టైమ్​ లేదా సెకండ్​టైమ్​ ఎంపీలకు ఈ అవకాశం దక్కడం చాలా అరుదు. 16వ లోక్​సభకు స్పీకర్​గా వ్యవహరించిన సుమిత్రా మహాజన్​కు ఎనిమిదిసార్లు ఎంపీగా పనిచేసిన అనుభవముంది. ఆమె వారసుడెవరనేదానిపై కొద్దిరోజులుగా ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఎంతోమంది సీనియర్లున్నా, సెకండ్​ టైమ్​ ఎంపీ ఓం బిర్లాకే అవకాశం కల్పించాలన్న నిర్ణయం పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ చీఫ్​ అమిత్​ షాలదేనని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

స్టూడెంట్ లీడర్​ నుంచి స్పీకర్​ దాకా

బీజేపీని ప్రాణపదంగా ప్రేమిస్తానని చెప్పే ఓం బిర్లా.. ఏబీవీపీ లీడర్​గా పొలిటికల్​ కెరీర్ ప్రారంభించారు. డిగ్రీదాకా కోటాలోనే చదువుకున్న ఆయన, అజ్మీర్​లోని మహర్షి దయానంద సరస్వతి యూనివర్సిటీ నుంచి కామర్స్​లో మాస్టర్స్​ చేశారు. 1987లో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదే సంస్థలో ఒక్కోమెట్టెక్కుతూ స్టేట్​ ప్రెసిడెంట్​గా, నేషనల్​ వైస్​ ప్రెసిడెంట్​గా బాధ్యతలు నిర్వహించారు. ఆ టైమ్​లో బిర్లా, జేపీ నడ్డా సహచరులు.  1992 నుంచి 95 రాజస్థాన్​ కాన్​ఫెడ్​ చైర్మన్​గా సేవలందించారు. దక్షిణ రాజస్థాన్​ రాజకీయాలను ప్రభావితం చేసే ‘మార్వాడీ బనియా’ కమ్యూనిటీకి చెందిన ఓం బిర్లా 2003లో తొలిసారి చట్టసభకు ఎన్నికయ్యారు. కోటా సౌత్​ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ మంత్రిని ఓడించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. అదే సీటు నుంచి వరుసగా మూడు సార్లు గెలిచారు. 2014లో పార్టీ ఆదేశాల మేరకు కోటా లోక్​సభ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధిచారు. 2019లో రెండో సారి గెలిచారు. ప్రస్తుతం రెండు(పిటిషన్లు, ఎనర్జీ) పార్లమెంటరీ కమిటీల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. సామాజిక సేవలోనూ తనదైన ముద్రవేశారు. సొంత ఊరు కోటాలో పేదలకు అన్నం పెట్టే పనిని గత పాతికేండ్లుగా నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. వందలసార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయించారు. కోటా సిటీకి చంబల్​ నదీ జనాల్ని రప్పించడంలో, ఐఐటీ ఏర్పాటులో ఆయన కృషిని జనం గుర్తుచేసుకుంటారు. ‘పార్టీ ఫస్ట్​ నేషన్​ నెక్ట్స్​, పర్సనల్​ లాస్ట్’ అనే సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించే నాయకుడిగా బీజేపీలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. సుదీర్ఘకాలం కలిసి పనిచేసిన సహచరుడు జేపీ నడ్డా బీజేపీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా ఎన్నికైన కొద్దిగంటలకే స్పీకర్​ పదవి బిర్లాను వరించడం విశేషం.

డిప్యూటీ స్పీకర్​ ఎవరు?

ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు దాదాపు అన్ని పార్టీలూ మద్దతు తెలపడంతో లోక్​సభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసినట్లైంది. అయితే డిప్యూటీ స్పీకర్​పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఆ పదవి ఎన్డీఏ మిత్రుల్లో ఒకరికి లేదా అనుకూల పార్టీలకు కేటాయించాలని బీజేపీ భావిస్తున్నది. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా డిప్యూటీ పదవికి పోటీపడే అవకాశాలున్నట్లు సమాచారం. లోక్​సభలో కాంగ్రెస్​ లీడర్​ అధిర్​ రంజన్​చౌధురి.. డిప్యూటీ స్పీకర్​ అంశంపై సమాధానాన్ని దాటవేశారు.