తుల్‌‌బుల్‌‌ ప్రాజెక్టుపై అబ్దుల్లా వర్సెస్ ముఫ్తీ

తుల్‌‌బుల్‌‌ ప్రాజెక్టుపై అబ్దుల్లా వర్సెస్ ముఫ్తీ

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ మధ్య మాటల యుద్ధం నడిచింది. తుల్‌‌బుల్‌‌ ప్రాజెక్టు విషయంలో ఇద్దరు నేతల మధ్య సోషల్‌‌ మీడియాలో వార్ జరిగింది. సింధు జలాల ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో తుల్‌‌బుల్‌‌ నావిగేషన్‌‌ బ్యారేజీ ప్రాజెక్టును పునరుద్ధరించాలని ఒమర్ అబ్దుల్లా కోరారు. ‘‘తుల్‌‌బుల్ ప్రాజెక్టును 1980లో చేపట్టారు. కానీ సింధు జలాల ఒప్పందం పేరుతో దాన్ని పాకిస్తాన్ అడ్డుకుంది. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేసిన నేపథ్యంలో తుల్‌‌బుల్ ప్రాజెక్టును పూర్తిచేస్తే, జీలం నదిని నావిగేషన్‌‌గా ఉపయోగించుకునేందుకు వీలుంటుంది. 

అంతేకాకుండా దిగువ ఉన్న ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి మెరుగుపడుతుంది” అని గురువారం ‘ఎక్స్‌‌’లో ఒమర్ అబ్దుల్లా పోస్టు పెట్టారు. దీనిపై ముఫ్తీ శుక్రవారం స్పందిస్తూ.. ‘‘యుద్ధం అంచుల దాకా వెళ్లిన రెండు దేశాలు ఇప్పుడే ఒకడుగు వెనక్కు వేశాయి. ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రెచ్చగొట్టడమే. ఇవి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు. జీవనాధారమైన నీటిని ఆయుధంగా మార్చడం అమానవీయం. ఇది ద్వైపాక్షిక అంశాన్ని అంతర్జాతీయ అంశంగా మార్చే ప్రమాదం ఉంది” అని అన్నారు. 

పాక్ ప్రయోజనాలు ముఖ్యమా?: అబ్దుల్లా 

ముఫ్తీ చేసిన కామెంట్లకు ఒమర్ అబ్దుల్లా కౌంటర్ ఇచ్చారు. ‘‘సింధు జలాల ఒప్పందం జమ్మూకాశ్మీర్‌‌‌‌కు జరిగిన చారిత్రక ద్రోహం. మీరు (ముఫ్తీ) దాన్ని అంగీకరించకుండా.. చీప్ పబ్లిసిటీలో భాగంగా సరిహద్దుకు ఆవల ఉన్న ప్రజల ప్రయోజనాల కోసం వ్యతిరేకించడం దురదృష్టకరం” అని ఆయన మండిపడ్డారు. ‘‘నేను మొదటి నుంచీ సింధు జలాల ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాను. భవిష్యత్తులోనూ వ్యతిరేకిస్తా. ఒక అన్యాయమైన ఒప్పందాన్ని వ్యతిరేకించడం యుద్ధోన్మాదం కాదు. మన నీటిని మన ప్రజలు వాడుకోకుండా అడ్డుగా ఉన్న ఆ ఒప్పందాన్ని మార్చాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు.