
- ఏక్రగీవంగా ఎన్నుకున్న పార్టీ నేతలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) పార్టీ శాసనసభాపక్ష నేతగా ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని గురువారం శ్రీనగర్ లో పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ‘‘శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో పార్టీ నేతలు తమ నాయకుడిగా ఒమర్ అబ్దుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి పార్టీల మధ్య సమావేశం శుక్రవారం జరుగుతుంది” అని చెప్పారు.
ఎన్సీకి నలుగురు స్వతంత్రుల మద్దతు
ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లాకు నలుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. ఇందర్వాల్ నుంచి గెలిచిన ప్యారే లాల్ శర్మ, ఛంబ్ నుంచి గెలుపొందిన సతీశ్ శర్మ, సూరన్ కోట్ నుంచి విజయం సాధించిన చౌదరి మహమ్మద్ అక్రమ్, బానీ నుంచి గెలిచిన డాక్టర్ రామేశ్వర్ సింగ్ ఎన్సీకి మద్దతు తెలిపారు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో 95 స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెజార్టీ మార్కు 48 సీట్లు సాధించాలి.