భారత్ లో మూడో ఒమిక్రాన్ కేసు నమోదు

భారత్ లో మూడో  ఒమిక్రాన్  కేసు నమోదు

దేశంలో మరో ఒమిక్రాన్ కేసు బయటపడింది. జింబాబ్వే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారించారు. అతను జామ్ నగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే అతని శాంపిల్స్ ని మరోసారి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పుణే పంపించినట్టు గుజరాత్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఓవరాల్ గా దేశంలో ఇది మూడో ఒమిక్రాన్ కేసు. రెండు రోజుల క్రితం కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఓ సౌతాఫ్రికా పౌరుడికి ఒమిక్రాన్ నిర్ధారణ కాగా... అతను నవంబర్ 27నే దేశం వదిలి వెళ్లిపోయాడు. మరో 46 ఏళ్ల డాక్టర్ లోనూ ఒమిక్రాన్ బయటపడింది. అతని కాంటాక్ట్స్ గా ఉన్న ఐదుగురికి కూడా కరోనా పాజిటివ్ రాగా... జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. వాటి రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. 

సౌతాఫ్రికాతో పాటు ఇతర దేశాల్లో ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలకు ఈ వేరియంట్ శరవేగంగా విస్తరిస్తోంది. భారత్ లోనూ రోజురోజుకు ఒమిక్రాన్ అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. విదేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్ పోర్టుల్లో విస్తృత పరీక్షలు చేస్తున్నారు.. లక్షణాలు ఉంటే క్వారంటైన్ లో ఉంచి.. జీనోమ్ సీక్వెన్స్ కోసం ల్యాబ్ కు పంపుతున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీలో ఒమిక్రాన్ అనుమానిత కేసులు 12కు చేరాయి. వీళ్లందరి శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్స్ కు పంపించినట్లు అధికారులు తెలిపారు.