ఒమిక్రాన్ భయం: అనవసరంగా ప్రయాణాలొద్దు

ఒమిక్రాన్ భయం: అనవసరంగా ప్రయాణాలొద్దు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 101కి చేరాయి. ఈ క్రమంలో కరోనా జాగ్రత్తల విషయంలో జనం నిర్లక్ష్య ధోరణి పనికిరాదని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ సూచించారు. వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తి చేసుకోవాలని, తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని చెప్పారు. గుంపుల్లో తిరగకుండా ఉండడం చాలా ముఖ్యమని  ఆయన అన్నారు. దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు బాగా పని చేస్తున్నాయని వీకే పాల్ చెప్పారు. బూస్టర్ డోస్‌ ఇవ్వాలా? వద్దా? అన్నదానిపై శాస్త్రీయమైన ఆధారాలతో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

తప్పనిసరి అయితేనే ప్రయాణాలు.. లేకుంటే వద్దు

కాగా, దేశంలో మొత్తం 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. మ‌హారాష్ట్రలో అత్యధికంగా 32 కేసులు ఉండ‌గా, ఢిల్లీలో ఈ సంఖ్య 22 కి చేరినట్లు చెప్పారు.  ఒమిక్రాన్ క‌ట్టడికి అన్నిర‌కాల చ‌ర్యలు తీసుకుంటున్నామ‌ని, అంద‌రూ త‌ప్పకుండా కరోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవడంలో మన వ్యాక్సిన్లు సమర్థంగా పని చేయడం లేదనడానికి ఎటువంటి ఆధారాలు లేవన్నారు. అయితే ఈ కొత్త వేరియంట్ వేగంగా  వ్యాప్తి చెందుతోందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అలర్ట్ చేశామని అన్నారు లవ్ అగర్వాల్. తప్పనిసరి అయితే మాత్రమే ప్రయాణాలు చేయాలని, సామూహిక సమావేశాలకు దూరంగా ఉండాలని సూచించారు. న్యూ ఇయర్ వేడుకలను సింపుల్ గా జరుపుకోవాలన్నారు.